రేపటి నుంచి MTR foods మాతృసంస్థ Orkla India ఐపీఓ- జీఎంపీ ఎంత?
MTR, Eastern బ్రాండ్స్‌కి మాతృసంస్థ అయిన ఒర్క్లా ఇండియా ఐపీఓగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్, ప్రైజ్ బ్యాండ్, జీఎంపీతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
సుప్రసిద్ధ మసాలా దినుసులు, ఫుడ్ బ్రాండ్స్ ఎంటీఆర్, ఈస్టర్న్లను కలిగి ఉన్న ఓర్క్లా ఇండియాకు సంబంధించిన ఇనీషయల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)పై మంచి బజ్ ఉంది. బుధవారం ఓపెన్కానున్న ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రైజ్ బ్యాండ్‌ని షేరుకు రూ. 695 నుంచి రూ. 730 గా నిర్ణయించారు.ఈ నేపథ్యంలో ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టే ముందు ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలను ఇక్కడ చూసేయండి..

ఓర్క్లా ఇండియా ఐపీఓ: ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు..
1. ఓర్క్లా ఇండియా ఐపీఓ తేదీలు
ఓర్క్లా ఇండియా ఐపీఓ సబ్స్క్రిప్షన్ అక్టోబర్ 29న ప్రారంభమై, అక్టోబర్ 31న ముగుస్తుంది. ఈ షేర్లు నవంబర్ 6న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.
2. ఓఎఫ్ఎస్ వివరాలు
ఈ ఇష్యూ మొత్తం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎప్ఎస్) రూపంలో ఉంది. ఇందులో ప్రమోటర్, ఇతర విక్రేత వాటాదారులు దాదాపు 2,28,43,004 షేర్లను విక్రయించనున్నారు.
3. IPO ఉద్దేశం
ఓర్క్లా ఇండియా ఐపీఓ మొత్తం రూ. 1667 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ కాబట్టి, ఈ షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధులు కంపెనీకి చెందవు. ఈ మొత్తం ప్రమోటర్ విక్రయ వాటాదారులకు వెళుతుంది.
4. ఓర్క్లా ఇండియా ఆర్థిక వివరాలు
ఓర్క్లా ఇండియా ఆర్థిక సంవత్సరం 2025లో ఆదాయంలో 1.6% వృద్ధిని సాధించి, రూ. 2,394.7 కోట్లను నమోదు చేసింది. ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 12.9% పెరిగి, రూ. 226.33 కోట్ల (FY24) నుంచి రూ. 255.69 కోట్లకు చేరింది.
5. ఓర్క్లా ఇండియా పోటీదారులు
లిస్టెడ్ కంపెనీల్లో టాటా కన్స్యూమర్ ప్రాడక్ట్స్ మాత్రమే ఓర్క్లా ఇండియాకు పోటీదారుగా ఉంది. టాటా గ్రూప్ కంపెనీ పీ/ఈ నిష్పత్తి 90.1 రెట్లు ఉంది. ఎంటీఆర్ మాతృసంస్థ షేరుకు ఆదాయం (ఈపీఎస్) రూ. 18.7 ఉండగా, టాటా కంపెనీకి రూ. 13.1గా ఉంది. అయినప్పటికీ, టాటా కంపెనీ మొత్తం ఆదాయం ఓర్క్లా కంటే గణనీయంగా ఎక్కువగా ఉంది.
6. ఇండస్ట్రీ ఓవర్వ్యూ
భారతీయ ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్ ఆర్థిక సంవత్సరం 2024 నాటికి రూ. 10,180 బిలియన్లుగా అంచనా వేయడం జరిగింది. ఇది ఆర్థిక సంవత్సరం 2019తో పోలిస్తే 10.8% సీఏజీఆర్ వృద్ధిని సూచిస్తుంది. ఆర్థిక సంవత్సరం 2024 నాటికి, భారతదేశం ప్రపంచ మసాలా దినుసుల ఉత్పత్తిలో పరిమాణం పరంగా దాదాపు 70%, ప్రపంచ ఎగుమతి విలువలో సుమారు 43% వాటాను కలిగి ఉంది.
7. కంపెనీ గురించి
ఓర్క్లా ఇండియా అనేది బహుళ-కేటగిరీల భారతీయ ఆహార సంస్థ. దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, స్నాక్స్, పానీయాలు, డెజర్ట్‌లతో పాటు వివిధ రకాల ఉత్పత్తులను అందిస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2024లో, ఎంపిక చేసిన అగ్రగామి మసాలా దినుసులు, రెడీమేడ్ ఫుడ్ కంపెనీల్లో.. ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం పరంగా ఇది మొదటి నాలుగు కంపెనీలలో ఒకటి.
8. విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్
కంపెనీకి 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలలో 834 డిస్ట్రిబ్యూటర్లు, 1,888 సబ్ డిస్ట్రిబ్యూటర్లతో కూడిన విస్తృత పంపిణీ నెట్‌వర్క్ ఉంది. దీనితో పాటు, 42 ఆధునిక వాణిజ్య భాగస్వాములు, ఆరు ఈ-కామర్స్, క్విక్ కామర్స్ భాగస్వాములు కూడా ఉన్నారు.
కంపెనీ బ్రాండ్స్ ఎంటీఆర్, ఈస్టర్న్.. కర్ణాటక, కేరళలో మసాలాల కోసం అత్యంత విస్తృతంగా పంపిణీ అవుతున్నట్టు మీడియా కథనాలు సూచిస్తున్నాయి. కర్ణాటకలో దాదాపు 3 లక్షల రిటైల్ అవుట్‌లెట్లలో, కేరళలో సుమారు 74,500 అవుట్‌లెట్లలో కలగలిపిన మసాలాలను విక్రయిస్తున్నారు. ఇందులో ఓర్క్లా బ్రాండ్స్ కర్ణాటకలో 67.5%, కేరళలో 70.4% అవుట్‌లెట్లలో ఉన్నాయి. ఇది పరిశ్రమ సగటు (30–40%) కంటే చాలా ఎక్కువ.
9. తయారీ కేంద్రాలు
జూన్ 30, 2025 నాటికి, ఓర్క్లా ఇండియాకు నాలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా దక్షిణ భారతదేశంలో తొమ్మిది సొంత తయారీ కేంద్రాలు ఉన్నాయి. అదనంగా, అదే తేదీ నాటికి, కంపెనీకి 21 కాంట్రాక్ట్ తయారీ కేంద్రాలతో ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో 18 భారతదేశంలోని ఏడు రాష్ట్రాలలో ఉండగా, మూడు భారతదేశం వెలుపల ఉన్నాయి.
10. రిస్క్‌లు ఇవి
ముడి పదార్థాల సరఫరా కోసం కంపెనీ సరఫరాదారులపై ఆధారపడి ఉంది. జూన్ 30, 2025తో ముగిసిన మూడు నెలల్లో, మొత్తం కొనుగోళ్లలో అగ్రగామి పది మంది సరఫరాదారుల వాటా 37.9%, ఆర్థిక సంవత్సరం 2025లో 33.7% ఉంది. సరఫరాదారుల నష్టం లేదా సరఫరా సకాలంలో అందకపోవడం వల్ల కంపెనీ వ్యాపారం, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడవచ్చు.
ముడిసరుకు, ప్యాకేజింగ్ మెటీరియల్ ధరల్లో అస్థిరత ఉండవచ్చు. పోటీ ధరలకు ముడి పదార్థాలు, ప్యాకేజింగ్ మెటీరియల్‌ను సేకరించడంలో కంపెనీ విఫలమైతే, అది వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
11. బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లు
ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సిటీ, జేపీ మోర్గాన్, కొటక్ మహీంద్రా క్యాపిటల్ ఈ ఓర్క్లా ఇండియా ఐపీఓకి బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉంది.
12. ఓర్క్లా ఇండియా ఐపీఓ జీఎంపీ
ఓర్క్లా ఇండియా ఐపీఓ జీఎంపీ ప్రస్తుతం రూ. 106గా ఉంది. అంటే సంస్థ షేర్లు సుమారు రూ. 14.5శాతం లాభాల్లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


