...
...
Next Story

విజయ్ టీవీకే సభలో విషాదం: అభిమాని మృతి, జర్నలిస్టులపై దాడి.. అన్నాడీఎంకే విమర్శ

నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సేలం సభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు తన పార్టీకి 30 శాతానికి పైగా ప్రజా మద్దతు ఉందని విజయ్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరోవైపు అదే సభలో ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది.

Published on: Feb 13, 2026, 18:33:02 IST
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న నటుడు విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సేలం సభలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ సభలో ఓ అభిమాని గుండెపోటుతో మరణించడం విషాదం నింపింది. ఈ ఘటనపై విరుచుకుపడిన విపక్ష అన్నాడీఎంకే (AIADMK) విజయ్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది.

అభిమాని మృతితో మొదలైన వివాదం

‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సేలం సభలో మాట్లాడుతున్న విజయ్ (TVK)
‘తమిళగ వెట్రి కళగం’ (TVK) సేలం సభలో మాట్లాడుతున్న విజయ్ (TVK)

మహారాష్ట్రకు చెందిన సూరజ్ (37) అనే విజయ్ అభిమాని సేలం సభకు హాజరయ్యారు. అయితే విజయ్ సభా ప్రాంగణానికి చేరుకోవడానికి ముందే సూరజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సూరజ్‌కు గతంలోనే గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా మరణించిన ఘటన మరువక ముందే, ఇప్పుడు మరో మరణం సంభవించడం చర్చనీయాంశంగా మారింది.

“శవపేటిక సిద్ధం చేసుకోవాల్సిందేనా?”

ఈ మరణంపై అన్నాడీఎంకే జాతీయ అధికార ప్రతినిధి కోవై సత్యన్ సోషల్ మీడియాలో నిప్పులు చెరిగారు. శవపేటిక ఫోటోను జత చేస్తూ.. “భవిష్యత్తులో టీవీకే సభలకు వెళ్లాలనుకునే వారు తమ వెంట ఒక శవపేటికను కూడా తీసుకెళ్లాలేమో” అని ఎద్దేవా చేశారు. వరుసగా సభలలో ప్రాణనష్టం జరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, క్యాడర్ భద్రతపై విజయ్ వైఖరిని ప్రశ్నించారు.

జర్నలిస్టులతో టీవీకే శ్రేణుల ఘర్షణ

అభిమాని మృతిపై వివరాలు సేకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై టీవీకే కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బాధితుడి వివరాలు అడుగుతున్న క్రమంలో విజువల్స్ తీయొద్దంటూ జర్నలిస్టులతో గొడవకు దిగి, వారిపై దాడి చేశారు. ఈ ఘటనపై మీడియా వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీనిపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పందిస్తూ.. “ఇది ఒక చిన్న అపార్థం వల్ల జరిగిన ఘటన. ఇలాంటివి మళ్లీ జరగకూడదని మేము కోరుకుంటున్నాం” అని విచారం వ్యక్తం చేశారు.

30 శాతం మద్దతు.. కామరాజర్ తరహా పాలన: విజయ్

ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, విజయ్ సభలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe