Driving license : డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్లో భారీ మార్పులు! ఎల్ఎల్ఆర్ టెస్ట్ ఇక కఠినం..
కేంద్ర ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్, లెర్నర్స్ లైసెన్స్ నిబంధనల్లో కీలక సవరణలు ప్రతిపాదించింది. ఎల్ఎల్ఆర్ పరీక్షలో పాస్ మార్కులను 75 శాతానికి పెంచడంతో పాటు, ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా పలు ఆన్లైన్ సేవలను ఉచితంగా అందించేలా ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
వాహనదారులకు, కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. రహదారి భద్రతను పెంపొందించడం, ఆర్టీఓ కార్యాలయాల్లో ఏజెంట్ల ప్రమేయాన్ని తగ్గించి డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేయడమే లక్ష్యంగా 'కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989'కి కీలక సవరణలు ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డిజిటల్ ఆర్టీఓ సేవలు ఇప్పటికే విస్తృతంగా అమలవుతుండగా, కేంద్రం తీసుకువస్తున్న ఈ కొత్త సవరణలు పౌరులకు సేవలను మరింత చేరువ చేయనున్నాయి.
ఎల్ఎల్ఆర్ టెస్ట్ ఇకపై మరింత కఠినం!
లేటెస్ట్ ప్రతిపాదనల ప్రకారం లెర్నర్స్ లైసెన్స్ (ఎల్ఆర్ఆర్) దరఖాస్తుదారులకు ఇకపై ఆన్లైన్ పరీక్ష కాస్త కఠినం కానుంది. ప్రస్తుతం ఆన్లైన్ సేఫ్-డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్మెంట్లో పాస్ కావడానికి 60 శాతం మార్కులు సాధిస్తే సరిపోయేది. కానీ కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ పాస్ మార్కులను ఏకంగా 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ట్యుటోరియల్ చూసే కనీస వ్యవధిని 30 నిమిషాలకు పొడిగించారు.
గతంలో దరఖాస్తు చేసుకున్న 7 రోజుల్లోగా ఈ ట్యుటోరియల్ పూర్తి చేయాల్సి ఉండగా, ఆ గడువును 15 రోజులకు పెంచారు. పాత ఎల్ఎల్ఆర్ ఉన్నవారు లేదా గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికెట్ కలిగిన వారికి గతంలో ఉన్న కొన్ని మినహాయింపులను రద్దు చేశారు. వారు కూడా తప్పనిసరిగా కొత్త ట్యుటోరియల్ చూసి పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆధార్ ఉంటే ఉచితంగా ఆన్లైన్ సేవలు!
వాహనదారుల జేబుకు ఊరట కలిగిస్తూ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా ఆన్లైన్లో పొందే పలు డ్రైవింగ్ లైసెన్స్ సేవలకు సంబంధించి రుసుములను పూర్తిగా మినహాయించాలని ప్రతిపాదించింది. డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు సవరణలు, చిరునామా మార్పు, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ అప్డేట్ వంటి సేవలను ఇకపై ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగానే పొందవచ్చు.
ప్లాస్టిక్ పీవీసీ కార్డుల రూపంలో లైసెన్స్..
దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సుల రూపకల్పనలో ఏకరూపత తెచ్చేందుకు గాను ల్యామినేటెడ్ లేదా పీవీసీ స్మార్ట్ కార్డుల రూపంలోనే లైసెన్సులు జారీ చేయాలని ప్రతిపాదించారు. భారతీయ పౌరులకు, విదేశీయులకు వేర్వేరు ఫార్మాట్లలో ఈ కార్డులు అందుబాటులోకి తెస్తారు.
లైసెన్స్‌లో వివరాల మార్పు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఆర్టీఓ అధికారులు 15 రోజుల్లోగా ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయాలి. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే దానికి తగిన కారణాన్ని లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ చిరునామా మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే, ఆ దరఖాస్తు స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు.
పత్రాల జాబితాలో మార్పులు.. కఠినమైన ఆంక్షలు!
డ్రైవింగ్ లైసెన్సు కోసం వయస్సు, చిరునామా, గుర్తింపు ధ్రువీకరణ కోసం సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా కేంద్రం సవరించింది. చిరునామా ఆధారంగా ఆధార్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, ఈ-రేషన్ కార్డ్, పెన్షనర్ ఐడీ లేదా 3 నెలల లోపు విద్యుత్/గ్యాస్ బిల్లులను అంగీకరిస్తారు. వయస్సు ధ్రువీకరణకు బర్త్ సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ లేదా విద్యా సంస్థల మార్క్షీట్లు చెల్లుబాటు అవుతాయి.
అలాగే కారు లేదా బైక్ కేటగిరీని లైసెన్స్ నుంచి శాశ్వతంగా తొలగించుకున్న వ్యక్తి, మళ్లీ అదే కేటగిరీ కోసం ఏడాది వరకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు.
ఈ ముసాయిదా నిబంధనలపై 30 రోజుల పాటు ప్రజాభిప్రాయాలు, సూచనలను స్వీకరించనున్నారు. అనంతరం తుది నోటిఫికేషన్ అధికారిక గెజిట్‌లో ప్రచురితమైనప్పటి నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


