Bullet Train Project Recruitment : బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో ఉద్యోగాలు- రూ. 1.10 లక్షల వరకు జీతం!
Bullet train job notification : భారతదేశపు ప్రతిష్టాత్మక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టును నిర్మిస్తున్న ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ కొత్త రిక్రూట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. 237 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగస్వాములు కావాలనుకునే సాంకేతిక నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన అవకాశం కల్పించింది! బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చూస్తున్న నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) వివిధ టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 237 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ, ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేసి, రైల్వే రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ అధికారిక వెబ్‌సైట్ (nhsrcl.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 5 చివరి తేదీగా నిర్ణయించారు.
బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026- విభాగాల వారీగా ఖాళీల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నలింగ్, రోలింగ్ స్టాక్ వంటి పలు విభాగాల్లో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో ప్రధాన ఖాళీలు ఇవే:
ఎలక్ట్రికల్ టెక్నీషియన్ — 77 పోస్టులు
సిగ్నలింగ్ అండ్ టెలికాం టెక్నీషియన్ — 63 పోస్టులు
సివిల్/ట్రాక్ ఫిట్టర్ — 18 పోస్టులు
సివిల్/ట్రాక్ మెకానిక్ — 16 పోస్టులు
రోలింగ్ స్టాక్ ఎలక్ట్రీషియన్ — 13 పోస్టులు
రోలింగ్ స్టాక్ ఫిట్టర్ — 10 పోస్టులు
మిగిలిన ఖాళీలు సివిల్/ట్రాక్ డ్రాఫ్ట్స్‌మన్, సర్వేయర్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, మెషినిస్ట్, ఆర్ఏసీ టెక్నీషియన్ విభాగాల్లో ఉన్నాయి.
బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026- విద్యా అర్హతలు, వయోపరిమితి..
ఈ బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ (పదో తరగతి) లేదా ఎస్ఎస్ఎల్‌సీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దానితో పాటు:
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి, లేదా
పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి, లేదా
సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
కీలకమైన ఎక్స్‌పీరియెన్స్: ఈ ఉద్యోగాలకు కేవలం విద్యా అర్హతలు ఉంటే సరిపోదు. అభ్యర్థులకు ఇండియన్ రైల్వేస్, ప్రభుత్వ ఆధీనంలోని రైల్వే సంస్థలు, మెట్రో రైల్ లేదా రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ల్లోని ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల్లో కనీసం రెండేళ్ల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం తప్పనిసరి. దరఖాస్తు సమయంలో చెల్లుబాటు అయ్యే ఎక్స్‌పీరియెన్స్ లేదా కాంపిటెన్సీ సర్టిఫికేట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. వయస్సు, అనుభవాన్ని జూన్ 30, 2026 నాటికి ప్రామాణికంగా లెక్కిస్తారు. అభ్యర్థుల గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు మించకూడదు.
బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026- జీతభత్యాలు, పోస్టింగ్ ఎక్కడంటే?
ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులను ‘అబ్సార్ప్షన్ బేసిస్’ కింద నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ (ఎన్ఈ-2 పే లెవెల్) లో శాశ్వత ప్రాతిపదికన నియమిస్తారు. నెలకు రూ. 35,000 నుంచి రూ. 1,10,000 వరకు వేతన శ్రేణి ఉంటుంది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అలవెన్సులు, పీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్ వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి. ఎంపికైన వారికి ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ పరిధిలోని ఏ కార్యాలయంలోనైనా లేదా ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ పొడవునా ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026- ఎంపిక ప్రక్రియ విధానం..
అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)
ధృవపత్రాల పరిశీలన
వైద్య పరీక్షలు (బీ-1 స్టాండర్డ్)
నోటిఫికేషన్ విడుదల చేసిన అన్ని పోస్టులకు ఒకే రోజు, ఒకే సమయంలో ఆన్‌లైన్ సీబీటీ పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో అర్హత సాధించిన వారికి రైల్వే ప్రమాణాల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ప్రొబేషన్ పీరియడ్‌లో ఉంటారు.
బుల్లెట్ ట్రైన్ రిక్రూట్‌మెంట్ 2026- దరఖాస్తు రుసుము..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ. 400 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసే ముందు వెబ్‌సైట్‌లోని పూర్తి నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


