...
...
Next Story

జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాలు ఇక కనిపించవా?

దేశంలో ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల వ్యవస్థను పూర్తిగా తొలగిస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. దీని స్థానంలో ఎలక్ట్రానిక్ టోల్‌ వసూలు విధానాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించారు. ఈ కొత్త వ్యవస్థ ఏడాదిలో దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.

Published on: Dec 6, 2025, 05:38:40 IST
Advertisement

జాతీయ రహదారులపైన ప్రస్తుతం ఉన్న టోల్‌ ప్లాజాల వ్యవస్థను పూర్తిగా తొలగించి, ఇకపై ఎలాంటి బారియర్లు లేని ఎలక్ట్రానిక్ టోల్‌ వసూలు విధానాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు ఈ వ్యవస్థను ఏడాదిలోగా అమలు చేస్తామని లోక్‌సభకు తెలియజేశారు.

జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాలు ఇక కనిపించవా?
జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాలు ఇక కనిపించవా?

పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్​సభలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల సమయంలో గడ్కరీ మాట్లాడుతూ.. వాహనాల రాకపోకలకు ఏమాత్రం అంతరాయం కలిగించకుండా, టోల్ బూత్‌ల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా కొత్త టోల్‌ విధానాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఈ కొత్త విధానాన్ని ఇప్పటికే 10 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్టు) అమలు చేయడం ప్రారంభించామని, రాబోయే 12 నెలల్లో దేశవ్యాప్తంగా దీనిని విస్తరిస్తామని ఆయన వివరించారు.

“ప్రస్తుత టోల్‌ వ్యవస్థకు ముగింపు పలుకుతాం. ఇకపై టోల్ పేరుతో మిమ్మల్ని ఎవరూ ఆపరు! ఏడాదిలోగా దేశం మొత్తం ఎలక్ట్రానిక్ టోల్‌ వసూలు అమల్లోకి వస్తుంది,” అని గడ్కరీ స్పష్టం చేశారు.

బ్యారియర్​లు లేని టోలింగ్ ఎలా పనిచేస్తుంది?

రాబోయే ఈ కొత్త వ్యవస్థ మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్​ఎఫ్​ఎఫ్​) ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న ఆర్​ఎఫ్​ఐడీ-ఆధారిత ఫాస్టాగ్ సాంకేతికతతో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ) విశ్లేషణతో పనిచేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్​పీఆర్​) కెమెరాలను ఉపయోగిస్తుంది.

రహదారిపై ఏర్పాటు చేసిన పైకప్పుల (ఓవర్‌హెడ్ గ్యాంట్రీస్) కింద నుంచి వాహనాలు వెళుతున్నప్పుడు, వాటిని ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది. ఫలితంగా, వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేకుండా లేదా లేన్‌లు మార్చాల్సిన అవసరం లేకుండానే టోల్ ఛార్జీలు వెంటనే డెబిట్ అవుతాయి.

ఈ కొత్త విధానం, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​పీసీఐ) నిర్వహిస్తున్న నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్​ఈటీసీ) కార్యక్రమం ఆధారంగా రూపొందించడం జరిగింది. 2016లో దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఎన్​ఈటీసీ.. ఫాస్టాగ్ ఉపయోగించి టోల్ చెల్లింపుల కోసం ఒకే, పరస్పరం పనిచేసే వేదికను అందిస్తుంది.

ఫాస్టాగ్​: ఇది వాహనాల ముందు విండ్‌షీల్డ్‌కు అతికించే ఆర్​ఎఫ్​ఐడీ స్టిక్కర్. ఇది బ్యాంక్ ఖాతా లేదా ప్రీపెయిడ్ వాలెట్‌కు లింక్ చేసి ఉంటుంది. స్కానర్‌లు ఉన్న టోల్ లేన్‌ల గుండా వాహనాలు వెళ్లేటప్పుడు, టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది.

సాంప్రదాయ టోల్ ప్లాజాలను ఎందుకు తొలగిస్తున్నారు?

ఫాస్టాగ్ వల్ల చాలా టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్​ టైమ్​ తగ్గినప్పటికీ, వాహనాలు ఇంకా ధృవీకరణ కోసం బారియర్‌ల వద్ద నెమ్మదించాల్సి వస్తోంది లేదా ఆగాల్సి వస్తోంది. పండుగల్లో టోల్​ ప్లాజాల్లో చాలా సేపు ఆగిపోవాల్సి వస్తోంది.

ఎంఎల్​ఎఫ్​ఎప్​ వ్యవస్థ ప్రధాన లక్ష్యం ఈ భౌతిక చెక్‌పోస్టులను పూర్తిగా తొలగించడమే! దీనివల్ల ముఖ్యంగా ఎక్కువ ట్రాఫిక్ ఉండే కారిడార్లలో రద్దీని తగ్గించవచ్చు. సగటు ప్రయాణ వేగాన్ని పెంచవచ్చు, ప్రయాణాలను ఆటంకాలు లేకుండా చేయవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe