...
...
Next Story

ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్: బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీలు

అరవింద్ కేజ్రీవాల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా నాయకత్వంలో మరో ఆరుగురు సభ్యులు కమలం గూటికి చేరారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుండి తప్పించుకునేలా 'విలీనం' మంత్రాన్ని వీరు ప్రయోగించారు.

Updated on: Apr 24, 2026, 16:31:42 IST
Advertisement

దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, ఆ పార్టీ గళంగా ముద్రపడిన రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా చివరకు కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చారు. తనతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులను కలుపుకుని కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీలో విలీనమయ్యారు. ఈ పరిణామం ఆప్ ఉనికిని రాజ్యసభలో ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, పంజాబ్ రాజకీయాల్లో కూడా పెను మార్పులకు నాంది పలికేలా కనిపిస్తోంది.

'విలీనం' వెనుక మాస్టర్ ప్లాన్

సందీప్ పాఠక్, రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్ (RAJ K RAJ /HT PHOTO)
సందీప్ పాఠక్, రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్ (RAJ K RAJ /HT PHOTO)

రాఘవ్ చద్దా తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ 'విలీనం' (Merge) అనే పదాన్ని ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. దీని వెనుక బలమైన రాజ్యాంగ కారణం ఉంది. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం, ఏ పార్టీకి చెందిన సభ్యులైనా వ్యక్తిగతంగా రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే వారి పదవి పోతుంది. అయితే, పార్టీలోని మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల (2/3) మంది ఏకమై మరో పార్టీలో విలీనం అయితే వారికి అనర్హత వేటు పడదు.

రాజ్యసభలో ఆప్‌కు మొత్తం 10 మంది సభ్యులు ఉండగా, అందులో ఏడుగురు (70 శాతం) ఇప్పుడు బీజేపీ వైపు వెళ్లారు. దీంతో వీరంతా తమ ఎంపీ పదవులను కాపాడుకుంటూనే బీజేపీలో కొనసాగే అవకాశం లభించింది. "మేము ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండొంతుల మందిమి.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతున్నాం" అని చద్దా స్పష్టం చేశారు.

పంజాబ్‌లో ఆప్‌కు కోలుకోలేని దెబ్బ

ఈ తిరుగుబాటు ప్రభావం పంజాబ్ రాష్ట్రంపై తీవ్రంగా ఉండనుంది. పార్టీని వీడిన ఏడుగురిలో ఆరుగురు పంజాబ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారే. 2022లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన తర్వాత వీరంతా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఆప్ వద్ద పంజాబ్ నుండి కేవలం ఒకే ఒక్క ఎంపీ (బల్బీర్ సింగ్ సీచేవాల్) మిగిలారు. మరో 10 నెలల్లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వానికి ఇది పెద్ద రాజకీయ సవాలుగా మారింది.

గత కొంతకాలంగా ఆప్ నాయకత్వంతో విభేదిస్తున్న ఢిల్లీ ఎంపీ స్వాతి మలివాల్ కూడా ఈ జాబితాలో ఉండటం గమనార్హం. ఒంటరిగా బయటకు వస్తే పదవి పోతుందన్న ఉద్దేశంతో ఆమె ఇన్నాళ్లూ వేచి చూశారు. ఇప్పుడు రాఘవ్ చద్దా బృందంతో కలిసి ఆమె తన దారిని సుగమం చేసుకున్నారు. ఆమె రాజ్యసభ పదవీకాలం 2030 వరకు ఉంది.

ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభలో కేవలం ముగ్గురు సభ్యులు (సంజయ్ సింగ్, బల్బీర్ సింగ్ సీచేవాల్, ఎన్డీ గుప్తా) మాత్రమే మిగిలారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్‌కు, సొంత పార్టీ ఎంపీలే షాక్ ఇవ్వడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. రాఘవ్ చద్దా, ఇతర ఎంపీలపై అనర్హత వేటు పడదా?

లేదు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం, ఒక పార్టీలోని 2/3 వంతు మంది సభ్యులు మరొక పార్టీలో విలీనం అయితే వారికి అనర్హత వేటు నుండి మినహాయింపు ఉంటుంది. ఆప్‌కు ఉన్న 10 మంది ఎంపీల్లో 7 గురు వెళ్లారు కాబట్టి వారు సురక్షితం.

2. బీజేపీలో చేరిన ప్రముఖ ఎంపీలు ఎవరు?

రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్ (క్రికెటర్), సందీప్ పాఠక్ (ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి), స్వాతి మలివాల్, అశోక్ కుమార్ మిట్టల్, రాజేందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ.

3. ఆప్ పార్టీలో ఇప్పుడు ఎంతమంది రాజ్యసభ ఎంపీలు మిగిలారు?

ప్రస్తుతానికి ఆప్ వద్ద కేవలం ముగ్గురు రాజ్యసభ ఎంపీలు మాత్రమే మిగిలారు: సంజయ్ సింగ్, బల్బీర్ సింగ్ సీచేవాల్, ఎన్డీ గుప్తా.

4. ఈ పరిణామం పంజాబ్ రాజకీయాలపై ఎలా ప్రభావం చూపుతుంది?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు 10 నెలల సమయం మాత్రమే ఉండటంతో, ఆప్ నుండి ఆరుగురు ఎంపీలు వెళ్లడం ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఇది బీజేపీకి పంజాబ్‌లో బలపడే అవకాశాన్ని కల్పిస్తుంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe