...
...
Next Story

Retirement planning : రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీకి ఎంత డబ్బులు కేటాయించాలి?

పదవీ విరమణ తర్వాత షేర్ మార్కెట్ లేదా ఈక్విటీ ఫండ్లలో ఎంత శాతం పెట్టుబడి ఉంచాలనేది ప్రతి పెన్షనర్‌కు ఒక పెద్ద సందేహం, ఆందోళనకర విషయం! ఈ నేపథ్యంలోనే ఈక్విటీ కేటాయింపులు ఎంత ఉండాలో ఫ్రీఫిన్‌కాల్ వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం పట్టాభిరామన్ వివరించిన కీలక సూత్రాలు మీకోసం..

Published on: Oct 22, 2026, 10:00:17 IST
Advertisement

ఉద్యోగ విరమణ చేయగానే పెట్టుబడుల నిర్వహణ విధానం పూర్తిగా మారిపోతుంది. ఉద్యోగంలో ఉన్నంతకాలం సంపదను పెంచుకోవడం ప్రధాన లక్ష్యం కాగా, రిటైర్మెంట్ తర్వాత మాత్రం సమకూరిన కార్పస్‌ను కాపాడుకోవడం, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవడం అత్యంత కీలకంగా మారుతుంది.

రిటైర్మెంట్ ప్లానింగ్ టిప్స్ తెలుగులో..
రిటైర్మెంట్ ప్లానింగ్ టిప్స్ తెలుగులో..

60 ఏళ్ల వయస్సులో రిటైర్ అయ్యే వ్యక్తి మరో 20 నుంచి 30 ఏళ్ల పాటు జీవించే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి సుదీర్ఘ కాలంలో మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుంటూ, రోజువారీ ఖర్చులను నెట్టుకురావడానికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు లేదా స్టాక్స్‌లో ఎంత శాతాన్ని కొనసాగించాలి? పర్సనల్ ఫైనాన్స్ ప్లాట్‌ఫామ్ 'ఫ్రీఫిన్‌కాల్' (Freefincal) వ్యవస్థాపకుడు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం పట్టాభిరామన్ దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించారు.

ఈక్విటీ కేటాయింపులు 30 శాతానికే పరిమితం!

ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలామంది తమ పోర్ట్‌ఫోలియోలో 50 నుంచి 70 శాతం వరకు ఈక్విటీల్లో ఉంచుతారు. కానీ క్రమం తప్పకుండా పింఛను లేదా నెలానెలా ఉపసంహరణలు ప్రారంభమైన తర్వాత ఈ వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.

"సాధారణంగా రిటైర్ అయిన వ్యక్తి తన మొత్తం పొదుపులో ఈక్విటీ వాటాను 30 శాతానికి మించకుండా చూసుకోవడమే ఉత్తమం," అని ప్రొఫెసర్ పట్టాభిరామన్ పేర్కొన్నారు.

పెట్టుబడిదారుడి వద్ద ఉన్న కార్పస్ పరిమాణం ఆధారంగా ఈ శాతంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఉదాహరణకు, ఏడాదికి రూ.6 లక్షల ఖర్చులు ఉన్న ఇద్దరు వ్యక్తులను పరిశీలిద్దాం. ఒకరి వద్ద రూ.1.8 కోట్లు (ఏడాది ఖర్చులకు 30 రెట్లు) కార్పస్ ఉండగా, మరొకరి వద్ద రూ.4.5 కోట్లు (ఏడాది ఖర్చులకు 75 రెట్లు) ఉంది. ఇక్కడ రెండో వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో పొదుపు ఉంది కాబట్టి, మార్కెట్ నష్టాలను తట్టుకునే సామర్థ్యం ఆయనకు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటివారు మాత్రమే ఈక్విటీల్లో కాస్త ఎక్కువ రిస్క్ తీసుకోగలరు.

ద్రవ్యోల్బణం, 'సీక్వెన్స్ ఆఫ్ రిటర్న్స్' ముప్పు!

రిటైర్మెంట్ ఫండ్​పై ద్రవ్యోల్బణాన్ని మించి భారీ లాభాలు వస్తాయని ఆశించడం సరికాదు. పన్నులు పోను వాస్తవిక రాబడి సున్నా శాతంగా గానీ, లేదా మైనస్ 1 నుంచి 2 శాతంగా గానీ అంచనా వేసుకుని ప్రణాళిక రచించుకోవాలి! ఉదాహరణకు సగటు ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే, పెట్టుబడి రాబడి కూడా 6 శాతమే వస్తే ఆ నిధులు పెరుగుతున్న జీవన వ్యయాలను మాత్రమే భరించగలవు.

రిటైర్మెంట్ వయసు

ఈక్విటీ ఎలాకేషన్

60 ఏళ్లు20%
55 ఏళ్లు22%
50 ఏళ్లు30%
45 ఏళ్లు32%
40 ఏళ్లు34%
35 ఏళ్లు36%
30 ఏళ్లు37%
సోర్సు: Freefincal. ( ప్రస్తుత వయసు 26ఏళ్లగా పరిగణించారు. )
View All

15 ఏళ్ల స్థిర రాబడి బఫర్.. 'బకెట్ స్ట్రాటజీ'

పదవీ విరమణ నిధికి రక్షణ కల్పించేందుకు మరో కీలక సూత్రం.. తొలి 15 ఏళ్ల ఖర్చులకు సరిపడా నిధులను స్థిర రాబడినిచ్చే పథకాల్లో కేటాయించడం. దీనివల్ల ‘బకెట్ స్ట్రాటజీ’ అమలు చేయడం సులభమవుతుంది.

ఈ పద్ధతిలో రోజువారీ ఖర్చులకు అవసరమైన డబ్బును భద్రమైన డెట్ ఫండ్లు, ఫిక్స్​డ్​ డిపాజిట్లలో ఉంచి, దీర్ఘకాలిక వృద్ధి కోసం కేటాయించిన 20-30 శాతం ఈక్విటీ భాగంలో కొన్ని ఏళ్ల పాటు ఎటువంటి మార్పులు చేయకుండా వదిలేయవచ్చు. మార్కెట్లు పతనమైన సమయంలో స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లను విక్రయించాల్సిన అవసరం రాదు. వీటితో పాటు స్థిరమైన పెన్షన్ ఇచ్చే యాన్యుటీ పథకాలను కూడా జోడించుకుంటే రిటైర్మెంట్ జీవితం మరింత భరోసాగా ఉంటుంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా రిటైర్మెంట్​ ప్లానింగ్ చేసుకునేందుకు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks