...
...
Next Story

Vande Bharat : గోవాకు కొత్త వందే భారత్​ రైలు- తగ్గనున్న ప్రయాణ సమయం, ఇంకొన్ని రోజుల్లో ప్రకటన..!

ఇప్పుడు బెంగళూరు నుంచి గోవాకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ రెండు మార్గాల మధ్య వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ని నడిపేందుకు అధికారులు యోచిస్తున్నారని సమాచారం. ఇది అందుబాటులోకి వస్తే మొత్తం ప్రయాణం 13 గంటల్లో ముగుస్తుంది.

Published on: Feb 21, 2026, 14:01:00 IST
Advertisement

బెంగళూరువాసులకు అదిరిపోయే వార్త! బెంగళూరు నుంచి గోవా ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. ఈ మేరకు ఈ రెండు ప్రధాన గమ్యస్థానాల మధ్య కొత్త వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ నడపడానికి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ సెమీ హైస్పీడ్ రైలు దాదాపు 13 గంటల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేయనుంది.

గోవాకు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​..
గోవాకు వందే భారత్​ ఎక్స్​ప్రెస్​..

సౌత్ వెస్ట్రన్ రైల్వే ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించిందని సమాచారం. బోర్డు నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త వందే భారత్ రైలు అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.

బెంగళూరు- గోవా వందే భారత్: రూట్, టైమింగ్స్​ (అంచనా)..

సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కొత్త రైలు మంగళూరు రైల్వే రీజియన్ మీదుగా, బెంగళూరులోని యశ్వంత్పూర్ నుంచి గోవాలోని మడ్​గావ్ వరకు నడుస్తుంది.

యశ్వంత్​పూర్ - మడ్​గావ్: ఉదయం 6:05 గంటలకు బయలుదేరి, రాత్రి 7:15 గంటలకు మడ్గావ్ చేరుకుంటుంది.

మడ్​గావ్​ - యశ్వంత్పూర్: తిరుగు ప్రయాణంలో మడ్​గావ్​ నుంచి ఉదయం 5:30 గంటలకు బయలుదేరి, సాయంత్రం 6:40 గంటలకు యశ్వంత్​పూర్​ చేరుకుంటుంది.

ప్రస్తుతం బెంగళూరు నుంచి గోవాకు రైలులో వెళ్లాలంటే దాదాపు 14-15 గంటల సమయం పడుతోంది. ఈ వందే భారత్​ అందుబాటులోకి వస్తే బెంగళూరువాసులకు టైమ్​ కలిసొచ్చినట్టే!

బెంగళూరు- గోవా వందే భారత్​- ప్రయాణ వేగం, మార్గంలో మార్పులు..

సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రతిపాదన ప్రకారం.. ఈ వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ పాడిల్ బైపాస్ మీదుగా ప్రయాణిస్తుంది. దీనివల్ల మంగళూరు జంక్షన్, మంగళూరు సెంట్రల్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

చిక్కబాణవర, హసన్ మధ్య రైలు వేగాన్ని ప్రస్తుతమున్న 110 కి.మీ నుంచి 130 కి.మీకి పెంచాలని ప్రతిపాదించారు.

సకలేష్‌పూర్ - సుబ్రహ్మణ్య రోడ్ ఘాట్ సెక్షన్‌లో వేగాన్ని 30 కి.మీ నుంచి 40 కి.మీకి పెంచాలని సూచించారు.

రైల్వే బోర్డు ఆమోదం కోసం నిరీక్షణ..

ఇటీవల జరిగిన ఒక సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వందే భారత్ సర్వీసు గురించి ప్రస్తావించారు. మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు దాదాపు 20 రోజుల క్రితమే అధికారిక ప్రతిపాదనను రైల్వే బోర్డుకు పంపినట్లు ఎస్‌డబ్ల్యూఆర్ ఉన్నతాధికారి తెలిపారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనపై రైల్వే బోర్డు చర్చలు జరుపుతోంది. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తుది ప్రకటన వెలువడుతుంది. ఈ మార్గంలో ప్రతిరోజూ సర్వీసు నడపాలంటే కనీసం రెండు రైలు సెట్లు (రేకులు) అందుబాటులో ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.

లాంచ్‌కు ముందు ట్రయల్ రన్స్..

రైలు షెడ్యూల్‌ను ఖరారు చేసే ముందు ప్రయోగాత్మక పరీక్షలు (ట్రయల్​ రన్స్​) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (ఏఈబీ) వ్యవస్థ కలిగిన రెండు వందే భారత్ రేకులను ఉపయోగించనున్నారు. ముఖ్యంగా ఇటీవలే విద్యుదీకరణ పూర్తి చేసుకున్న హసన్-తోకూరు (మంగళూరు) సెక్షన్‌లో విద్యుత్ వ్యవస్థ (ఓహెచ్​ఈ) ధృవీకరణ పూర్తయిన తర్వాతే ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks