Artificial Intelligence : కలలోనూ మీరే కింగ్! డ్రీమ్స్​ని కంట్రోల్ చేసే కొత్త ఏఐ పరికరం ఇది..

Device to control  dreams : "కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి" అన్న అబ్దుల్ కలాం మాటలను మార్చేసి.. "కలలు కనండి.. వాటిని మీరే డైరెక్ట్ చేసుకోండి," అంటోంది ఓ ఏఐ సంస్థ. ఈ మేరకు డ్రీమ్స్​ని కంట్రోల్​ చేసే విధంగా ఒక డివైజ్​ని ఆవిష్కరించింది. వివరాల్లోకి వెళితే..

Published on: Apr 27, 2026 9:59 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Prophetic AI : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పటికే కోడింగ్ చేస్తోంది, వ్యాసాలు రాస్తోంది, మన ఆఫీసు పనులను చక్కబెడుతోంది. ఈ నేపథ్యంలో "ఈ ఏఐ ఇంకా ఏం ఏం చేస్తుందో" అనుకునే వారికే ఈ వార్త! నిద్రిస్తున్న సమయంలో మనం కనే కలలను కంట్రోల్​ చేసేందుకు ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​ ఉపయోగపడుతుంది 'ప్రొఫెటిక్ ఏఐ' అనే స్టార్టప్ కంపెనీ ప్రకటించింది. కేవలం ఒక హెడ్ బ్యాండ్ ధరించడం ద్వారా మనకు నచ్చిన కలలను కనవచ్చని, వాటిని మనమే కంట్రోల్ చేయవచ్చని ఈ సంస్థ చెబుతోంది.

మీ కలలను మీరే కంట్రోల్​ చేసుకోండి! (Representative AI Image)
మీ కలలను మీరే కంట్రోల్​ చేసుకోండి! (Representative AI Image)

లూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటి?

మనం కంటున్నది కల అని మనకు తెలిసినప్పుడు దాన్ని 'లూసిడ్ డ్రీమింగ్' అంటారు. ఈ స్థితిలో కలలో ఏం జరగాలి, మనం ఎక్కడికి వెళ్లాలి అనేది మనమే నిర్ణయించవచ్చు. సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు, కానీ ప్రొఫెటిక్ ఏఐ తయారు చేసిన ‘డ్యూయల్’, 'ఫేజ్' అనే పరికరాలు దీనిని సాధ్యం చేస్తాయట.

ఇది ఎలా పని చేస్తుంది? (సైన్స్ వెనుక ఉన్న రహస్యం)

ఈ పరికరం చూడటానికి తల చుట్టూ పెట్టుకునే ఒక బ్యాండ్‌లా ఉంటుంది. దీని పనితీరు గురించి కంపెనీ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది:

అల్ట్రాసోనిక్ ఎనర్జీ: ఈ పరికరం నుదుటి భాగం నుంచి మెదడులోని ‘ప్రీఫ్రంటల్ కార్టెక్స్’ లోకి సురక్షితమైన అల్ట్రాసోనిక్ తరంగాలను పంపుతుంది.

యాక్టివేషన్: మనం నిద్రలో ఉన్నప్పుడు సాధారణంగా ఇనాక్టివ్​గా ఉండే 'ఫ్రంటోపారిటల్ నెట్‌వర్క్'ను ఇది ఉత్తేజపరుస్తుంది. తద్వారా నిద్రలో ఉండి కూడా మనం స్పృహతో ఉండేలా (లూసిడ్​ స్టేట్) చేస్తుంది.

సెన్సార్లు: ఇందులో ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ (ఈఈజీ) సెన్సార్లను వాడారు. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ చిప్‌లలో కూడా ఇలాంటి టెక్నాలజీనే వాడుతుండటం గమనార్హం.

ఈ పరికరం ఆర్​ఈఎం (ర్యాపిడ్ ఐ మూమెంట్) స్లీప్ దశలో మెదడును ప్రేరేపించడం ద్వారా కలలను మరింత స్పష్టంగా, మన అదుపులో ఉండేలా చేస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే, ఇది శాస్త్రీయంగా ఇంకా పూర్తిస్థాయిలో నిరూపితం కావాల్సి ఉంది.

ధర, లభ్యత..

ఈ వింత పరికరం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. మన దేశీ కరెన్సీలో వీటి ధరలు సుమారుగా ఇలా ఉన్నాయి:

మోడల్ పేరుధర (డాలర్లలో)ధర (రూపాయిల్లో - సుమారుగా)షిప్పింగ్ ఎప్పటినుంచి?
ప్రొఫెటిక్ డ్యూయల్44942,3002026 చివరి నాటికి
ప్రొఫెటిక్ ఫేజ్1,2991,22,0002027 మధ్యలో

ఇది సాధ్యమేనా?

టెక్నాలజీ పరంగా ఇది గొప్ప ఆవిష్కరణే అయినప్పటికీ, మెదడులోకి తరంగాలను పంపడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనే దానిపై నిపుణులు చర్చిస్తున్నారు. కలలను కంట్రోల్ చేయడం అనేది వినడానికి బాగున్నా, అది సహజమైన నిద్రను ఎలా ప్రభావితం చేస్తుందనేది వేచి చూడాలి.

ఏది ఏమైనా, "కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి" అన్న అబ్దుల్ కలాం మాటలను ఈ ఏఐ కంపెనీ "కలలు కనండి.. వాటిని మీరే డైరెక్ట్ చేసుకోండి," అన్నట్లుగా మార్చేసింది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More