OPPO Reno 17 : 8000ఎంఏహెచ్​ బ్యాటరీ, 200ఎంపీ కెమెరాతో ఒప్పో రెనో 17 సిరీస్- ధరలు ఇలా..

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో ఫోన్లు విడుదలయ్యాయి. భారీ 8,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 200 మెగాపిక్సెల్ కెమెరా, ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17తో వచ్చిన ఈ ఫోన్ల ధరలు, ఇండియా లాంచ్ అప్డేట్స్​ని ఇక్కడ చూడండి..

Published on: Nov 17, 2026, 09:10:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రముఖ టెక్ సంస్థ ఒప్పో సరికొత్త అస్త్రాలను వదిలింది. నవంబర్ 16న చైనా మార్కెట్లో ‘ఒప్పో రెనో 17’, 'ఒప్పో రెనో 17 ప్రో' స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. భారీ సామర్థ్యం గల బ్యాటరీలు, అప్‌గ్రేడ్ చేసిన పెరిస్కోప్ కెమెరాలు, సరికొత్త డిజైన్‌తో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దింది.

ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో..
ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో..

ఈ నేపథ్యంలో ఈ ఒప్పో రెనో 17 సిరీస్​ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో రెనో 17, రెనో 17 ప్రో ధరలు, సేల్..

చైనాలో ఒప్పో రెనో 17 ప్రారంభ ధరను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 3,599 యువాన్లుగా (సుమారు రూ. 51,000) నిర్ణయించారు. మిగిలిన వేరియంట్ల ధరలను పరిశీలిస్తే 12 జీబీ + 256 జీబీ మోడల్ ధర 3,799 యువాన్లు, 12 జీబీ + 512 జీబీ మోడల్ ధర 3,999 యువాన్లు, టాప్-ఎండ్ 12 జీబీ + 1 టీబీ వేరియంట్ ధర 4,899 యువాన్లుగా ఉన్నాయి.

మరోవైపు ఒప్పో రెనో 17 ప్రో 8 జీబీ + 256 జీబీ బేస్ వేరియంట్ ధర 4,199 యువాన్ల (సుమారు రూ. 59,000) వద్ద మొదలవుతుంది. ఇందులో 12 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర 4,599 యువాన్లు కాగా, 12 జీబీ + 512 జీబీ వేరియంట్ ధర 4,999 యువాన్లకు లభిస్తుంది.

ఈ ఒప్పో రెనో 17 సిరీస్​కి సంబంధించి చైనాలో ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా, నవంబర్ 20 నుంచి సాధారణ విక్రయాలు మొదలుకానున్నాయి. మోడల్‌ను బట్టి అడ్వెంచర్ క్యాట్, కోకో బ్రౌన్ రంగులతో పాటు ఆకర్షణీయమైన తెలుపు రంగు షేడ్స్‌లో ఈ ఫోన్లను తీసుకొచ్చారు.

ఒప్పో రెనో 17 సిరీస్- బ్యాటరీ, కెమెరా ఫీచర్లు..

స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే స్టాండర్డ్ ఒప్పో రెనో 17 మోడల్‌లో 6.56-అంగుళాల 1.5కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అమర్చారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 1,800 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. వేగవంతమైన పనితీరు కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, గరిష్టంగా 12 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ ఇచ్చారు. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రధాన కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాతో పాటు 3.5x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేసే 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అందించారు.

ఈ స్మార్ట్​ఫోన్‌లో 8,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం అతిపెద్ద ఆకర్షణ.

ఇక రెనో 17 ప్రో మోడల్ విషయానికొస్తే, చేతిలో ఇమిడిపోయేలా కాస్త చిన్నదైన 6.32-అంగుళాల 1.5కే ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో రూపొందించారు. ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8550 సూపర్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. కెమెరా విభాగంలో ప్రో మోడల్ మరింత ముందంజలో ఉంది; వెనుకవైపు 200 మెగాపిక్సెల్ ఓఐఎస్ ప్రధాన సెన్సార్‌తో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి.

ఈ ఒప్పో రెనో 17 ప్రోలో 7,250 ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు 80 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ 17 ఆధారిత కలర్ ఓఎస్ 17 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి. దృఢమైన మెటల్ ఫ్రేమ్‌లు, దుమ్ము నీటి నుంచి అత్యున్నత రక్షణనిచ్చే ఐపీ69కే రేటింగ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్లను రెండింటిలోనూ అందించారు.

భారత్‌లో రెనో 17 విడుదల ఎప్పుడు? అంచనా ధరల లెక్కలివే!

భారత మార్కెట్లో రెనో 17 సిరీస్ విడుదల తేదీని ఒప్పో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం.. స్టాండర్డ్ రెనో 17 మోడల్ 2026 డిసెంబర్ నెలలో ‘రెనో 17సీ’ ఫోన్‌తో కలిసి భారత్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది.

ధరల అంచనాలపై ప్రముఖ టిప్‌స్టర్ 'గ్యాడ్జెట్స్‌డేటా' ఆసక్తికర సమాచారం పంచుకున్నారు. దీని ప్రకారం భారత్‌లో రెనో 17 ధర రూ. 70,000 కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉండగా, రెనో 17సీ ధర రూ. 50,000 పైనే ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ధరలపై ఒప్పో సంస్థ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ ఇవ్వలేదు.

మరోవైపు రెనో 17 ప్రో మోడల్‌ను భారత్‌కు తీసుకొస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత కొరవడింది. స్టాండర్డ్ రెనో 17 ఫోన్‌ను మాత్రం ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో మార్కెటింగ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More