...
...
Next Story

మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని గురువారం వారాణాసిలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారు. ఈ సందర్భంగా 'సేవా సే సంకల్ప్ అభియాన్' పేరిట నెల రోజుల పాటు సేవా కార్యక్రమాలు, రెండు ప్రత్యేక బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.

Published on: Sep 16, 2026, 13:59:09 IST
Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలకు దేశ ఆధ్యాత్మిక రాజధాని వారాణాసి వేదిక కానుంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారాణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే (NDA) పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

నెల రోజుల పాటు 'సేవా సే సంకల్ప్ అభియాన్'

మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ (Aftab Alam Siddiqui)
మోదీ 76వ పుట్టినరోజు: వారాణాసిలో ఎన్డీయే సీఎంల భేటీ (Aftab Alam Siddiqui)

ప్రధాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ‘సేవా సే సంకల్ప్ అభియాన్’ పేరిట పలు ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాలను చేపట్టనుంది. ఈ అభియాన్ ప్రారంభానికి గుర్తుగా ప్రధాని జన్మస్థలమైన గుజరాత్‌లోని వడ్నాగర్, ఆయన పార్లమెంట్ నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారాణాసిల మధ్య రెండు భారీ బైక్ ర్యాలీలను నిర్వహించనున్నారు.

'వడ్నాగర్ నుంచి వారాణాసి', 'వారాణాసి నుంచి వడ్నాగర్' పేరిట ఈ రెండు బైక్ ర్యాలీలు సెప్టెంబర్ 17న ఒకే సమయంలో ప్రారంభమై అక్టోబర్ 7న ముగుస్తాయని బైక్ ర్యాలీ జాతీయ ఇన్‌ఛార్జ్ వి.డి.శర్మ వెల్లడించారు.

ప్రముఖ నాయకుల సమక్షంలో ప్రారంభోత్సవాలు

వడ్నాగర్‌లో జరిగే ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్, గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు జగదీష్ విశ్వకర్మ హాజరుకానున్నారు.

మరోవైపు వారాణాసిలో జరిగే ర్యాలీ ప్రారంభోత్సవంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ తదితర ముఖ్య నేతలు పాల్గొంటారు. వడ్ నగర్ నుంచి బయలుదేరే ర్యాలీ దేశంలోని వివిధ ప్రాంతాల గుండా ప్రయాణించి వారాణాసి చేరుకోగా, వారాణాసి నుంచి బయలుదేరే ర్యాలీ వడ్ నగర్ వైపు సాగుతుంది.

కోల్‌కతాలో రాజ్‌నాథ్ సింగ్ విలేకరుల సమావేశం

"ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినంతో పాటు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 ఏళ్లు, భారత ప్రధానిగా 12 ఏళ్లు.. మొత్తం 25 ఏళ్ల పాటు ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా సేవలందించిన సందర్భాన్ని పురస్కరించుకుని 'సేవా సే సంకల్ప్ అభియాన్' చేపడుతున్నాం. ఈ విషయమై కోల్‌కతాలో మీడియా సమావేశంలో మాట్లాడబోతున్నాను" అని రాజ్‌నాథ్ సింగ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

ప్రధాని పుట్టినరోజు వేడుకలతో పాటు ప్రభుత్వ అధినేతగా పాతికేళ్ల మైలురాయిని పురస్కరించుకుని ఎన్డీయే కూటమి శ్రేణులు ఈ అభియాన్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks