నేనేం తప్పు చేశాను?: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సూటి ప్రశ్న

రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించిన తర్వాత ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తొలిసారి స్పందించారు. పార్లమెంటులో ప్రజల గొంతుకను వినిపించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

Updated on: Apr 03, 2026 11:04 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) లో జరుగుతున్న తాజా పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి పార్టీ తనను తప్పించిన తర్వాత ఆప్ యువ ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం నాడు తొలిసారిగా మౌనం వీడారు. తనను పదవి నుంచి తొలగించడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో ఆయన ఒక భావోద్వేగ వీడియో సందేశాన్ని పంచుకుంటూ పార్టీ అధిష్టానంపై పరోక్షంగా ప్రశ్నల వర్షం కురిపించారు.

నేనేం తప్పు చేశాను?: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సూటి ప్రశ్న (Rahul Singh)
నేనేం తప్పు చేశాను?: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సూటి ప్రశ్న (Rahul Singh)

"పార్లమెంటులో ప్రజల సమస్యలను ప్రస్తావించడం ఏమైనా నేరమా? నేను ఏదైనా తప్పు చేశానా?" అని రాఘవ్ చద్దా ఆ వీడియోలో సూటిగా ప్రశ్నించారు. ప్రజల గొంతుకగా మారడమే తాను చేసిన తప్పా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

"నాకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడల్లా నేను కేవలం ప్రజా సమస్యలనే లేవనెత్తాను. కానీ ఆప్ నాయకత్వం రాజ్యసభ సెక్రటేరియట్‌కు ఒక లేఖ రాస్తూ రాఘవ్ చద్దాకు మాట్లాడే అవకాశం ఇవ్వవద్దు అని కోరింది. నన్ను ఎందుకు మాట్లాడకుండా చేయాలని చూస్తున్నారు?" అని ఆయన నిలదీశారు. తాను కేవలం సామాన్యుల సమస్యలను మాత్రమే సభ దృష్టికి తీసుకువచ్చానని ఆయన గుర్తు చేశారు.

రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలు

తాను గత కొన్ని వారాలుగా రాజ్యసభలో ప్రస్తావించిన పలు కీలక అంశాలను కూడా రాఘవ్ చద్దా ఈ సందర్భంగా గుర్తు చేశారు:

  • విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరలు
  • గిగ్ వర్కర్లు (డెలివరీ బాయ్స్, ఫ్రీలాన్సర్లు) ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు
  • ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ల చార్జీల పెంపు
  • మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్న అధిక పన్నులు
  • విమానాల ఆలస్యం, పేపర్ లీకేజీల వ్యవహారం
  • పురుషులకు చట్టబద్ధమైన పితృత్వ సెలవుల (Paternity Leave) మంజూరు

"ఇలాంటి ప్రజా సమస్యలను లేవనెత్తిన నన్ను ఎందుకు మౌనంగా ఉంచాలని చూస్తున్నారు? ఎవరైనా నా మౌనాన్ని చూసి నేను ఓడిపోయానని అనుకోవద్దు" అని ఆయన ఒక హెచ్చరిక లాంటి సందేశాన్ని పంపారు. అదే సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆప్‌లో ముదురుతున్న విభేదాలు?

రాఘవ్ చద్దాను పార్టీ గురువారం నాడు కీలకమైన రాజ్యసభ పదవి నుంచి తొలగించింది. ఆయన స్థానంలో పార్టీకి చెందిన మరో ఎంపీ అశోక్ మిట్టల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఈ పరిణామం ఆమ్ ఆద్మీ పార్టీలో తీవ్ర విభేదాలు ఉన్నాయనే సంకేతాలను ఇస్తోంది. గతంలో ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు స్వాతి మలివాల్, అరవింద్ కేజ్రీవాల్ మధ్య వచ్చిన విభేదాలను ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

గతంలో 2024 మార్చిలో ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు, రాఘవ్ చద్దా లండన్‌లో కంటి ఆపరేషన్ చేయించుకుంటూ పార్టీ నిరసనల్లో పాల్గొనలేదు. అప్పటినుంచే ఆయనకు, పార్టీ నాయకత్వానికి మధ్య దూరం పెరిగిందని సమాచారం. తాజాగా బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ, కేజ్రీవాల్ అవినీతి నాయకత్వానికి చద్దా క్రమంగా దూరమవుతున్నారని వ్యాఖ్యానించారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More