Mutual fund SIP : నెలకు రూ. 2,000 చాలు- మీరు కూడా కోటీశ్వరులు అయిపోవచ్చు! ఎలా అంటే..

Mutual fund investment tips : నెలకు రూ. 2 వేల చిన్న మొత్తంతో కోటీశ్వరులు కావడం సాధ్యమేనా? మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీ ద్వారా దీర్ఘకాలంలో రూ. 1 కోటి సంపాదించే వ్యూహం, కాంపౌండింగ్ పవర్, ఇన్వెస్టర్లు గమనించాల్సిన కీలక నియమాలపై ప్రత్యేక విశ్లేషణ..

Published on: Jul 19, 2026, 06:43:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ రోజుల్లో ‘కోటీశ్వరుడు’ కావాలనే కల సగటు భారతీయుడికి ఒక అందనంత ఎత్తులో ఉన్న లక్ష్యంగా కనిపిస్తోంది! భారీ జీతం వచ్చే ఉద్యోగం, లాభాల్లో నడిచే వ్యాపారం లేదా అదృష్టం కలిసి వస్తేనే అంత పెద్ద మొత్తం సంపాదించగలమని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే అది అంత కష్టమేమీ కాదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

నెలకు రూ. 2వేల మ్యూచువల్​ ఫండ్​ సిప్​తో అద్భుతాలు!
నెలకు రూ. 2వేల మ్యూచువల్​ ఫండ్​ సిప్​తో అద్భుతాలు!

మనం ప్రతి నెలా హోటళ్లకు వెళ్లడానికో లేదా సినిమా వినోదాలకో ఖర్చు చేసే రూ. 2,000 చిన్న మొత్తాన్ని మ్యూచువల్​ ఫండ్స్​లో ఎస్​ఐపీ ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో రూ. 1 కోటి నిధిని సమకూర్చుకోవచ్చు. అయితే, ఈ ఫార్ములా వెనుక ఒక ముఖ్యమైన నిబంధన, కొన్ని వాస్తవాలు దాగి ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోకుండా పెట్టుబడి పెడితే ఆశించిన ఫలితం దక్కకపోవచ్చు.

ఇన్వెస్టర్లు గమనించాల్సిన రెండు ముఖ్య వాస్తవాలు!

కోటి రూపాయల లెక్కలను చూసి సంబరపడటానికి ముందే, ఇన్వెస్టర్లు రెండు ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిది, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్​ఐపీ) ద్వారా సంపదను సృష్టించడం అనేది వంద మీటర్ల పరుగు పందెం లాంటిది కాదు, అదొక సుదీర్ఘ మారథాన్ లాంటిది! రూ. 1 కోటి మైలురాయిని అందుకోవాలంటే కనీసం 25 నుంచి 35 సంవత్సరాల పాటు ఎలాంటి బ్రేకులు లేకుండా నిరంతరాయంగా పెట్టుబడిని కొనసాగించాలి. అందుకే ఎంత త్వరగా పెట్టుబడి ప్రారంభించగలిగితే, అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

రెండోది, మార్కెట్లో అంచనా వేసే రాబడులు కేవలం ఊహలపై ఆధారపడి ఉంటాయే తప్ప వాటికి ఎలాంటి గ్యారెంటీ ఉండదు. ఈక్విటీ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి లాభాలను అందించినప్పటికీ, మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఒక ఏడాది రెండంకెల వృద్ధి కనిపిస్తే, మరో ఏడాది నష్టాలు కూడా రావచ్చు.

ఇక్కడ అన్నింటికంటే పెద్ద సవాలు ‘నిలకడ’! చాలా మంది ఎంతో ఉత్సాహంతో ఎస్ఐపీలు ప్రారంభిస్తారు కానీ, మార్కెట్ పడిపోయినప్పుడో లేదా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడో పెట్టుబడులను మధ్యలోనే ఆపేస్తుంటారు. ఇలా మధ్యలో డబ్బులు విత్ డ్రా చేసుకోవడం వల్ల కాంపౌండింగ్​ ద్వారా వచ్చే అసలు లాభం దెబ్బతింటుంది.

రూ. 2,000 పెట్టుబడితో కోటీశ్వరులు అవ్వడం ఎలా?

మీ ఎస్ఐపీ పెట్టుబడిపై సగటున ఏడాదికి 12 శాతం వార్షిక రాబడి లభిస్తుందని ఊహిస్తే, కాలక్రమంలో మీ డబ్బు ఏ విధంగా పెరుగుతుందో ఈ కింది లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు.

నెలవారీ పెట్టుబడి: రూ. 2,000

పెట్టుబడి కాలపరిమితి: 35 సంవత్సరాలు

మీరు పెట్టే మొత్తం పెట్టుబడి: రూ. 8.4 లక్షలు

ఆశించే సగటు వార్షిక రాబడి: 12% (స్టాండర్డ్​ ఇండెక్స్ రిటర్న్)

అంచనా లాభం: రూ. 1.02 కోట్లు

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. సంపద సృష్టికి మీరు ప్రతి నెలా పెట్టే పెట్టుబడి పరిమాణం కంటే, మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కొనసాగారు అనేదే అత్యంత కీలకం.

"ప్రతి విజయవంతమైన మ్యూచువల్​ ఫండ్ ఎస్ఐపీ వ్యూహానికి 'కాంపౌండింగ్' శక్తే అసలైన మూలాధారం," అని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు.

ఈ విధానంలో మీరు పెట్టిన అసలు పెట్టుబడితో పాటు, దానిపై వచ్చే రాబడులు కూడా కలిసి మళ్లీ వడ్డీని సంపాదిస్తాయి. కాలం గడుస్తున్న కొద్దీ ఈ చక్రం వేగాన్ని పుంజుకుంటుంది. దీనివల్ల మనం పెట్టే చిన్న చిన్న నెలవారీ పొదుపు మొత్తాలు కూడా దీర్ఘకాలంలో ఊహించని పెద్ద నిధిగా రూపాంతరం చెందుతాయి.

ఆలస్యంగా ప్రారంభిస్తే ఎలా? 'స్టెప్-అప్ ఎస్ఐపీ' వ్యూహం!

ఒకవేళ మీరు పెట్టుబడిని ఆలస్యంగా ప్రారంభించినా లేదా ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగినా రూ. 1 కోటి లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం ఫైనాన్షియల్ ప్లానర్లు ‘స్టెప్-అప్ ఎస్ఐపీ’ పద్ధతిని సిఫార్సు చేస్తున్నారు. దీని ప్రకారం, ప్రతి సంవత్సరం మీ ఆదాయం పెరిగే కొద్దీ ఎస్ఐపీ పెట్టుబడి మొత్తాన్ని కూడా కొంత శాతం పెంచుకుంటూ వెళ్లాలి.

దశాబ్దాల తరబడి పెట్టుబడిని కేవలం రూ. 2,000 దగ్గరే స్థిరంగా ఉంచేయకుండా, ప్రతి ఏటా కొంత మొత్తాన్ని (ఉదాహరణకు 10 శాతం) పెంచుకుంటూ పోతే, మెచ్యూరిటీ సమయానికి చేతికి వచ్చే మొత్తం నిధి అంచనాల కంటే చాలా భారీగా ఉంటుంది.

చివరగా చెప్పేదేంటంటే: నెలకు రూ. 2,000 ఎస్ఐపీ ద్వారా రూ. 1 కోటి కంటే ఎక్కువ సంపాదించడం ఖచ్చితంగా సాధ్యమే. కానీ, దానికి రెండు షరతులు ఉన్నాయి. మీరు కొన్ని దశాబ్దాల పాటు ఓపికగా పెట్టుబడిని కొనసాగించాలి,మార్కెట్ దీర్ఘకాలంలో స్థిరమైన మంచి రాబడులను ఇవ్వాలి.

అయితే ఇక్కడ అసలైన రహస్యం పెట్టుబడి పెట్టే డబ్బులో లేదు, మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడటానికి ఇన్వెస్టరుకు ఉండాల్సిన 'సహనం', 'క్రమశిక్షణ' లోనే ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More