New ATM rules : ఏటీఎం, కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు- మనపై ప్రభావం ఎంత?

ఏటీఎం విత్‌డ్రాయల్స్, కాంటాక్ట్‌లెస్ కార్డు చెల్లింపులపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఉచిత లావాదేవీల పరిమితి, ఫెయిల్డ్ లావాదేవీల రక్షణ, కార్డు భద్రత వంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 28, 2026, 07:30:28 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఏటీఎం విత్‌డ్రాయల్స్, కార్డు చెల్లింపులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్త నిబంధనలు జారీ చేసింది. ఏటీఎం రుసుములు, ఉచిత లావాదేవీలు, కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు, కార్డు భద్రత వంటి అంశాలను ఈ నిబంధనలు కవర్ చేస్తాయి. నవంబర్ 27న ఈ కొత్త ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పటికే అమల్లో ఉన్న పలు నిబంధనలను ఒకేచోట చేర్చి, బ్యాంకులు, వినియోగదారులు సులభంగా పాటించేలా వీటిని రూపొందించారు.

ఏటీఎం, కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. వివరాలివే!
ఏటీఎం, కార్డు లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. వివరాలివే!

చిన్నచిన్న కొనుగోళ్ల నుంచి దుకాణాల్లో నగదు తీసుకునే వరకు కార్డులు, ఏటీఎంలపై ఆధారపడేవారికి ఈ నిబంధనలు స్పష్టతనిస్తాయి. ఫెయిల్డ్ లావాదేవీలపై ఛార్జీల భయం, కార్డు సెట్టింగ్‌లపై నియంత్రణ వంటి అంశాలు సామాన్య వినియోగదారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.

ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి ఎంత?

వినియోగదారుల పరంగా చూస్తే ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యలో ఎలాంటి మార్పు చేయలేదు! నెలవారీ ఉచిత పరిమితి ముగిసిన తర్వాత ప్రతి లావాదేవీకి బ్యాంకులు గరిష్ఠంగా రూ. 23 వరకు రుసుము వసూలు చేయవచ్చు. దీనికి పన్నులు అదనంగా చేరవచ్చు.

ఇప్పటికే ఉన్న ఉచిత ఏటీఎం విత్‌డ్రాయల్ పరిమితులను ఆర్బీఐ అలాగే కొనసాగించింది. సొంత బ్యాంకు ఏటీఎం ఉపయోగిస్తే నెలకు ఐదు ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. నగదు తీసుకోవడంతో పాటు అకౌంట్ బ్యాలెన్స్ తనిఖీ వంటి సేవలు కూడా ఇందులో కలుస్తాయి.

మరో బ్యాంకు ఏటీఎం వాడితే మెట్రో నగరాల్లో నెలకు మూడు, ఇతర ప్రాంతాల్లో ఐదు ఉచిత లావాదేవీల పరిమితి వర్తిస్తుంది. ఉచిత పరిమితి దాటిన తర్వాత ప్రతి అదనపు లావాదేవీకి బ్యాంకు గరిష్ఠంగా రూ. 23తో పాటు వర్తించే పన్నులు విధించవచ్చు.

వినియోగదారులకు ఇంకా ఎన్ని ఉచిత ఏటీఎం లావాదేవీలు మిగిలి ఉన్నాయో బ్యాంకులు తప్పనిసరిగా తెలియజేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఉచిత పరిమితి దాటిన తర్వాత పడే ఛార్జీల గురించి కూడా ముందుగానే సమాచారం ఇవ్వాలి. దీనివల్ల వినియోగదారులు ఏటీఎం వాడకాన్ని సులభంగా లెక్కపెట్టుకుని, ఊహించని రుసుముల బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు.

ఏటీఎం లావాదేవీలు విఫలమయ్యే వారికి కూడా ఇందులో మంచి వెసులుబాటు కల్పించారు. సాంకేతిక లోపం వల్ల లేదా ఏటీఎంలో నగదు అయిపోవడం వల్ల లావాదేవీ పూర్తి కాకపోతే, దాన్ని ఉచిత లావాదేవీల పరిమితిలో లెక్కించరు. అలా విఫలమైన లావాదేవీలకు బ్యాంకులు ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు.

రూ. 5,000 వరకు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు..!

కార్డును స్వైప్ లేదా ఇన్సర్ట్ చేయకుండా, పేమెంట్ మెషీన్‌పై ట్యాప్ చేసి చేసే కాంటాక్ట్‌లెస్ చెల్లింపులపైనా కొత్త నిబంధనలు వర్తిస్తాయి. పిన్ లేదా మరో అదనపు ధ్రువీకరణ లేకుండా రూ. 5,000 వరకు కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేసుకోవచ్చు.

రూ. 5,000 దాటిన చెల్లింపులకు అదనపు ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది. అయితే తక్కువ మొత్తాలకు కూడా పిన్ ఎంటర్ చేయాలనుకునే వినియోగదారులు ఆ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

కార్డుల వినియోగంపై వినియోగదారులకు పూర్తి నియంత్రణ ఉండాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దేశీయ, అంతర్జాతీయ, ఆన్‌లైన్, కాంటాక్ట్‌లెస్ లావాదేవీలను ఆన్ లేదా ఆఫ్ చేసుకునే సదుపాయాన్ని బ్యాంకులు కల్పించాలి. కార్డు ఖర్చు పరిమితులను మార్చుకునే వీలు కూడా ఉండాలని, అవసరం లేని సమయంలో అంతర్జాతీయ లేదా ఆన్‌లైన్ చెల్లింపులను నిలిపివేసుకోవచ్చని పేర్కొంది.

దుకాణాల్లో నగదు విత్‌డ్రాయల్ నియమాలివే..

ఎంపిక చేసిన దుకాణాలు, మర్చంట్ అవుట్‌లెట్లలో నగదు తీసుకునేవారి కోసం కూడా ఆర్బీఐ నిబంధనలు ఖరారు చేసింది. ఒక లావాదేవీలో గరిష్ఠంగా రూ. 2,000 వరకు నగదు తీసుకోవచ్చు. నెలవారీ మొత్తం పరిమితి రూ. 10,000గా ఉంటుంది. ఇలా నగదు తీసుకున్నందుకు విధించే రుసుము విత్‌డ్రా చేసిన మొత్తంలో 1 శాతానికి మించకూడదు.

మొత్తంగా ఈ కొత్త నిబంధనలు ఏటీఎం, కార్డులకు సంబంధించిన పలు సూచనలను ఒకచోట చేర్చాయి. ఉచిత ఏటీఎం లావాదేవీల సంఖ్యను పెంచలేదు, రూ. 23 రుసుము పరిమితిని మార్చలేదు. ఏటీఎం ఛార్జీలపై స్పష్టమైన సమాచారం, కార్డు సెట్టింగ్‌లపై నియంత్రణ, కొన్ని విఫల లావాదేవీలపై రుసుముల నుంచి రక్షణ అనేవి వినియోగదారులకు కీలక ప్రయోజనాలుగా నిలుస్తాయి.

ABOUT THE AUTHOR

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.