...
...
Next Story

Paper leak bill : పేపర్​ లీక్ చేస్తే అంతే! ప్రపంచ దేశాల్లో కఠిన శిక్షలు ఎలా ఉన్నాయో తెలుసా?

Paper leak bill 2026 : పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో పరీక్షల మోసాలపై ఎలాంటి కఠిన చట్టాలు ఉన్నాయో చూద్దాము..

Published on: Jul 31, 2026, 06:06:21 IST
Advertisement

దేశంలో పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026' బుధవారం లోక్‌సభ, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ కొత్త సవరణల ప్రకారం.. వ్యవస్థీకృత పేపర్ లీకేజీలు, పరీక్షల్లో మోసాలకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను చేర్చారు.

పేపర్​ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.. (Sansad TV)
పేపర్​ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.. (Sansad TV)

దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగడం, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వంటి పరిణామాల అనంతరం ఈ బిల్లుకు ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, భారతదేశం ఇప్పుడు కఠినమైన శిక్షలను అమల్లోకి తెస్తుండగా.. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పటికే పరీక్షల మోసాలను తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నాయి. జైలు శిక్షలతో పాటు అకడమిక్ రద్దు, వృత్తిపరమైన నిషేధాలను విధిస్తున్నాయి. వివిధ దేశాల్లోని యాంటీ-చీటింగ్ చట్టాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

దక్షిణ కొరియా: జైలు శిక్ష, డిగ్రీ రద్దు..

దక్షిణ కొరియాలో పరీక్షలకు సంబంధించిన తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా 1.5 కోట్ల వోన్ (దక్షిణ కొరియా కరెన్సీ) వరకు ఫైన్ విధిస్తారు. డమ్మీ అభ్యర్థులు, ఏఐ పరికరాల ద్వారా మోసాలు చేయడం, పేపర్ దొంగిలించడం వంటివి ఈ చట్టం కిందకు వస్తాయి. అక్రమాలకు పాల్పడిన వారి యూనివర్సిటీ అడ్మిషన్లు, డిగ్రీలు, స్టూడెంట్ వీసాలను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది.

చైనా: 7 ఏళ్ల వరకు జైలు శిక్ష..

చైనాలో నిర్వహించే జాతీయ పరీక్షల్లో గ్యాంగ్‌లుగా ఏర్పడి మాస్ చీటింగ్‌కు పాల్పడితే గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. చిన్న తరహా మోసాలకు మూడేళ్ల వరకు జైలు లేదా క్రిమినల్ డిటెక్షన్ ఉంటుంది. పరీక్షల్లో ఇతరుల స్థానంలో డమ్మీ అభ్యర్థులను కూర్చోబెట్టడం (ఇంపర్సనేషన్), ఆన్సర్ కీలను విక్రయించడం వంటి చర్యలను కఠినంగా శిక్షిస్తారు. పేపర్ లీకేజీలను చైనా 'స్టేట్ సీక్రెసీ' (రాజ్య రహస్యాల చట్టం) కింద విచారిస్తుంది. నేరస్థుల స్కోర్‌లను రద్దు చేయడంతో పాటు కొన్ని ఏళ్ల పాటు పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తారు. అంతేకాకుండా దేశ సామాజిక క్రెడిట్ బ్లాక్‌లిస్ట్‌లో వీరి పేర్లను చేరుస్తారు.

ఫ్రాన్స్: ఏకంగా 10 ఏళ్ల జైలు శిక్ష..

బ్రిటన్‌లో పరీక్షల్లో మోసానికి పాల్పడితే అభ్యర్థిని తక్షణమే డిస్క్వాలిఫై చేసి పరీక్షలను రద్దు చేస్తారు. 2022లో తెచ్చిన 'స్కిల్స్ అండ్ పోస్ట్-16 ఎడ్యుకేషన్ యాక్ట్' ద్వారా అసైన్‌మెంట్లు, ఎస్సేలు రాసిచ్చే కాంట్రాక్ట్ ఏజెన్సీలను నేరంగా ప్రకటించారు. ఆర్గనైజ్డ్ పేపర్ లీక్ కేసుల్లో నేరం రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది.

అమెరికా: 20 ఏళ్ల వరకు జైలు శిక్ష..

అమెరికాలో దేశవ్యాప్తంగా ఒకే యాంటీ-చీటింగ్ చట్టం లేనప్పటికీ.. వివిధ రాష్ట్రాల చట్టాలు, ఫెడరల్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. వ్యవస్థీకృత పరీక్షల మోసాలపై ఐడెంటిటీ థెఫ్ట్, కాన్​స్పిరసీ, వైర్ ఫ్రాడ్ వంటి తీవ్రమైన ఆరోపణల కింద కేసులు నమోదు చేస్తారు. నేరం తీవ్రతను బట్టి గరిష్టంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి.

జపాన్: మూడేళ్ల జైలు శిక్ష..

జపాన్‌లో వ్యాపార లేదా వ్యవస్థీకృత కార్యకలాపాలకు భంగం కలిగించే చట్టాల కింద పరీక్షల మోసాలపై చర్యలు తీసుకుంటారు. పేపర్ లీక్ చేసిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మార్కుల రద్దుతో పాటు సివిల్ లైబిలిటీ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

భారతదేశం కూడా ఇప్పుడు ఈ సవరణల ద్వారా కఠిన చట్టాలు కలిగిన దేశాల సరసన చేరింది. భవిష్యత్తు తరాల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలన్నా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెరగాలన్నా ఇలాంటి కఠిన నిబంధనలు ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks