అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనే కలలతో వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది! దశాబ్దాల కాలం నాటి పాత వీసా విధానానికి స్వస్తి పలుకుతూ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) సరికొత్త నిబంధనలను అధికారికంగా ప్రకటించింది. ఇకపై అంతర్జాతీయ విద్యార్థులు (ఎఫ్ వీసా), ఎక్స్ఛేంజ్ విజిటర్స్ (జే వీసా), విదేశీ జర్నలిస్టులకు (ఐ వీసా) నిర్దిష్ట కాలపరిమితితో కూడిన వీసాలను మాత్రమే జారీ చేయనున్నట్టు వివరించింది.

కొత్త నిబంధనల ప్రకారం.. విదేశీ విద్యార్థులు వారు చదివే కోర్సు కాలపరిమితిని బట్టి గరిష్టంగా నాలుగేళ్లు మాత్రమే అమెరికాలో ఉండటానికి అనుమతిస్తారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ నిబంధన వర్తిస్తుంది! కాంగ్రెస్ సమీక్షా వ్యవహారాలు ముగిసిన తర్వాత ఈ ఏడాది సెప్టెంబర్ 15 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విద్యార్థులు నిరవధికంగా అమెరికాలో ఉండే అవకాశం ఉండేది, కానీ ఇకపై ఆ వీలు పడదు.
స్టూడెంట్ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
'డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్' రద్దుతో వచ్చే మార్పులేంటి?
నిజానికి 1978 నుంచి అమెరికాలో ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ విధానం అమల్లో ఉంది. దీని ప్రకారం ఎఫ్-కేటగిరీ వీసాపై వచ్చే విద్యార్థులు తమ చదువు సక్రమంగా కొనసాగిస్తున్నంత కాలం ఎంతకాలమైనా అమెరికాలో ఉండొచ్చు. కోర్సు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) చేసుకోవచ్చు. ఆ తర్వాత మరో కోర్సులో చేరడానికో లేదా దేశం విడిచి వెళ్లడానికో 60 రోజుల గడువు ఇచ్చేవారు.
కానీ, కొత్త నిబంధనలు ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. అవి..
{{/usCountry}}కానీ, కొత్త నిబంధనలు ఈ వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. అవి..
{{/usCountry}}వీసా ఎక్స్‌టెన్షన్ తప్పనిసరి: నాలుగేళ్ల తర్వాత కూడా అమెరికాలో కొనసాగాలనుకునే విద్యార్థులు ఇకపై 'యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్' (యూఎస్సీఐఎస్)కు అధికారికంగా దరఖాస్తు చేసుకుని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.
గడువు సగానికి తగ్గింపు: కోర్సు పూర్తయిన తర్వాత దేశం విడిచి వెళ్లడానికి లేదా మరో కోర్సులో చేరడానికి ఇచ్చే 60 రోజుల గడువును ఇప్పుడు 30 రోజులకు తగ్గించారు!
కోర్సుల మార్పుపై ఆంక్షలు: ఉన్నత చదువులు చదివే గ్రాడ్యుయేట్ విద్యార్థులు కొత్త అనుమతులు లేకుండా ఒక యూనివర్సిటీ నుంచి మరో యూనివర్సిటీకి మారడం లేదా కోర్సులను మార్చడం కుదరదు.
విద్యార్థులపై పడే ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ నిర్ణయంపై అంతర్జాతీయ విద్యా కన్సల్టెన్సీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"నాలుగేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టే కోర్సులు చదివే విద్యార్థులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా పీహెచ్‌డీ చేసే విద్యార్థులు నాలుగేళ్లలో తమ పరిశోధనలు పూర్తి చేయడం కష్టం. అలాగే కరోనా వంటి విపత్కర పరిస్థితులు లేదా అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లి చదువు మధ్యలో ఆపేసిన వారు, మళ్లీ తిరిగి అమెరికా రావాలంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే స్టూడెంట్ వీసా అపాయింట్‌మెంట్లు దొరకడమే కష్టంగా మారిన తరుణంలో, ఈ నిబంధన పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుంది," అని ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎక్స్ఛేంజ్ అధినేత్రి మృణాళిని బాత్రా విశ్లేషించారు.
ట్రంప్ ప్రభుత్వం ఏమంటోంది?
పాత పద్ధతి వల్ల వేలాది మంది విదేశీయులు నిరంతరాయంగా ఏదో ఒక కోర్సులో చేరుతూ 'శాశ్వత విద్యార్థులు'గా మారిపోతున్నారని, అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నారని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్సీ) సెక్రటరీ మార్క్‌వేన్ ముల్లిన్ పేర్కొన్నారు.
"దశాబ్దాలుగా ఉన్న ఈ లూప్‌హోల్ కారణంగా జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. వీసాలకు స్పష్టమైన కాలపరిమితి విధించడం ద్వారా మా దేశ సరిహద్దుల్లోకి వచ్చే వ్యక్తులను సరిగ్గా పర్యవేక్షించే అవకాశం మాకు లభిస్తుంది. విదేశీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి, కోర్సు పూర్తి కాగానే తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లేలా ఈ నిబంధన ఉపయోగపడుతుంది," అని ముల్లిన్ సమర్థించుకున్నారు.