...
...
Next Story

ఎన్‌ఎస్‌ఈ vs హీరో మోటార్స్ ఐపీఓ: ఏది కొంటే ఎక్కువ లాభం? మార్కెట్ విశ్లేషణ

సెప్టెంబర్ 2026లో దేశీయ స్టాక్ మార్కెట్లను హీటెక్కిస్తున్న రెండు కీలక ఐపీఓలు ఎన్‌ఎస్‌ఈ, హీరో మోటార్స్. వీటి ఇష్యూ వివరాలు, జీఎంపీ, విశ్లేషకుల అభిప్రాయాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 15, 2026, 16:15:33 IST
Advertisement

స్టాక్ మార్కెట్లో మళ్లీ ఐపీఓల సందడి మొదలైంది. ఈసారి పెట్టుబడిదారుల ముందుకు రెండు విభిన్న రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రాబోతున్నాయి. ఒకవైపు మార్కెట్ మౌలిక వసతుల రంగానికి తిరుగులేని రాజు లాంటి ఎన్‌ఎస్‌ఈ (NSE), మరోవైపు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ వాహన రంగానికి అను అనుబంధంగా పనిచేసే హీరో మోటార్స్ (Hero Motors) పబ్లిక్ ఇష్యూకు సిద్ధమయ్యాయి.

ఎన్‌ఎస్‌ఈ vs హీరో మోటార్స్ ఐపీఓ: ఏది కొంటే ఎక్కువ లాభం? మార్కెట్ విశ్లేషణ
ఎన్‌ఎస్‌ఈ vs హీరో మోటార్స్ ఐపీఓ: ఏది కొంటే ఎక్కువ లాభం? మార్కెట్ విశ్లేషణ

ఈ రెండు ఐపీఓలు వరుస రోజుల్లో ప్రారంభమవుతుండటంతో, రెండింటిలో ఏది ఎక్కువ లిస్టింగ్ లాభాలు అందిస్తుంది, దేనిలో పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే చర్చ ఇన్వెస్టర్లలో మొదలైంది. హీరో మోటార్స్ ఐపీఓ సెప్టెంబర్ 16న ప్రారంభం కానుండగా, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ సెప్టెంబర్ 17న సబ్‌స్క్రిప్షన్ కోసం తెరచుకోనుంది. ఈ రెండు ఇష్యూల పూర్తి వివరాలు, జీఎంపీ ట్రెండ్స్, బ్రోకరేజీ సంస్థల సిఫార్సులు పరిశీలిద్దాం.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ (NSE IPO) పూర్తి వివరాలు

గ్రే మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ బలమైన ఆరంభాన్ని సూచిస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ షేరుపై గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) రూ. 180 వద్ద కొనసాగుతోంది. ఐపీఓ పైధర రూ. 1,785తో పోలిస్తే, అంచనా లిస్టింగ్ ధర రూ. 1,965గా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే లిస్టింగ్ రోజున సుమారు 10 శాతం ప్రీమియం లభించవచ్చు.

మొత్తం రూ. 22,561.57 కోట్ల విలువైన ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో రానుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వాటాదారులు 12.64 కోట్ల షేర్లను విక్రయిస్తున్నారు.

కేటాయింపు & లిస్టింగ్: షేర్ల కేటాయింపును సెప్టెంబర్ 22న పూర్తి చేయనున్నారు. బీఎస్ఈ (BSE) ఎక్స్ఛేంజ్‌లో సెప్టెంబర్ 24న షేర్లు లిస్ట్ కానున్నాయి.

ధరల శ్రేణి, లాట్ సైజ్: షేరు ధరల శ్రేణిని రూ. 1,700 నుంచి రూ. 1,785గా నిర్ణయించారు. ఒక లాట్‌కు 8 షేర్లు కేటాయించారు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ. 14,280 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

మేనేజర్లు: కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా, ఎంయుఎఫ్‌జి ఇన్‌టైమ్ ఇండియా రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

హీరో మోటార్స్ ఐపీఓ (Hero Motors IPO) విశేషాలు

శాతాల పరంగా చూస్తే హీరో మోటార్స్ గ్రే మార్కెట్‌లో ఎన్‌ఎస్‌ఈ కంటే ఎక్కువ ప్రీమియం చూపిస్తోంది. ప్రస్తుతం దీని జీఎంపీ రూ. 22 వద్ద ఉంది. ఇష్యూ పైధర రూ. 84 కాగా, లిస్టింగ్ ధర రూ. 106 వద్ద నమోదయ్యే అవకాశం ఉందని గ్రే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది సుమారు 26.19 శాతం ప్రీమియంను సూచిస్తుంది.

మొత్తం రూ. 1,000 కోట్ల విలువైన హీరో మోటార్స్ ఇష్యూలో రూ. 600 కోట్ల విలువైన 7.14 కోట్ల నూతన షేర్లు (Fresh Issue), రూ. 400 కోట్ల విలువైన 4.76 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి.

ఐపీఓ తేదీలు: సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 16న ప్రారంభమై సెప్టెంబర్ 18న ముగుస్తుంది.

కేటాయింపు & లిస్టింగ్: షేర్ల కేటాయింపు సెప్టెంబర్ 21న జరగనుండగా, ఎన్‌ఎస్ఈ మరియు బీఎస్ఈ రెండింటిలోనూ సెప్టెంబర్ 23న షేర్లు లిస్ట్ అవుతాయి.

ధరల శ్రేణి & లాట్ సైజ్: ధరల శ్రేణిని రూ. 79 నుంచి రూ. 84గా నిర్ణయించారు. లాట్ పరిమాణం 178 షేర్లు కాగా, రిటైల్ ఇన్వెస్టర్ కనీస పెట్టుబడి రూ. 14,952గా ఉంది.

మేనేజర్లు: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లీడ్ మేనేజర్‌గా, కెఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తున్నాయి.

బ్రోకరేజీ సంస్థల విశ్లేషణ - విశ్లేషకుల అభిప్రాయం

రెండు ప్రముఖ ఐపీఓలు ఒకేసారి వస్తున్న నేపథ్యంలో బ్రోకరేజీ సంస్థల రేటింగ్‌లు ఇన్వెస్టర్లకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయి.

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు 'సబ్‌స్క్రైబ్' రేటింగ్:

జేఎమ్ ఫైనాన్షియల్ (JM Financial) సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇష్యూకు సానుకూల రేటింగ్ ఇచ్చింది. ఎన్‌ఎస్‌ఈ గత 12 నెలల ప్రాతిపదికన (TTM) 47.3 రెట్ల పీఈ (P/E) మల్టిపుల్‌తో లభిస్తోందని, బీఎస్ఈ (48.9 రెట్లు) తో పోలిస్తే ఇది సమంజసంగానే ఉందని తెలిపింది. బీఎస్ఈతో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ పరిమాణం మూడింతలు ఎక్కువని, క్యాష్ మార్కెట్‌లో 90 శాతానికి పైగా, ఈక్విటీ ఫ్యూచర్స్‌లో దాదాపు పూర్తి ఆధిపత్యం ఎన్‌ఎస్‌ఈదేనని విశ్లేషించింది. దాదాపు 76 శాతానికి పైగా మార్జిన్లు, అప్పులు లేని బ్యాలెన్స్ షీట్ ఎన్‌ఎస్‌ఈ సొంతమని పేర్కొంటూ 'సబ్‌స్క్రైబ్' చేయవచ్చని సిఫార్సు చేసింది.

హీరో మోటార్స్ ఐపీఓకు 'న్యూట్రల్' రేటింగ్:

స్వాస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ (Swastika Investmart) సంస్థ హీరో మోటార్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గ్లోబల్ ఈ-బైక్ కంబైన్డ్ ట్రాన్స్‌మిషన్ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, దీని పీఈ నిష్పత్తి 69 నుంచి 74 రెట్లుగా ఉందనీ, ఇది ఇతర పోటీ కంపెనీల సగటు (50.2 రెట్లు) కంటే ఎక్కువని పేర్కొంది. అలాగే కంపెనీ ఆదాయంలో 73 నుంచి 78 శాతం కేవలం టాప్ 10 కస్టమర్ల నుంచే వస్తుండటం ప్రతికూల అంశమని తెలిపింది. బిజినెస్ మోడల్ మంచిదే అయినప్పటికీ, ధర ఎక్కువగా ఉండటం వల్ల లిస్టింగ్ లాభాల పరిమితి తక్కువగా ఉండే అవకాశం ఉందంటూ 'న్యూట్రల్' (తటస్థ) రేటింగ్ ఇచ్చింది.

(గమనిక: ఇక్కడ అందించిన విశ్లేషణలు బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు గుర్తింపు పొందిన ఆర్థిక నిపుణులను సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks