...
...
Next Story

ఎన్‌ఆర్‌ఐగా మారితే మీ ఎన్‌పీఎస్ ఖాతా క్లోజ్ అవుతుందా? పీఎఫ్‌ఆర్‌డీఏ నియమాలు ఇవే

విదేశాలకు వెళ్లే భారతీయులు తమ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతాను మూసివేయాల్సిన అవసరం లేదు. ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలు తమ ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతాను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) స్పష్టం చేసింది.

Published on: Sep 7, 2026, 10:55:56 IST
Advertisement

ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు తమ పొదుపు ఖాతాలు, పెట్టుబడులపై అనేక సందేహాలు ఉంటాయి. ప్రధానంగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) ఖాతా ఉన్నవారు ఎన్‌ఆర్‌ఐగా మారిన తర్వాత దానిని మూసివేయాలా? అనే గందరగోళం నెలకొంటుంది. అయితే ఎన్‌పీఎస్ ఖాతాను రద్దు చేయాల్సిన పనిలేదని పెన్షన్ ఫండ్ నియమ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

ఎన్‌ఆర్‌ఐలకు టైర్-1 ఓకే.. కానీ టైర్-2 కి నో

ఎన్‌ఆర్‌ఐగా మారితే మీ ఎన్‌పీఎస్ ఖాతా క్లోజ్ అవుతుందా? పీఎఫ్‌ఆర్‌డీఏ నియమాలు ఇవే
ఎన్‌ఆర్‌ఐగా మారితే మీ ఎన్‌పీఎస్ ఖాతా క్లోజ్ అవుతుందా? పీఎఫ్‌ఆర్‌డీఏ నియమాలు ఇవే

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) మార్గదర్శకాల ప్రకారం ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు), విదేశీ భారతీయ పౌరసత్వ కార్డుదారులు (ఓసీఐలు) ఎన్‌పీఎస్ చందాదారులుగా కొనసాగవచ్చు. ఎన్‌పీఎస్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా బదిలీ చేసుకునే వెసులుబాటు ఉన్న ఖాతా. అయితే ఎన్‌ఆర్‌ఐలు తమ ఎన్‌పీఎస్ టైర్-1 ఖాతా నిర్వహణ కోసం విధిగా ఎన్‌ఆర్‌ఈ (NRE) లేదా ఎన్‌ఆర్‌ఓ (NRO) బ్యాంకు ఖాతా వివరాలను అందించాల్సి ఉంటుంది.

ఇక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని గుర్తించాలి. స్వదేశంలో ఉండే ఇన్వెస్టర్లకు ఎన్‌పీఎస్ టైర్-1, టైర్-2 ఖాతాలు రెండూ అందుబాటులో ఉంటాయి. కానీ ఎన్‌ఆర్‌ఐలు, ఓసీఐలకు కేవలం టైర్-1 ఖాతా మాత్రమే అనుమతిస్తారు. వారు టైర్-2 (స్వేచ్ఛగా నిధులు ఉపసంహరించుకునే ఖాతా) ను ప్రారంభించడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ అనుమతించదు. ఈ నిబంధనను పీఎఫ్‌ఆర్‌డీఏ తన 2019 సర్క్యులర్‌లోనూ స్పష్టంగా పునరుద్ఘాటించింది.

పెట్టుబడి మార్గాలు, పరిమితులు ఇవే

ఎన్‌ఆర్‌ఐ చందాదారులు తమ ఎన్‌పీఎస్ సొమ్మును ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (CRA) వద్ద నమోదైన సమాచారం ఆధారంగా, చందాదారు ఎంచుకున్న పెన్షన్ ఫండ్, అసెట్ అలోకేషన్‌కు అనుగుణంగా డిపాజిట్లు జమ అవుతాయి.

యాక్టివ్ ఛాయిస్ (Active Choice): ఇన్వెస్టర్లే తమ సొమ్మును ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో ఎంత శాతం కేటాయించాలో స్వయంగా నిర్ణయించుకోవచ్చు. సాధారణ స్కీమ్‌ల కింద ఈక్విటీలలో గరిష్ఠంగా 75 శాతం వరకు, కార్పొరేట్ బాండ్లు అలాగే ప్రభుత్వ సెక్యూరిటీలలో 100 శాతం వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

ఆటో ఛాయిస్ (Auto Choice): చందాదారుడి వయస్సు, ఎంచుకున్న లైఫ్‌సైకిల్ స్ట్రాటజీని బట్టి ఈక్విటీ, బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీలలో నిధుల కేటాయింపు స్వయంచాలకంగా జరుగుతుంది.

ఫండ్స్ మార్చుకునే సౌలభ్యం

ఎన్‌ఆర్‌ఐ చందాదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకసారి తమ పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను మార్చుకునే వెసులుబాటు ఉంది. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా నాలుగు సార్లు తమ ఇన్వెస్ట్‌మెంట్ విధానాన్ని (అసెట్ అలోకేషన్) సవరించుకోవచ్చు.

పౌరసత్వం రద్దు చేసుకుంటే నిబంధనలు వేరు

భారత పౌరసత్వాన్ని కలిగి ఉంటూ విదేశాలకు మారిన వారికి పైన పేర్కొన్న నిబంధనలు వర్తిస్తాయి. ఒకవేళ ఎవరైనా భారత పౌరసత్వాన్ని పూర్తిగా రద్దు చేసుకుని, ఓసీఐ కార్డు కూడా లేకపోతే వారి ఎన్‌పీఎస్ ఖాతా నిబంధనలు మారుతాయి. అటువంటి వారి ఎన్‌పీఎస్ ఖాతాలను మూసివేసి, నిధులను సెటిల్ చేయడానికి పీఎఫ్‌ఆర్‌డీఏ ఏప్రిల్ 2025లో ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. పౌరసత్వం ఉన్నంతవరకు ఎన్‌ఆర్‌ఈ/ఎన్‌ఆర్‌ఓ ఖాతాల ద్వారా ఎన్‌పీఎస్ టైర్-1 సేవలను ఉపాధి కోసం విదేశాలకు వెళ్లినవారు పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks