Renault India : ఇండియా కోసం రెనాల్ట్ బిగ్ ప్లాన్- 7 కొత్త కార్లు లాంచ్.. మారుతీ, హ్యుందాయ్‌కి చెక్!
Renault cars : రెనాల్ట్ ఇండియా రెండు కొత్త ప్లాట్‌ఫామ్‌ల ఆధారంగా 7 కొత్త కార్లను లాంచ్ చేయనుంది. ఇందులో భాగంగా తన పాపులర్ మోడల్స్ అయిన ట్రైబర్, కైగర్‌లను సరికొత్తగా అప్‌గ్రేడ్ చేయడంతో పాటు,ట్రైబర్‌లో 'అండర్ బాడీ సీఎన్జీ' వంటి వినూత్న ఫీచర్లను పరిచయం చేయనుంది. వివరాల్లోకి వెళితే..
Renault Duster 2026 : డస్టర్ ఎస్‌యూవీ లాంచ్‌తో మంచి జోరు మీదున్న రెనాల్ట్ సంస్థ.. భారత ఆటోమొబైల్ మార్కెట్లో తన ఉనికిని పెంచుకునేందుకు భారీ ప్రణాళికే రచించింది! 'ఫ్యూచర్ రెడీ ఇండియా' రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏకంగా ఏడు కొత్త కార్లను దేశీయ మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

ముఖ్యంగా రూ. 10 లక్షల లోపు బడ్జెట్ సెగ్మెంట్‌పై కన్నేసిన రెనాల్ట్, ఈసారి మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి అగ్రగామి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
కొత్త ప్లాట్‌ఫామ్స్.. సరికొత్త వ్యూహం!
రెనాల్ట్ తన భవిష్యత్తు కార్లను రెండు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై నిర్మిస్తోంది:
1. రెనాల్ట్ గ్రూప్ ఎంట్రీ ప్లాట్‌ఫామ్ (ఆర్జీఈపీ)
ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రధానంగా రూ. 10 లక్షల లోపు ధర ఉండే కార్ల కోసం కేటాయించారు. ప్రస్తుతం ఈ విభాగంలో రెనాల్ట్ వద్ద క్విడ్, ట్రైబర్, కైగర్ వంటి మోడల్స్ ఉన్నాయి.
అప్‌గ్రేడ్: క్విడ్ మినహా ట్రైబర్, కైగర్ మోడళ్లను ప్రస్తుతమున్న సీఎంఎఫ్-ఏ ప్లాట్‌ఫామ్ నుంచి అత్యాధునిక ఆర్జీఈపీ ప్లాట్‌ఫామ్‌కు మారుస్తారు.
టార్గెట్: దీనివల్ల కార్ల సామర్థ్యం పెరగడమే కాకుండా, వివిధ బాడీ స్టైల్స్‌ను ప్రవేశపెట్టడం సులభమవుతుంది.
2. రెనాల్ట్ గ్రూప్ మోడ్యులర్ ప్లాట్‌ఫామ్ (ఆర్జీఎంపీ)
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డస్టర్ ఎస్‌యూవీకి ఈ ప్లాట్‌ఫామే ఆధారం. ఇది కేవలం పెట్రోల్ ఇంజిన్‌కే పరిమితం కాకుండా ఆరు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను సపోర్ట్ చేస్తుంది.
ఆప్షన్లు: ఇందులో సీఎన్జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్, స్ట్రాంగ్ హైబ్రిడ్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ (బీఈవీ) వెర్షన్లు ఉండనున్నాయి.
డ్రైవ్ మోడ్స్: ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా వచ్చే కార్లు 2-వీల్ డ్రైవ్ (2డబ్ల్యూడీ) , 4-వీల్ డ్రైవ్ (4డబ్ల్యూడీ) ఆప్షన్లతో రానున్నాయి.
రెనాల్ట్ ట్రైబర్: అండర్ బాడీ సీఎన్జీతో సంచలనం!
రెనాల్ట్ ప్రకటించిన అప్‌డేట్స్‌లో అత్యంత ఆసక్తికరమైనది ట్రైబర్ సీఎన్జీ వెర్షన్. సాధారణంగా సీఎన్జీ కార్లలో సిలిండర్ కారణంగా బూట్ స్పేస్ (డిక్కీ స్థలం) మొత్తం తగ్గిపోతుంది. దీనికి పరిష్కారంగా రెనాల్ట్ ‘అండర్ బాడీ సీఎన్జీ’ టెక్నాలజీని తీసుకురానుంది.
లాభం: సిలిండర్‌ను కారు బాడీ కింద అమర్చడం వల్ల లోపల లగేజీ పెట్టుకునే స్థలం ఏమాత్రం తగ్గదు. రాబోయే రోజుల్లో రూ. 10 లక్షల లోపు వచ్చే మరిన్ని రెనాల్ట్ కార్లలో కూడా ఇదే టెక్నాలజీని ఆశించవచ్చు.
పోటీని తట్టుకునే దిశగా..
ప్రస్తుతం భారతీయ మధ్యతరగతి మార్కెట్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ ఆధిపత్యం ఎక్కువగా ఉంది. వారిని ఎదుర్కోవాలంటే కేవలం తక్కువ ధర ఉంటే సరిపోదు, ఆధునిక ఫీచర్లు కూడా ఉండాలి. అందుకే రెనాల్ట్ తన పాత ప్లాట్‌ఫామ్స్ మార్చి, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. రానున్న కొన్ని నెలల్లోనే ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్లు రోడ్లపైకి రానున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. రెనాల్ట్ లాంచ్ చేయబోయే 7 ఉత్పత్తులు ఏంటి?
ఇందులో ప్రధానంగా ప్రస్తుతమున్న ట్రైబర్, కైగర్‌ల కొత్త వెర్షన్లు, సరికొత్త డస్టర్ ఎస్‌యూవీ, కొన్ని ఎలక్ట్రిక్ మోడల్స్ ఉండే అవకాశం ఉంది.
2. అండర్ బాడీ సీఎన్జీ అంటే ఏంటి?
సాధారణంగా సీఎన్జీ ట్యాంకులు కారు డిక్కీలో ఉంటాయి. కానీ రెనాల్ట్ తీసుకురానున్న కొత్త విధానంలో ట్యాంకును కారు కింది భాగంలో అమరుస్తారు, తద్వారా కారు లోపల సామాను పెట్టుకోవడానికి పూర్తి స్థలం అందుబాటులో ఉంటుంది.
3. రెనాల్ట్ కొత్త ప్లాట్‌ఫామ్ వల్ల ధరలు పెరుగుతాయా?
కొత్త టెక్నాలజీ వల్ల ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు, కానీ కంపెనీ ప్రధానంగా రూ. 10 లక్షల లోపు బడ్జెట్ వినియోగదారులనే టార్గెట్ చేస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


