MG Majestor : ఎంజీ నుంచి 'మహారాజు' లాంటి ఎస్యూవీ.. ఇక ఫార్చ్యూనర్ పని అయిపోయినట్టేనా?
ఎంజీ మెజెస్టర్ మరికొన్ని రోజుల్లో భారతీయుల ముందుకు రానుంది. అయితే, ఫిబ్రవరి 12 లాంచ్‌కి ముందే ఈ బడా ఎస్‌యూవీని సంస్థ పూర్తిగా రివీల్ చేసింది. ఈ నేపథ్యంలో టయోటా ఫార్చ్యునర్కి పోటీగా వస్తున్న ఈ మోడల్ విశేషాలను ఇక్కడ చూసేయండి..
భారత ఆటోమొబైల్ రంగంలో భారీ ఎస్‌యూవీల మధ్య యుద్ధం మొదలుకానుంది! జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘ఎంజీ మెజెస్టర్’ను ఫిబ్రవరి 12న అధికారికంగా లాంచ్ చేస్తోంది. టయోటా ఫార్చ్యూనర్‌కు గట్టి పోటీనిస్తూ, మార్కెట్‌లో తన పట్టును పెంచుకోవడానికి ఎంజీ ఈ కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. గతేడాది భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో తొలిసారిగా కనిపించిన ఈ కారు, ఇప్పుడు ప్రొడక్షన్ వెర్షన్‌తో రోడ్లపైకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరో టీజర్‌ని సంస్థ ఇటీవలే విడుదల చేసింది. అందులోని హైలైట్స్‌ని ఇక్కడ చూసేయండి..

ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- అదిరిపోయే లుక్.. భారీ సైజ్
ఎంజీ మెజెస్టర్ కేవలం ఒక ఎస్యూవీ మాత్రమే కాదు! రోడ్డుపై వెళుతుంటే ఒక రాజసం ఉట్టిపడేలా ఉంటుంది దీని డిజైన్.
ముందు భాగం: భారీ మ్యాట్రిక్స్ గ్రిల్, గద్ద రెక్కలను పోలి ఉండే డీఆర్ఎల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ ఈ భారీ ఎస్‌యూవీకి అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి.
డైమెన్షన్స్: 5 మీటర్ల కంటే ఎక్కువ పొడవు, 2.95 మీటర్ల వీల్‌బేస్‌తో ఇది తన ప్రత్యర్థి ఫార్చ్యూనర్ కంటే కూడా పెద్దదిగా కనిపిస్తుంది.
అలాయ్ వీల్స్: 19 ఇంచ్ భారీ అలాయ్ వీల్స్, మస్క్యులర్ బాడీ క్లాడింగ్ ఈ ఎంజీ మెజెస్టర్ని ఒక పక్కా ఆఫ్-రోడర్‌గా నిలబెడతాయి.
ఎంజీ మెజెస్టర్ ఎస్యూవీ- లగ్జరీ ఇంటీరియర్.. అత్యాధునిక ఫీచర్లు
ఈ ఎస్యూవీ లోపలి భాగాన్ని పరిశీలిస్తే, ఇది ఒక లగ్జరీ హోటల్ గదిని తలపిస్తుంది. ఇందులో సౌకర్యాలకు కొదవ లేదు.
డిస్‌ప్లే: రెండు 12.3 ఇంచ్ డిజిటల్ స్క్రీన్స్ (ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం).
కంఫర్ట్: పనోరమిక్ సన్‌రూఫ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్.
హై-ఎండ్ సౌండ్: 12 స్పీకర్లతో కూడిన ప్రీమియం ఆడియో సిస్టమ్.
సీట్లు: వెనుక ప్యాసింజర్ల కోసం వెంటిలేటెడ్ సీట్లు, మసాజ్ ఫంక్షన్ వంటి ఆప్షన్లు కూడా ఈ ఎస్‌యూవీలో ఉండే అవకాశం ఉంది.
ఎంజీ మెజెస్టర్- పవర్ ఫుల్ ఇంజిన్.. ఆఫ్-రోడింగ్ సామర్థ్యం
ఎంజీ గ్లోస్టర్‌లో సక్సెస్ అయిన అదే 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఈ మెజెస్టర్‌లోనూ కొనసాగించనున్నారు.
పవర్: ఇది గరిష్టంగా 212.5 బీహెచ్పీ పవర్‌ని, 478.5 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
గేర్ బాక్స్: 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్.
4x4 డ్రైవ్: కఠినమైన దారుల్లో సైతం సులభంగా ప్రయాణించేందుకు ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది.
ఎంజీ మెజెస్టర్- ధర..
మార్కెట్ అంచనాల ప్రకారం, ఎంజీ మెజెస్టర్ ధర రూ. 40 లక్షల నుంచి రూ. 45 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్, స్కోడా కోడియాక్, జీప్ మెరిడియన్ వంటి కార్లకు గట్టి సవాల్ విసరనుంది.

E-Paper












