జూన్ 17న నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి కార్గో విమానం టేకాఫ్

ఉత్తరప్రదేశ్‌లోని జేవర్ వద్ద నిర్మిస్తున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NIA) నుంచి జూన్ 17న మొదటి కార్గో విమానం నడవనుంది. జూలై నుంచి పూర్తిస్థాయిలో రెగ్యులర్ సరుకు రవాణా సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

Published on: Jun 11, 2026, 16:15:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి జూన్ 17న తొలి కార్గో విమానం సర్వీస్ ప్రారంభం కానుందని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (NIAL) ప్రకటించింది. మొదటి విమానాన్ని దేశీయ సర్వీసుగా నడపనుండగా, దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

జూన్ 17న నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి కార్గో విమానం టేకాఫ్
జూన్ 17న నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి తొలి కార్గో విమానం టేకాఫ్

జూలై నుంచి ఇక్కడ రెగ్యులర్ కార్గో సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ విమానాశ్రయంలో కార్గో సేవలను అభివృద్ధి చేస్తున్న 'ఎయిర్ ఇండియా శాట్స్' (AISATS) సంస్థ, తన రవాణా నెట్‌వర్క్‌ను యూరప్ వరకు విస్తరించేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

ఉత్తర భారతదేశానికి వరం

నోయిడా విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే కార్గో సేవలు ఇటు ఉత్తరప్రదేశ్ పారిశ్రామిక రంగానికే కాకుండా, మొత్తం ఉత్తర భారతదేశ రవాణా రంగానికి కొత్త ఊపును ఇవ్వనున్నాయి. "నోయిడా ఎయిర్‌పోర్ట్ కార్గో సర్వీస్ కేవలం ఉత్తరప్రదేశ్‌కే పరిమితం కాకుండా, మొత్తం ఉత్తర భారతదేశానికి ఒక పెద్ద వరంగా మారబోతోంది" అని ఎన్‌ఐఏఎల్ (NIAL) నోడల్ అధికారి శైలేంద్ర భాటియా పేర్కొన్నారు.

కార్గో సర్వీసుల కంటే ముందే, జూన్ 15 నుంచే ఈ విమానాశ్రయం నుంచి సాధారణ ప్యాసింజర్ (కమర్షియల్) విమానాల రాకపోకలు ప్రారంభం కానున్నాయి.

80 ఎకరాల్లో అత్యాధునిక కార్గో హబ్

నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో భారీ కార్గో హబ్‌ను ఏఐశాట్స్ (AISATS) అభివృద్ధి చేసింది. మొదటి దశలో ఏటా 2,55,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో దీనిని రూపొందించారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ స్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. సరుకు రవాణా కోసం అత్యాధునిక కార్గో టెర్మినల్, వేర్‌హౌస్, ట్రకింగ్ మౌలిక సదుపాయాలు, డిజిటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లను ఏర్పాటు చేశారు. ఫ్రైట్ ఫార్వార్డర్స్ కోసం వేర్‌హౌసింగ్, కన్సాలిడేషన్ సెంటర్లు, ట్రక్ మూవ్‌మెంట్, డిజిటల్ షిప్‌మెంట్ సౌకర్యాలు కూడా కల్పించారు.

నోయిడా ఎయిర్‌పోర్ట్ నెట్‌వర్క్‌ను మిడిల్ ఈస్ట్, ఆగ్నేయాసియా, యూరప్ దేశాలకు అనుసంధానించడానికి ఏఐశాట్స్ సన్నద్ధమవుతోంది. దీనికోసం వివిధ విమానయాన సంస్థలు, భాగస్వాములతో చర్చలు జరుపుతున్నారు.

ఆఫ్‌కామ్ (Afcom) ఎయిర్‌లైన్స్‌తో భాగస్వామ్యం

నోయిడా ఎయిర్‌పోర్ట్ నుంచి కార్గో కార్యకలాపాలను విస్తరించడానికి ఏఐశాట్స్, యమునా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. చెన్నైకి చెందిన అంతర్జాతీయ కార్గో ఎయిర్‌లైన్ 'ఆఫ్‌కామ్' (Afcom) ఈ భాగస్వామ్యంలో కీలక పాత్ర పోషించనుంది. నోయిడా విమానాశ్రయంలో తన విమానాలను రంగంలోకి దించి సరుకు రవాణా సేవలను అందించడంలో ఆఫ్‌కామ్ సహాయపడుతుంది.

ఆఫ్‌కామ్ సంస్థ ప్రస్తుతం మూడు బోయింగ్ 737-800 ఫ్రైటర్ విమానాలను నడుపుతోంది. బ్యాంకాక్, యాంగూన్, హనోయి, కొలంబో, మాలే, దుబాయ్ వంటి ప్రధాన అంతర్జాతీయ నగరాలకు సేవలు అందిస్తోంది.

"ఆఫ్‌కామ్, ఏఐశాట్స్‌తో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో పటిష్టమైన ఎయిర్ కార్గో వ్యవస్థను నిర్మించడంలో ఒక ముఖ్యమైన అడుగు" అని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (NIA) చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కిరణ్ జైన్ తెలిపారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More