Renault Kwid facelift : కొత్త రూపంలో రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్.. అదిరిపోయే ఫీచర్లు, పెద్ద స్క్రీన్!
గ్లోబల్ మార్కెట్‌లో రెనాల్ట్ క్విడ్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ అవతారంలో మెరిసింది. అప్‌డేటెడ్ డిజైన్, 10.1 ఇంచీల భారీ టచ్‌స్క్రీన్, 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లతో వచ్చిన ఈ హ్యాచ్‌బ్యాక్ త్వరలోనే భారత రోడ్లపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు..
ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రెనాల్ట్ క్విడ్ సరికొత్త రూపంలో వాహన ప్రియులను పలకరించింది! బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో జరిగిన 'ఫెస్టివల్ ఇంటర్లాగోస్' వేదికగా 2027 క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను కంపెనీ అధికారికంగా ఆవిష్కరించింది. కేవలం ఎక్స్‌టీరియర్ మార్పులకే పరిమితం కాకుండా, కారు లోపల కేబిన్‌ను లగ్జరీ కార్లకు సమానంగా రీ-డిజైన్ చేయడం ఈ కొత్త వెర్షన్ ప్రత్యేకత.

రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- అదిరిపోయే డిజైన్.. కొత్త లోగో!
కొత్త రెనాల్ట్ క్విడ్ ముందు భాగంలో భారీ మార్పులు చేశారు. గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌తో కూడిన రీ-డిజైన్డ్ ఫ్రంట్ గ్రిల్, దానికి సరికొత్త రెనాల్ట్ లోగోను అమర్చారు. సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, స్పోర్టీగా కనిపిచే ఫ్రంట్ బంపర్, కొత్త సైడ్ గ్రాఫిక్స్ కారుకు సరికొత్త రూపాన్నిచ్చాయి. వెనుక వైపు డార్క్ టెయిల్ ల్యాంప్ డిజైన్, సాంప్రదాయ యాంటెన్నా స్థానంలో షార్క్-ఫిన్ యాంటెన్నాను చేర్చారు. టాప్ వేరియంట్ అయిన 'అవుట్‌సైడర్'లో 14 అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ను అందించారు.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- కేబిన్‌లో సరికొత్త విప్లవం!
ఈ రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో ప్రధాన ఆకర్షణ దీని ఇంటీరియర్ అనే చెప్పాలి. బ్రెజిల్ వర్షన్‌లోని అన్ని వేరియంట్లలో 7 ఇంచీల టీఎఫ్‌టీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ప్రామాణికంగా చేర్చారు. స్టీరింగ్ వీల్, సీట్ అప్‌హోల్‌స్టరీ, సెంటర్ కన్సోల్‌ను పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు.
హై-ఎండ్ వేరియంట్లలో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 10.1 ఇంచీల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించారు. దీనితో పాటు రెండు యూఎస్బీ-సీ ఛార్జింగ్ పోర్టులు, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ మిర్రర్ అడ్జస్ట్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లను చేర్చారు.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- భద్రతలో కాంప్రమైజ్ లేదు
చిన్న కారైనా భద్రత విషయంలో రెనాల్ట్ పెద్ద పీట వేసింది. ఈ కొత్త క్విడ్‌లో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ), హిల్-స్టార్ట్ అసిస్ట్ (హెచ్ఎస్ఏ), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లను ప్రామాణికంగా అందించడం విశేషం.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- ఇంజిన్ సామర్థ్యం ఎలా ఉందంటే..
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇందులో 1.0-లీటర్, 3-సిలిండర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పనిచేస్తుంది. పెట్రోల్‌పై 68 హెచ్‌పీ పవర్, 92 ఎన్ఎమ్ టార్క్‌ను, ఎథనాల్‌పై 71 హెచ్‌పీ పవర్, 98 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని 13.5 సెకన్లలో అందుకోగలదు.
రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్- భారత్‌కు ఎప్పుడు వస్తుంది?
బ్రెజిల్‌లో ఈ కారును ఎవల్యూషన్, టెక్నో, అవుట్‌సైడర్ అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. అక్కడ ప్రారంభ పరిచయ ధర 71,090 బ్రెజీలియన్ రియల్ (మన భారత కరెన్సీలో సుమారు రూ. 13.09 లక్షలు)గా ఉంది. అయితే బ్రెజిల్‌లోని స్థానిక పన్నుల విధానం వల్ల అక్కడ కార్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.
మన భారతదేశంలో క్విడ్ ఎప్పుడూ అత్యంత చౌకైన బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలోనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మారుతీ ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో వంటి మోడళ్లకు పోటీగా ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షన్‌ను రెనాల్ట్ ఇండియా త్వరలోనే మన దేశంలోకి తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారత్‌లో ఈ అప్‌డేటెడ్ కారును ప్రవేశపెడితే రూ. 4.50 లక్షల నుంచి రూ. 6.50 లక్షల శ్రేణిలో లభించే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


