విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడారు: అమిత్ షాపై రాహుల్ గాంధీ ఆరోపణలు
సిజెపి (CJP) విద్యార్థుల ఆందోళనల వేళ నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడారంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కేవలం మొదటి అడుగు మాత్రమేనని, విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనల విరమణ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామాలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శనివారం తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో తన రెండో విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్.. నిరసన తెలుపుతున్న విద్యార్థులపై హింసకు కేంద్ర హోంమంత్రి అమిత్ షానే ప్రత్యక్ష బాధ్యుడని ఆరోపించారు.

"మన విద్యార్థులపై జరిగిన హింసకు అమిత్ షా నేరుగా బాధ్యత వహించాలి. ఆందోళనకారులపై కాల్పులు జరపడానికి, ప్రాణాంతక ఆయుధాలు, పెల్లెట్ గన్స్ (Pellet Guns) ఉపయోగించడానికి ఆయనే అనుమతి ఇచ్చారు. దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులపై భద్రతా దళాలు కాల్పులు జరపడాన్ని మేం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని గట్టిగా లేవనెత్తుతాం" అని రాహుల్ హెచ్చరించారు.
సోమవారం పార్లమెంట్ వైపు సాగిన మార్చ్ సందర్భంగా పెల్లెట్ గాయాలపాలైన ఒక విద్యార్థిని శుక్రవారం రాహుల్ గాంధీ మీడియా ముందుకు తీసుకురావడం గమనార్హం. అయితే, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడినట్లు వస్తున్న ఆరోపణలను ఢిల్లీ పోలీసులు తోసిపుచ్చారు.
'ప్రధాని మోదీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలి'
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఆయన అవినీతికి, అసమర్థతకు, విద్యా వ్యవస్థ విధ్వంసానికి ప్రతిరూపమని విమర్శించారు. అటువంటి వ్యక్తి పదవి నుంచి తప్పుకోవడం మంచి పరిణామమే అయినప్పటికీ, ఇది చాలా పెద్ద సమస్యలో ఒక చిన్న అడుగు మాత్రమేనని వ్యాఖ్యానించారు.
"ఈ దేశం మీ సొంత జాగీరు కాదు. ప్రభుత్వానికి, అధికార పక్షానికి విద్యార్థులు, విపక్షాలు ఇచ్చిన తీవ్రమైన హెచ్చరిక ఇది. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలి" అని రాహుల్ డిమాండ్ చేశారు.
ఒప్పందం కుదిరినా పోరాటం ఆగదు
కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో CJP ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లు జరిపిన చర్చలు విజయవంతమై, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
నీట్-యూజీ పేపర్ లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించడం, నిరసనకారులపై భవిష్యత్తులోనూ ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం సహా తమ డిమాండ్లన్నింటినీ కేంద్రం అంగీకరించడంతో CJP తన ఉద్యమాన్ని విరమించింది. అయితే, విద్యా వ్యవస్థలో సంపూర్ణ సంస్కరణలు వచ్చే వరకు విపక్షంగా తాము పోరాడుతూనే ఉంటామని రాహుల్ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


