PM KISAN : రేపే రైతుల ఖాతాలో డబ్బులు- పీఎం కిసాన్ 21వ విడత నిధుల వివరాలు..
రైతులకు శుభవార్త! ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ 21వ విడత నిధులు రేపు, అంటే నవంబర్ 19 విడుదల కానున్నాయి. ప్రధాని మోదీ నిధులను విడుదల చేయనున్నారు.
రైతులకు ఆర్థిక సహాయం అందించే పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను రేపు, బుధవారం విడుదల చేయనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ఫిబ్రవరి 24, 2019 న ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హత కలిగిన దేశంలోని రైతు కుటుంబాలకు ఏడాదికి రూ. 6,000 ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.

పీఎం కిసాన్ 21వ విడత విడుదల తేదీ..
పీఎం కిసాన్ 21వ విడత నిధుల కోసం 2 నెలలుగా రైతులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దసరా, దీపావళికి బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 19న పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొన్ని రోజుల క్రితం కీలక ప్రకటన చేశారు.
మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన ప్రకటన ప్రకారం.. ఇప్పటివరకు 20 విడతల్లో మొత్తం రూ. 3.70 లక్షల కోట్లకు పైగా నిధులను 11 కోట్ల రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధులు రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులతో పాటు విద్య, వైద్యం, వివాహం వంటి ఇతర ఖర్చులకు కూడా ఉపయోగపడ్డాయని ఆ ప్రకటనలో తెలిపారు.
పీఎం కిసాన్ నిధులకు ఎవరు అర్హులు?
పీఎం కిసాన్ నిధులను పొందడానికి రైతులు తప్పనిసరిగా ఈ అర్హతలను పాటించాలి:
రైతులు తమ భూమి వివరాలను పథకం పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేసి ఉండాలి (సీడింగ్).
వారి బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను లింక్ చేసి ఉండాలి.
అర్హతగల రైతులను గుర్తించడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రామ స్థాయిలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దీని ద్వారా సాగు భూమి ఉన్న రైతులందరినీ ఈ పథకంలో చేర్చడానికి ప్రయత్నిస్తోంది.
పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ-కేవైసీ ఎందుకు ముఖ్యం?
పీఎం కిసాన్ పథకం కింద డబ్బులు పొందాలంటే, లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ గుర్తింపును ధృవీకరించుకోవచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్ ప్రకారం.. రైతులు ఈ-కేవైసీని సులభంగా పూర్తి చేయడానికి పలు మార్గాలు ఉన్నాయి:
- ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ
- బయోమెట్రిక్ ఆధారిత ఈ-కేవైసీ
- ఫేస్ అథెంటికేషన్ ఆధారిత ఈ-కేవైసీ
మొబైల్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసే విధానం
రైతులు తమ మొబైల్ ఫోన్ల నుంచే ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు. ఈ కింద తెలిపిన పద్ధతులను అనుసరించండి:
గూగుల్ ప్లే స్టోర్ నుంచి పీఎం కిసాన్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
పీఎం కిసాన్‌తో రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
'బెనిఫిషియరీ స్టేటస్' పేజీకి వెళ్లండి.
మీ ఈ-కేవైసీ స్టేటస్ “నో” అని చూపిస్తే, 'ఈ-కేవైసీ' పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, మీ ముఖాన్ని స్కాన్ చేయడానికి అనుమతి ఇవ్వండి.
ఫేస్ స్కాన్ విజయవంతం అయిన వెంటనే, మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.
అయితే, మీ పీఎం కిసాన్ ఖాతాలో ఈ-కేవైసీ స్టేటస్ మారడానికి 24 గంటల సమయం పడుతుంది. రైతులు తమ స్టేటస్‌ని పీఎం కిసాన్ పోర్టల్‌లోని "నో యువర్ స్టేటస్" ఫీచర్ ద్వారా లేదా కిసాన్-ఈమిత్ర యాప్ ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


