Safest SUV in India : మూడు కొత్త ఎస్‌యూవీలు.. సేఫ్టీలో ఏది బెస్ట్? ఏది కొనాలి?
Renault Duster vs Tata Sierra : వాహన కొనుగోలుదారులు ఇప్పుడు కార్ల లుక్స్ కంటే సేఫ్టీ రేటింగ్స్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఎన్సీఏపీ నిర్వహించిన పరీక్షల్లో సియెర్రా, డస్టర్, సెల్టోస్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. మరి వీటిల్లో ఏది కొనాలి? ఇక్కడ తెలుసుకోండి..
SUVs with 5 star safety rating : భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు పోటీ కేవలం మైలేజీ, ఫీచర్ల మీద మాత్రమే లేదు.. 'భద్రత' చుట్టూ తిరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆటోమొబైల్ సంస్థలు సైతం తమ ప్రాడక్ట్స్తో హై సేఫ్టీ స్టాండర్డ్స్‌ని సెట్ చేస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన టాటా సియెర్రా, 2026 కియా సెల్టోస్, రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీలు ఇందుకు నిదర్శనం. 'భారత్ ఎన్సీఏపీ' క్రాష్ టెస్టుల్లో ఈ కార్లు 5-స్టార్ రేటింగ్‌ను కైవసం చేసుకున్నాయి. అయితే, మూడింటికి 5 స్టార్లే వచ్చినప్పటికీ.. లోతుగా పరిశీలిస్తే ప్రయాణికుల రక్షణలో ఒకదానికొకటి స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మరి సేఫ్టీ విషయంలో ఈ మూడు ఎస్‌యూవీల్లో ఏది బెస్ట్?

అడల్ట్ సేఫ్టీ: కియా సెల్టోస్ హవా
పెద్దల భద్రత విషయంలో 2026 కియా సెల్టోస్ తన సత్తా చాటింది. ఈ విభాగంలో మూడు కార్లు 5-స్టార్ రేటింగ్ పొందినప్పటికీ, స్కోర్ల పరంగా సెల్టోస్ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా 'ఫ్రంటల్ ఆఫ్‌సెట్' పరీక్షలో రెనాల్ట్ డస్టర్ కంటే సెల్టోస్ 1.21 పాయింట్లు అదనంగా సాధించింది.
డ్రైవర్ రక్షణ: డ్రైవర్ ఛాతి, కుడి కాలు భాగాలకు సెల్టోస్ 'గుడ్' రేటింగ్ సాధించగా, డస్టర్ ఇక్కడ 'అడిక్వేట్' (పర్వాలేదు) రేటింగ్‌తో సరిపెట్టుకుంది.
నిర్మాణ చతురత: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐసీఈ ఇంజిన్ వాహనాల్లో భారత్ ఎన్సీఏపీలో అత్యధిక ఫ్రంటల్ ఆఫ్‌సెట్ స్కోర్ సాధించిన కార్లలో సెల్టోస్ ఒకటిగా నిలిచింది.
టాటా సియెర్రా: జస్ట్‌లో మిస్.. అయినా అద్భుతం!
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ నుంచి వచ్చిన 'సియెర్రా' 31.14/32 స్కోరుతో సెల్టోస్‌కు గట్టి పోటీ ఇచ్చింది. తల, మెడ, తొడల భాగాలకు ఈ కారు అత్యుత్తమ రక్షణ కల్పిస్తోంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఛాతి భాగం వద్ద స్కోరు స్వల్పంగా తగ్గడంతో రెండో స్థానానికి పరిమితమైంది. ఇక రెనాల్ట్ డస్టర్ మూడో స్థానంలో నిలిచినప్పటికీ, కీలక ప్రాంతాల్లో ప్రయాణికులకు గట్టి భరోసానిస్తుందని పరీక్షలు తేల్చాయి.
పిల్లల భద్రత..
చిన్నారుల రక్షణ విషయంలో రెనాల్ట్ డస్టర్, కియా సెల్టోస్ చెరో 45/49 పాయింట్లతో సమ ఉజ్జీలుగా నిలిచాయి. 18 నెలల పసిబిడ్డ నుంచి మూడేళ్ల పిల్లల వరకు ఈ కార్లు సమానమైన రక్షణను అందిస్తున్నాయి. టాటా సియెర్రా 44.73 పాయింట్లతో స్వల్ప తేడాతో వెనుకపడినప్పటికీ, చైల్డ్ సీట్ ఇన్‌స్టాలేషన్‌లో 12/12 పర్ఫెక్ట్ స్కోరు సాధించడం విశేషం.
సేఫ్టీ ఫీచర్లు అండ్ టెక్నాలజీ..
ఫీచర్ల విషయానికి వస్తే మూడు కార్లలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీసీ, ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ), ISOFIX మౌంట్స్ వంటివి స్టాండర్డ్‌గా వస్తున్నాయి.
"కియా సెల్టోస్‌లో రేర్ వ్యూ కెమెరా, డౌన్‌హిల్ బ్రేక్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు ఉండగా, టాటా సియెర్రా తన హై-ఎండ్ వేరియంట్లలో లెవల్ 2 అడాస్, 360-డిగ్రీ కెమెరా వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో టెక్నాలజీ పరంగా పైచేయి సాధించింది," అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ మూడు ఎస్‌యూవీల్లో ఏది సేఫెస్ట్?
మీరు స్వచ్ఛమైన క్రాష్ టెస్ట్ స్కోర్లను బట్టి కారు కొనాలనుకుంటే కియా సెల్టోస్ బెస్ట్ ఛాయిస్. అలా కాకుండా అడ్వాన్స్‌డ్ అడాస్ ఫీచర్లు, గట్టి నిర్మాణం కావాలనుకుంటే టాటా సియెర్రా మేటి. బడ్జెట్‌లో పటిష్టమైన భద్రత కోరుకునే వారికి రెనాల్ట్ డస్టర్ మంచి ప్రత్యామ్నాయం.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. భారత్ NCAPలో ఏ SUVకి అత్యధిక స్కోరు వచ్చింది?
అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో కియా సెల్టోస్ అత్యధిక పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
2. ఈ మూడు కార్లలో ADAS ఫీచర్ దేనిలో ఉంది?
టాటా సియెర్రా హై-ఎండ్ వేరియంట్లలో లెవల్ 2 ADAS (Advanced Driver Assistance Systems) ఫీచర్‌ను అందిస్తోంది.
3. పిల్లల భద్రతలో ఏ కారు మెరుగైనది?
రెనాల్ట్ డస్టర్, కియా సెల్టోస్ రెండూ చైల్డ్ సేఫ్టీలో 45/49 స్కోరుతో సమానంగా టాప్ రేటింగ్ సాధించాయి.
4. ఈ కార్లన్నింటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయా?
అవును, రెనాల్ట్ డస్టర్, టాటా సియెర్రా, కియా సెల్టోస్ మూడింటిలోనూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్ ఫీచర్‌గా అందిస్తున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


