...
...
Next Story

Child Education : ప్రభుత్వ పథకాలు, మ్యూచువల్​ ఫండ్స్.. పిల్లల చదువు కోసం ఏది ఉత్తమం?

Investment tips : పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్ల కోసం పెట్టుబడి పెట్టడానికి ఎన్‌పీఎస్ వాత్సల్య, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, మ్యూచువల్ ఫండ్స్ వంటి 4 ఉత్తమ మార్గాలు ఉన్నాయి. వీటి లాక్-ఇన్ పీరియడ్స్, రిటర్న్స్ లెక్కలను సరిపోల్చి చూస్తే ఏది లాభదాయకమో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 5, 2026, 10:43:40 IST
Advertisement

Best investment for child education : తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును సురక్షితం చేయడానికి ఎంచుకునే మార్గాల్లో ఎన్‌పీఎస్ వాత్సల్య, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్​ఎస్​వై), సాధారణ మ్యూచువల్ ఫండ్స్ అనేవి 4 అత్యంత ప్రభావవంతమైన ఆప్షన్లు. ఇవన్నీ పైకి ఒకేలా కనిపించినప్పటికీ, మెచ్యూరిటీ కాలం, అవసరమైనప్పుడు డబ్బును వెనక్కి తీసుకునే (లిక్విడిటీ) నిబంధనల్లో వీటి మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు కోసం ఎందులో పెట్టుబడి పెట్టాలి?
పిల్లల భవిష్యత్తు కోసం ఎందులో పెట్టుబడి పెట్టాలి?

మీ పిల్లల చదువు కోసం మీరు పెట్టే పెట్టుబడికి ఏ పథకంలో ఎలాంటి లాభాలు వస్తాయో గణాంకాలతో సహా ఇప్పుడు పరిశీలిద్దాము..

లాభాల లెక్కలు ఎలా ఉన్నాయంటే?

ఉదాహరణకు.. ఓ వ్యక్తి తన బిడ్డ భవిష్యత్తు కోసం 15 సంవత్సరాల పాటు ప్రతి నెల రూ. 3,000 చొప్పున పెట్టుబడి పెట్టారని అనుకుందాము. అంటే 15 ఏళ్లలో వారు పెట్టే మొత్తం పెట్టుబడి రూ. 5.4 లక్షలు అవుతుంది.

అయితే, పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వచ్చే లాభాలు పూర్తిగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటాయి.

ప్రస్తుత వడ్డీ ప్రకారం.. సుకన్య సమృద్ధి యోజనతో 15ఏళ్ల తర్వాత మీ మొత్తం పెట్టుబడి విలువ రూ. 10.36లక్షలు అవుతుంది. అదే పీపీఎఫ్​లో అయితే రూ. 9.6లక్షల వరకు ఉంటుంది.

మరోవైపు, ఎన్‌పీఎస్ వాత్సల్య రిటర్న్స్‌ను ఎస్బీఐ పెన్షన్ ఫండ్‌లో 15 ఏళ్ల పాటు చేసిన వాస్తవ సిప్ ఆధారంగా లెక్కిస్తారు. మే 2011 నుంచి మే 2026 వరకు ఈ ఫండ్ వాస్తవ ఎన్ఏవీ పనితీరును ఇందుకోసం పరిగణనలోకి తీసుకోవాలి. ఇందులో దాదాపు 65 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో మళ్లిస్తారు.

ఈ నాలుగు ఆప్షన్లలో అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అత్యధికంగా దాదాపు రూ. 14.43 లక్షల నిధిని సమకూరుస్తాయి. ఇది ఎన్‌పీఎస్ వాత్సల్య ద్వారా వచ్చే మొత్తం కంటే దాదాపు రూ. 4 లక్షలు, పీపీఎఫ్ అందించే మొత్తం కంటే సుమారు రూ. 5 లక్షలు ఎక్కువ కావడం గమనార్హం.

మదుపరులు గమనించాల్సిన కీలకమైన అంశం..

రిటర్న్స్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లోని డబ్బు ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంటుంది. సరైన ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే, అనుకోని వైద్య ఖర్చులు, మార్కెట్ పతనమైనప్పుడు వచ్చే భయాందోళనలు లేదా ఇతర అత్యవసరాల నెపంతో ఈ పొదుపును మధ్యలోనే వాడేసే ప్రమాదం ఉంది. దీనివల్ల అసలు లక్ష్యం దెబ్బతింటుంది.

"లిక్విడిటీ (సులభంగా డబ్బు తీసుకునే వీలు), ఆర్థిక క్రమశిక్షణ అనేవి చాలా అరుదుగా కలిసి ప్రయాణిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ అనేవి లక్ష్యం పూర్తయ్యే వరకు డబ్బును తాకకుండా ఉండే పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందిస్తాయి. కానీ మనలో అలాంటి క్రమశిక్షణ ఉన్నవారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటప్పుడు కొన్ని పథకాల్లో ఉండే లాక్-ఇన్ (నిర్దేశిత కాలం వరకు డబ్బు తీయలేకపోవడం) అనేది ఒక పరిమితి కాదు, మన లక్ష్యాన్ని దెబ్బతినకుండా కాపాడే ఒక రక్షణ ఆయుధం," అని సెబీ నమోదిత పెట్టుబడి సలహాదారు, సహజ్ మనీ వ్యవస్థాపకుడు అభిషేక్ కుమార్ వివరించారు.

ఉదాహరణకు మార్చి 2020లో కరోనా సమయంలో మార్కెట్లు భారీగా పతనమైనప్పుడు, చాలా మంది భయంతో తమ మ్యూచువల్ ఫండ్స్ డబ్బును వెనక్కి తీసుకున్నారు, సిప్స్ ఆపేశారు. పిల్లల విద్య కోసం కేటాయించే నిధికి ఇలాంటి పరిస్థితుల నుంచి రక్షణ అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి, ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాల్లో ఉండే లాక్-ఇన్ నిబంధనలు డబ్బును ముందే విత్‌డ్రా చేయకుండా అడ్డుకుంటాయి.

"లాక్-ఇన్ పీరియడ్ ఉండే కొన్ని ఆర్థిక ఉత్పత్తులు పెద్ద మొత్తంలో ఆకర్షణీయమైన రిటర్న్స్ చూపించకపోవచ్చు. కానీ, రాబోయే 15 ఏళ్ల పాటు మార్కెట్ ఒడిదుడుకులు, ఇతర ఖర్చుల ఆకర్షణల నుంచి మీ డబ్బు సురక్షితంగా మిగిలి ఉండేలా అవి చూస్తాయి," అని నిపుణులు పేర్కొంటున్నారు.

పిల్లల భవిష్యత్తు కోసం ప్రణాళిక ఎలా వేసుకోవాలి?

మొదట ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు అవసరాలకు ఎంత డబ్బు అవసరమో లెక్కించి, దానికి తగ్గట్టుగా ప్రతి నెలా ఎంత పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. మీరు పూర్తి ఆర్థిక క్రమశిక్షణను పాటించగలరు అనుకుంటే, పెట్టుబడికి అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండే అత్యుత్తమ ఎంపిక.

తల్లిదండ్రులు ఈ కింది విధానాన్ని అనుసరించవచ్చు:

కూతురి భవిష్యత్తు కోసం: ఉన్నత చదువులు లేదా పెళ్లి వంటి అవసరాల కోసం 'సుకన్య సమృద్ధి యోజన'ను ప్రధాన పునాదిగా ఎంచుకోవాలి. దీనికి అదనంగా ఎక్కువ లాభాల కోసం కొంత మొత్తాన్ని అగ్రెసివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

కొడుకు భవిష్యత్తు కోసం: ఉన్నత విద్య లేదా కెరీర్ ప్రారంభ అవసరాల కోసం 'పీపీఎఫ్'ని పునాదిగా మార్చుకోవాలి. ఈక్విటీ మార్కెట్ లాభాలను అందుకోవడానికి దీనితో పాటు అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్‌ను కలిపి ఎంచుకోవడం మంచిది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe