MS Dhoni : ధోనీకి మరో గాయం.. ఐపీఎల్​ 2026లో ఆడటం కష్టమే!

IPL 2026 : ఇప్పటికే సగం ఐపీఎల్​కి దూరమైన ఎంఎస్​ ధోనీకి మళ్లీ గాయమైనట్టు తెలుస్తోంది. ఆయన రీఎంట్రీ ప్రశ్నార్థకంగా మారింది. ధోనీ మళ్లీ మైదానంలోకి వస్తాడని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కి ఈ వార్త నిరాశను కలిగిస్తోంది.

Published on: Apr 27, 2026, 06:43:56 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

MS Dhoni injury : చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్. టీమ్ మాజీ కెప్టెన్, 'థాలా' ఎంఎస్ ధోనీ మైదానంలోకి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది! ఇప్పటికే కాలిపిక్క గాయంతో ఇబ్బంది పడుతున్న ధోనీకి, కోలుకుంటున్న సమయంలోనే మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఆయనకు మళ్లీ గాయం తిరగబెట్టిందని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించాడు.

ఎంఎస్​ ధోనీ.. (PTI)
ఎంఎస్​ ధోనీ.. (PTI)

ఎంఎస్​ ధోనీ గాయం తీవ్రత ఎంత? ఫ్లెమింగ్ ఏమన్నారంటే..

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు కేవలం రెండు వారాలు మాత్రమే ధోనీ దూరమవుతారని అందరూ భావించారు. కానీ, సీజన్ మొదలై ఎనిమిది మ్యాచ్‌లు గడిచినా ఆయన ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్​లో ధోనీ రీఎంట్రీ ఇస్తారని భావించిన వారికి షాక్​ తగిలింది. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జీటీతో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఫ్లెమింగ్ మీడియా సమావేశంలో ధోనీ ఆరోగ్యంపై స్పష్టతనిచ్చాడు.

"ధోనీ ఆడాలని చాలా ఆతృతగా ఉన్నాడు. కానీ కాలిపిక్క గాయం చాలా ఇబ్బందికరమైనది. వార్మప్ మ్యాచ్ సమయంలో మళ్లీ గాయం తిరగబెట్టింది. ఒకవేళ తగినంత విశ్రాంతి లేకుండా బరిలోకి దిగి, మళ్లీ కండరం చిరిగితే ఇక ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమవ్వాల్సి వస్తుంది. అందుకే మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం," అని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.

ప్రాక్టీస్‌లో కనిపిస్తున్నా.. మ్యాచ్‌కు దూరం!

ధోనీ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తూనే ఉన్నారు. గత శనివారం టీమ్ ఫిజియో పర్యవేక్షణలో ధోనీ వేగంగా పరుగెత్తడం, స్పిన్నర్లను ఎదుర్కోవడం వంటివి చేస్తూ కనిపించాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియంలో వికెట్ కీపింగ్ గ్లౌవ్స్ ధరించి ప్రాక్టీస్ చేయడం చూసి అభిమానులు సంబరపడ్డారు. అయితే, మ్యాచ్ ఆడే స్థాయికి ఆయన ఫిట్‌నెస్ ఇంకా చేరుకోలేదని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

పునరాగమనం ఎప్పుడు?

ఈ ఐపీఎల్​ 2026లో ధోనీ ఎప్పుడు ఆడాలనే నిర్ణయం ఆయనకే వదిలేశామని ఫ్లెమింగ్ తెలిపాడు. ఫిజియోలు, సపోర్ట్ స్టాఫ్ నిరంతరం ఆయన పురోగతిని పర్యవేక్షిస్తున్నాడు. ధోనీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి చెన్నై జట్టు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.

మే 2న హోమ్ గ్రౌండ్‌లో దాయాది ముంబై ఇండియన్స్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ధోనీ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఐదు రోజుల విరామం ధోనీ కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.

సోషల్​ మీడియాలో మీమ్స్​..

అయితే ఈ ఐపీఎల్​లో ధోనీ ఆడకపోవడంపై సోషల్​ మీడియా వేదికగా ఫ్యాన్స్​ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే.. ధోనీ రిటైర్​ అయిపోయాడని మీమ్స్​ వేస్తున్నారు.

“ధోనీ ఐపీఎల్​ నుంచి రిటైర్​ అయిపోయాడు. ఈ సీజన్​ ఆడకూడదు అనుకున్నాడు. ఈ విషయాన్ని ప్రకటిస్తే సీఎస్కే బ్రాండ్​ వాల్యూ పడిపోతుందని మేనేజ్​మెంట్​ భావించింది. అందుకే సీజన్​ ముగిసేంత వరకు వేచి ఉండాలని, గాయం కారణంగా ఆడట్లేదని చెబుదామని మేనేజ్​మెంట్​ ధోనీకి చెప్పింది,” అని మీమ్స్​ వెల్లువెత్తుతున్నాయి.

ఇందులో నిజం ఎంతుంది అంటారు?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More