...
...
Next Story

రూ. 8,452 కోట్లకు పీఎం కేర్స్ నిధి: విరాళాలు తగ్గినా పెరిగిన కార్పస్

పీఎం కేర్స్ ఫండ్ నిధులు 18 శాతం మేర పెరిగి రూ. 8,452 కోట్లకు చేరుకున్నాయి. విరాళాలు గణనీయంగా తగ్గినప్పటికీ, బ్యాంక్ డిపాజిట్లపై లభించిన వడ్డీ, ఏజెన్సీల నుంచి తిరిగొచ్చిన రీఫండ్ల వల్ల నిధి పరిమాణం భారీగా పెరిగింది.

Published on: Aug 19, 2026, 06:51:57 IST
Advertisement

ప్రధాన మంత్రి పౌర సహాయ, అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన నిధి (పీఎం కేర్స్) కార్పస్ నిధులు గణనీయంగా పెరిగాయి. దేశీయ, విదేశీ విరాళాలు చాలారకే తగ్గినప్పటికీ నిధి మొత్తం పెరిగింది. ఇటీవల విడుదల చేసిన అడిటెడ్ ఆర్థిక నివేదికల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 7,173.03 కోట్లుగా ఉన్న కార్పస్, 2024-25 నాటికి 17.8 శాతం వృద్ధితో రూ. 8,452.07 కోట్లకు చేరుకుంది.

వడ్డీల రాబడి

రూ. 8,452 కోట్లకు పీఎం కేర్స్ నిధి: విరాళాలు తగ్గినా పెరిగిన కార్పస్
రూ. 8,452 కోట్లకు పీఎం కేర్స్ నిధి: విరాళాలు తగ్గినా పెరిగిన కార్పస్

పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చే విరాళాల్లో స్పష్టమైన తగ్గుదల నమోదైంది. 2023-24లో రూ. 681.81 కోట్లుగా ఉన్న దేశీయ విరాళాలు 2024-25 నాటికి రూ. 479.05 కోట్లకు పడిపోయాయి. ఇవి దాదాపు 30 శాతం మేర క్షీణించాయి. విదేశీ విరాళాలు రూ. 1.14 కోట్ల నుంచి రూ. 93 లక్షలకు పరిమితమయ్యాయి.

విరాళాలు తగ్గినప్పటికీ నిధి పరిమాణం పెరగడానికి ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ఆదాయమే కీలకంగా మారింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై 2024-25లో రూ. 469.38 కోట్ల వడ్డీ ఆదాయం లభించింది. సంవత్సర ప్రారంభంలో నిధికి చెందిన రూ. 6,641.57 కోట్లు బ్యాంక్ డిపాజిట్లలో ఉన్నాయి.

ఏజెన్సీల రీఫండ్లు, బ్యాంక్ నిల్వలు

అమలు చేసే వివిధ ఏజెన్సీల నుంచి ఖర్చు కాకుండా మిగిలిపోయిన నిధులు తిరిగొచ్చాయి. ఏజెన్సీల నుంచి రూ. 324.66 కోట్లు రీఫండ్ రూపంలో పీఎం కేర్స్ ఖాతాకు చేరాయి. మునుపటి ఏడాదితో (రూ. 84.31 కోట్లు) పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఇవి కాకుండా బ్యాంక్ టిడిఎస్ రీఫండ్ రూపంలో రూ. 13.49 లక్షలు లభించాయి.

2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభ నిల్వను మినహాయించి, పీఎం కేర్స్ నిధికి మొత్తం రూ. 1,279.91 కోట్ల ఆదాయం సమకూరింది. మార్చి 31, 2025 నాటికి నిధికి చెందిన రూ. 7,846.65 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉండగా, సేవింగ్స్ ఖాతాలో రూ. 605.41 కోట్లు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది.

వ్యయం కేవలం 0.01 శాతమే

పీఎం కేర్స్ నిధుల వినియోగం, పారదర్శకతపై సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. "రూ. 8,452 కోట్ల భారీ నిధి అందుబాటులో ఉన్నప్పటికీ కేవలం 0.01 శాతం మాత్రమే ఎందుకు ఖర్చు చేశారు? అంత పెద్ద మొత్తాన్ని ఎందుకు ఉపయోగించకుండా ఉంచారు? రూ. 324 కోట్లు ఏజెన్సీల నుంచి ఎందుకు రీఫండ్ అయ్యాయో వివరణ లేదు. ఏ ఏజెన్సీలు ఆ డబ్బును వెనక్కి ఇచ్చాయి? నాసీరకం పరికరాల జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికి ఈ రీఫండ్లు చేశారా? అడిట్ నివేదికకు సంబంధించిన అనుబంధ పత్రాలను వెబ్‌సైట్‌లో ఎందుకు ఉంచలేదు?" అని సామాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా ఆమె ప్రశ్నించారు.

2020లో ఏర్పాటైన ట్రస్ట్

కోవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో ఉపశమన చర్యలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 27న పీఎం కేర్స్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో రిజిస్టర్ అయిన ఈ పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఛైర్మన్‌గా ఉన్నారు. రక్షణ, హోం, ఆర్థిక మంత్రులు ఇందులో ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ నిధికి ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయదు, కేవలం స్వచ్ఛంద విరాళాలు మాత్రమే స్వీకరిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ల ఏర్పాటుకు ఈ నిధులను వాడారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆర్థిక, విద్యా సాయం అందించేందుకు 2021 మే నెలలో ప్రత్యేక పథకం ప్రారంభించారు. పీఎం కేర్స్ సమాచార హక్కు చట్టం (RTI) పరిధిలోకి రాదని ప్రధాని కార్యాలయం గతంలో స్పష్టం చేసింది.

ముంబైకి చెందిన కేకేసీ అండ్ అసోసియేట్స్ ఎల్ఎల్పీ సంస్థ 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అడిట్ పూర్తి చేసి, 2026 ఆగస్టు 7న సంతకం చేసింది. ఈ అడిట్ నివేదికలను ఇటీవల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అంతకుముందు 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఎస్‌ఎఆర్‌సి (SARC) అండ్ అసోసియేట్స్ అడిట్ చేయగా, ఆ నివేదికలను 2024 డిసెంబర్‌లో అప్‌లోడ్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe