మార్కెట్లోకి కొత్త డస్టర్: అదిరిపోయే ఫీచర్లు, హైబ్రిడ్ ఇంజిన్‌తో గ్రాండ్ లాంచ్
New Renault Duster 2026: భారత మార్కెట్లోకి మూడవ తరం రెనో డస్టర్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. టర్బో పెట్రోల్, హైబ్రిడ్ ఆప్షన్లతో వస్తున్న ఈ SUV బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్చిలో లాంచ్ కానున్న ఈ కారులో 7 ఏళ్ల వారంటీ, అధునాతన ADAS వంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి.
ఎస్‌యూవీ (SUV) ప్రియులకు ఇది నిజంగా తీపి కబురు. ఒకప్పుడు భారత రోడ్లపై రారాజుగా వెలిగిన 'రెనో డస్టర్' మళ్ళీ కొత్త అవతారంలో మన ముందుకు వచ్చేసింది. మూడేళ్ల విరామం తర్వాత, సరికొత్త మూడవ తరం డస్టర్‌ను రెనో సంస్థ భారత్‌లో ఆవిష్కరించింది. మధ్యలో సెకండ్ జనరేషన్ మోడల్‌ను స్కిప్ చేసి, నేరుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన లేటెస్ట్ వెర్షన్‌ను మన దేశానికి తీసుకురావడం విశేషం.

బుకింగ్స్ షురూ.. డెలివరీ ఎప్పుడంటే?
కొత్త డస్టర్ కోసం ఎదురుచూస్తున్న వారు రూ. 21,000 చెల్లించి ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. కంపెనీ ప్రణాళిక ప్రకారం, ఈ కారు మార్చిలో అధికారికంగా మార్కెట్లోకి విడుదల కానుంది. టర్బో-పెట్రోల్ వేరియంట్ల డెలివరీ ఏప్రిల్ మధ్య నుంచి ప్రారంభమవుతుంది. ఇక పర్యావరణ హితమైన స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ కోసం మాత్రం 2026 దీపావళి వరకు వేచి చూడాల్సి ఉంటుంది. మరో విశేషమేమిటంటే.. రెనో తన వాహనాలపై తొలిసారిగా 7 ఏళ్ల వారంటీని అందిస్తోంది.
లుక్ అదిరింది.. ఇంటీరియర్ కేక
డిజైన్ విషయానికి వస్తే, పాత డస్టర్ లాగే ఇది కూడా చూడటానికి ధృడంగా (Boxy shape) ఉంది. అయితే, ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఎల్‌ఈడీ (LED) లైట్లు, కొత్త స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్‌తో దీనికి సరికొత్త మెరుగులు దిద్దారు. కారు లోపల అడుగుపెడితే.. లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఫీచర్లు ఉన్నాయి.
10.2 అంగుళాల డిజిటల్ స్క్రీన్
ఇన్ఫోటైన్మెంట్: గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్‌తో కూడిన 10 అంగుళాల టచ్‌స్క్రీన్.
ఫీచర్స్: పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్.
సేఫ్టీ: 360 డిగ్రీల కెమెరా, 17 రకాల ఫీచర్లు కలిగిన ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్).

పవర్‌ఫుల్ ఇంజిన్.. పక్కా పర్ఫార్మెన్స్
డస్టర్ అంటేనే పర్ఫార్మెన్స్. ఇందులో మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లను రెనో అందిస్తోంది.
టర్బో పెట్రోల్: 163 PS పవర్, 280 Nm టార్క్ ఇచ్చే శక్తివంతమైన ఇంజిన్.
స్ట్రాంగ్ హైబ్రిడ్: 1.8 లీటర్ ఇంజిన్, 1.4 kWh బ్యాటరీ ప్యాక్. నగరాల్లో 80 శాతం వరకు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే నడుస్తుందని కంపెనీ పేర్కొంది.
బేసిక్ పెట్రోల్: 100 PS పవర్ ఇచ్చే 1.0 లీటర్ ఇంజిన్, ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.
ఆఫ్-రోడింగ్ చేసే వారికి కూడా ఈ కారు చక్కగా సరిపోతుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 212 మిమీ కావడంతో, గతుకుల రోడ్లపై కూడా సాఫీగా దూసుకుపోతుంది.

ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


