PV Sindhu : దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన పీవీ సింధు! సమీపంలోనే భారీ పేలుడు..

PV Sindhu stranded In Dubai : దుబాయ్ విమానాశ్రయంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెను ప్రమాదం తప్పింది! ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో.. ఆదివారం ఉదయం తాను ఉన్న ప్రాంతానికి సమీపంలోనే భారీ పేలుడు సంభవించిందని ఆమె వివరించారు.

Published on: Mar 01, 2026 9:07 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్​లో చిక్కుకోపోయిన బ్యాడ్మింటన్ స్టార్​​ ప్లేయర్​ పీవీ సింధు భద్రతపై సర్వత్రా ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రతిష్టాత్మకమైన 'ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్' బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు వెళుతున్న క్రమంలో, మధ్యప్రాచ్యంలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తనకు ఎదురైన ఒక భయంకరమైన అనుభవాన్ని ట్విట్టర్​ వేదికగా షేర్​ చేశారు . ఆదివారం ఉదయం తాను, తన బృందం ఉన్న ప్రాంతానికి అతి సమీపంలోనే ఒక పేలుడు సంభవించిందని ఆమె వెల్లడించారు.

దుబాయ్​లో చిక్కుకుపోయిన పీవీ సింధు..
దుబాయ్​లో చిక్కుకుపోయిన పీవీ సింధు..

"అత్యంత భయంకరమైన క్షణం"

ఈ భయానక పరిస్థితులపై సింధు తన ఎక్స్ (ట్విట్టర్​) ఖాతాలో స్పందిస్తూ.. "పరిస్థితి గంటగంటకూ మరింత భయంకరంగా మారుతోంది. కొన్ని గంటల క్రితం మేము విమానాశ్రయంలో ఆశ్రయం పొందిన చోటుకు అతి సమీపంలోనే ఒక పేలుడు సంభవించింది. నా కోచ్ ఆ పొగ, శిధిలాలకు చాలా దగ్గరగా ఉండటంతో, ఆయన అక్కడి నుంచి వేగంగా పరుగులు తీయాల్సి వచ్చింది. ఆ క్షణం మా అందరికీ ఎంతో ఆందోళనకరంగా, భయంకరంగా అనిపించింది," అని రాసుకొచ్చారు.

సురక్షిత ప్రాంతానికి తరలింపు..

ప్రస్తుతం తామంతా క్షేమంగానే ఉన్నామని పీవీ సింధు వెల్లడించారు. సురక్షిత ప్రాంతానికి మారినట్లు వెల్లడించారు.

"దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది, దుబాయ్ అధికారుల నిరంతర కృషి వల్ల ఇప్పుడు మేం సురక్షితమైన ప్రదేశానికి చేరుకున్నాం. మా భద్రత కోసం నిరంతరం సహకరిస్తూ, అండగా నిలుస్తున్న దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మా రక్షణ కోసం వారు అద్భుతమైన మద్దతును అందిస్తున్నారు. ప్రస్తుతానికి మేం కొంచెం విశ్రాంతి తీసుకుంటున్నాము. పరిస్థితులు త్వరగా చక్కబడతాయని ఆశిస్తూ ఎదురుచూస్తున్నాము," అని ఆమె పేర్కొన్నారు.

యుద్ధం- విమానాల రద్దు..

శనివారం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భారీ దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 1979 నుంచి దేశాన్ని పాలిస్తున్న ఇస్లామిక్ నాయకత్వాన్ని కూలదోయాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సైనిక దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతాల్లో గగనతలం మూతపడ్డాయి.

మరీ ముఖ్యంగా విమాన ప్రయాణాలకు జీవనాధారంగా భావించే దుబాయ్​ విమానాశ్రయం హఠాత్తుగా క్లోజ్​ అయ్యింది. దీనివల్ల ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా వంటి అనేక ప్రధాన విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న- అమెరికా- ఇజ్రాయెల్​ దాడుల్లో ఇరాన్​ సుప్రీం లీడర్​ ఖమేనీ మరణించారా?

సమాధానం- అవును సుప్రీం లీడర్​ ఖమేనీ మరణించినట్టు ఆ దేశ మీడియాతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ప్రశ్న: ఇరాన్‌పై దాడుల వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు ఎందుకు నిలిచిపోయాయి?

సమాధానం: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల కారణంగా గల్ఫ్ ప్రాంతంలోని గగనతలం అత్యంత ప్రమాదకరంగా మారింది. యుద్ధ విమానాలు, క్షిపణి దాడుల నేపథ్యంలో ప్రయాణికుల విమానాలకు ముప్పు పొంచి ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీనివల్ల ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన విమాన సంస్థలు దుబాయ్, టెహ్రాన్ వంటి నగరాలకు సర్వీసులను రద్దు చేశాయి. ఫలితంగా పీవీ సింధు వంటి వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు.