...
...
Next Story

Petrol diesel prices : మళ్లీ పెరిగిన పెట్రోల్​, డీజిల్​ ధరలు! వారంలో రెండోసారి- ఎంతంటే..

Petrol diesel price hike : అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు మండుతుండటంతో దేశీయంగా ఇంధన ధరల పెరుగుదల కొనసాగుతోంది. మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు మరో 90 పైసల వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇంధన ధరలు పెరగడం వారంలో ఇది రెండోసారి.

Published on: May 19, 2026, 07:09:24 IST
Advertisement

Petrol price in Hyderabad : దేశంలో వాహనదారులకు ఇంధన ధరల సెగ గట్టిగా తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో దేశీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీ) పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. మంగళవారం (మే 19) దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్, డీజిల్ ధరలపై సగటున 90 పైసలు పెంచాయి. ఇంధన ధరలు పెరగడం గత వారం రోజుల్లో ఇది రెండోసారి. అంతకుముందు గత శుక్రవారమే లీటరుకు రూ. 3 చొప్పున భారీగా పెంచిన విషయం తెలిసిందే.

పెట్రోల్​, డీజిల్​ ధరల పెంపు- ప్రధాన నగరాల్లో తాజా రేట్లు ఇలా..

పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెంపు..
పెట్రోల్​, డీజిల్​ ధరలు మరోసారి పెంపు..

దిల్లీ: దేశ రాజధానిలో పెట్రోల్ ధర 87 పైసలు పెరిగి రూ. 98.64 కి చేరగా, డీజిల్ ధర 91 పైసలు పెరిగి రూ. 91.58 కి చేరుకుంది.

ముంబై: దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ ధరపై 91 పైసలు పెరగడంతో లీటరు రూ. 107.59 కి చేరింది. అలాగే డీజిల్ ధర 94 పైసలు పెరిగి రూ. 94.08 గా నమోదైంది.

కోల్‌కతా: ఇక్కడ పెట్రోల్‌పై అత్యధికంగా 96 పైసలు బాదడంతో లీటరు ధర రూ. 109.70 కి చేరింది. డీజిల్ 94 పైసల పెంపుతో రూ. 96.07 వద్దకు వచ్చింది.

చెన్నై: తమిళనాడు రాజధానిలో పెట్రోల్ ధర 82 పైసలు పెరిగి రూ. 104.49 కి, డీజిల్ ధర 86 పైసలు పెరిగి రూ. 96.11 కి చేరింది.

హైదరాబాద్ : ఇక్కడ లీటరు పెట్రోల్‌ ధర రూ. 111.88 కి చేరింది. డీజిల్ ధర రూ. 99.95 వద్దకు వచ్చింది.

విజయవాడ : ఇక్కడ లీటరు పెట్రోల్​ ధర రూ. 113.88గాను, లీటరు డీజిల్​ ధర రూ. 101.57గాను ఉంది.

ముడి చమురు మంటలు - ద్రవ్యోల్బణం భయాలు..

ఈ ధరలు ఇలాగే సుదీర్ఘకాలం కొనసాగితే రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని, తద్వారా రీటైల్ ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆయిల్ కంపెనీలకు భారీ నష్టాలు..

వారంలో రెండుసార్లు ధరలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇంకా భారీ నష్టాలను చూస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినందున, ప్రస్తుతం ఈ కంపెనీలు ఇంధన విక్రయాలపై రోజుకు సుమారు రూ. 750 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయి. అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే చమురు సంస్థలకు గతంలో లీటరు పెట్రోల్‌పై దాదాపు రూ. 14, డీజిల్‌పై రూ. 40 కంటే ఎక్కువ నష్టం వచ్చేదని, ఇప్పుడు చేస్తున్న ధరల సవరణలు ఆ నష్టాలను కొంతవరకు మాత్రమే పూడ్చగలవని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయినప్పటికీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) డైరెక్టర్ అరవింద్ కుమార్ ఈ ధరల పెంపును సమర్థిస్తూ.. ఇది "చాలా స్వల్పమైన పెంపు" మాత్రమేనని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాను కొనసాగించేందుకు భారతీయ రిఫైనరీలు తమ పూర్తి సామర్థ్యం కంటే ఎక్కువగానే పనిచేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe