...
...
Next Story

పాకిస్థాన్​ వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గాన్​ క్రికెట్​ ప్లేయర్లు మృతి!

పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ముగ్గురు అఫ్గాన్ క్రికెటర్లు మృతిచెందారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కావాల్సిన త్రి-నేషన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు అఫ్గానిస్థాన్ క్రికెట్​ బోర్డు ప్రకటించింది.

Published on: Oct 18, 2025, 07:29:04 IST
Advertisement

అఫ్గానిస్థాన్​- పాకిస్థాన్​ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది! సరిహద్దు ప్రాంతమైన పక్తికా ప్రావిన్స్​పై పాక్​ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో ముగ్గురు అఫ్గానిస్థాన్​ క్రికెట్​ ప్లేయర్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అఫ్గానిస్థాన్​ క్రికెట్​ బోర్డు (ఏసీబీ) ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పాకిస్థాన్​తో జరగాల్సిన క్రికెట్​ మ్యాచ్​లను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది.

పాక్​ దాడుల్లో అఫ్గాన్​ ప్లేయర్లు మృతి..

మరణించిన అఫ్గాన్​ ప్లేయర్ల ఫొటోలు..
మరణించిన అఫ్గాన్​ ప్లేయర్ల ఫొటోలు..

మరణించిన ముగ్గురు ఆటగాళ్ల పేర్లు "కబీర్, సిబ్‌ఘతుల్లా, హరూన్' అని ఏసీబీ వెల్లడించింది. ప్లేయర్లు.. వచ్చే నెలలో పాకిస్థాన్, శ్రీలంకతో కలిసి జరగబోయే త్రి-నేషన్ సిరీస్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.

'పిరికిపందల దాడి'గా ఏసీబీ ప్రకటన

"ఉర్గున్‌లోని తమ స్వస్థలానికి తిరిగి వచ్చిన తర్వాత, వారు ఒక సమావేశంలో ఉండగా దాడి జరిగింది," అని ఏసీబీ పేర్కొంది. ఈ దాడిని "పాకిస్థాన్ పాలన చేసిన పిరికిపందల దాడి"గా ఏసీబీ అభివర్ణించింది.

ఈ దాడుల నేపథ్యంలో, అఫ్గానిస్థాన్ త్రి-నేషన్ సిరీస్ నుంచి వైదొలిగింది.

ఏసీబీ తన అధికారిక ప్రకటనలో "పాకిస్థాన్ పాలన పిరికిపందల దాడిలో లక్ష్యంగా మారిన పక్తికా ప్రావిన్స్‌లోని ఉర్గున్ జిల్లాకు చెందిన ధైర్యవంతులైన క్రికెటర్ల విషాదకరమైన మరణం పట్ల అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తన ప్రగాఢ సంతాపం, దుఃఖాన్ని వ్యక్తం చేస్తోంది," అని పేర్కొంది.

పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది: తాలిబాన్

అఫ్గానిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో రెండు రోజుల పాటు కొనసాగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, పాకిస్థాన్ శుక్రవారం సాయంత్రం సరిహద్దు ప్రావిన్స్‌లలో తాజా వైమానిక దాడులను నిర్వహించింది.

"పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించి, పక్తికా ప్రావిన్స్‌లోని మూడు ప్రాంతాలలో బాంబు దాడి చేసింది. దీనికి అఫ్గానిస్థాన్ ప్రతీకారం తీర్చుకుంటుంది," అని ఒక సీనియర్ తాలిబాన్ అధికారి ఏఎఫ్పీకి తెలిపారు.

అస్థానిస్థాన్, పాకిస్థాన్‌ల మధ్య రెండు రోజుల కాల్పుల విరమణ శుక్రవారం సాయంత్రం ముగిసిన వెంటనే ఈ తాజా దాడులు జరగడం గమనార్హం. దోహాలో చర్చలు ముగిసే వరకు కాల్పుల విరమణను పొడిగించడానికి రెండు దేశాలు అంగీకరించాయని సమాచారం. కానీ దాని కన్నా ముందే దాడులు జరిగాయి!

దోహాలో అతి త్వరలో చర్చలు జరగనున్నాయి. అవి ముగిసే వరకు తమ 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లు శుక్రవారం అంగీకరించాయని ఓ అంతర్జాతీయ మీడియా నివేదించింది. ఈ విషయాన్ని ముగ్గురు పాకిస్థాన్ భద్రతా అధికారులు, ఒక అఫ్గాన్ తాలిబాన్ వర్గం ధృవీకరించాయి.

చర్చల కోసం పాకిస్థాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే దోహాకు చేరుకోగా, అఫ్గాన్ ప్రతినిధి బృందం శనివారం ఖతార్ రాజధానికి చేరుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks