Royal Enfield Classic 650 Anniversary Edition : లైట్‌ని బట్టి కలర్ మారే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్!
రాయల్ ఎన్ఫీల్డ్ తన 125ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పురస్కరించుకుని క్లాసిక్ 650 ‘హైపర్‌షిఫ్ట్’ 125వ వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్‌ను రూ. 4,25,589 ప్రారంభ ధరతో ఆవిష్కరించింది. కాంతిని బట్టి రంగులు మారే ఈ బైక్ విశేషాలు, బుకింగ్ వివరాలు ఇక్కడ చూడండి..
భారతీయ ప్రీమియం మోటార్‌సైకిల్ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్.. ద్విచక్ర వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకునేలా ఒక అరుదైన బైక్‌ని విపణిలోకి తెచ్చింది. కంపెనీ స్థాపించి 125 ఏళ్లు పూర్తయిన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని 'క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ యానివర్సరీ ఎడిషన్' (Classic 650 125th Anniversary Edition)ను అధికారికంగా ఆవిష్కరించింది. భారత మార్కెట్లో ఈ లిమిటెడ్ ఎడిషన్ బైక్ ప్రారంభ ధరను రూ. 4,25,589 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన రీజియన్లలో కేవలం 125 యూనిట్లను మాత్రమే విక్రయించనుండటంతో బైక్ లవర్స్, కలెక్టర్లకు ఇది ఒక అరుదైన కలెక్షన్ మోడల్‌గా నిలవనుంది.

కాంతిని బట్టి రంగులు మారే 'హైపర్‌షిఫ్ట్' మ్యాజిక్!
ఈ యానివర్సరీ ఎడిషన్‌లోని ప్రధాన ఆకర్షణ దీని ప్రత్యేకమైన ‘హైపర్‌షిఫ్ట్’ పెయింట్ ఫినిషింగ్. బైక్‌పై పడే వెలుగు ఆధారంగా ఇది ఎరుపు, ఆకుపచ్చ, బంగారు (గోల్డ్) ఛాయల్లోకి మారుతూ కంటికి పండుగలా కనిపిస్తుంది! 1901లో తయారైన రాయల్ ఎన్ఫీల్డ్ తొలి మోటార్‌సైకిళ్ల స్పూర్తితో దీని బ్రాస్ బేస్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెళ్లు, మడ్‌గార్డ్స్, హెడ్‌ల్యాంప్ చుట్టూ ఉన్న భాగాలపై బంగారు వర్ణపు మెరుపులతో నిండిన డీప్ షేడ్స్ అదనపు మెరుగులు దిద్దాయి. ఇంజిన్, ఎగ్జాస్ట్ పైపులకు బ్లాక్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల లుక్ మరింత అగ్రెసివ్‌గా మారింది.
హ్యాండ్ పెయింటెడ్ పిన్స్ట్రైప్స్, వింటేజ్ లుక్..
సాధారణ క్లాసిక్ 650 మోడల్ కంటే దీనిని భిన్నంగా చూపేందుకు పలు ప్రత్యేకాంశాలను జోడించారు:
ఫ్యూయల్ ట్యాంక్ మధ్య భాగంలోని నలుపు రంగు సరిహద్దుపై చేతితో వేసిన హ్యాండ్ పెయింటెడ్ పిన్స్ట్రైప్లు మెరుస్తాయి.
ట్యాంక్ పైన వింటేజ్ కానన్ (ఫిరంగి) బొమ్మతో కూడిన ప్రత్యేక డెకాల్‌ను పొందుపరిచారు.
సైడ్ ప్యానెల్‌పై 125 ఏళ్ల ఘన చరిత్రకు ప్రతీకగా బంగారు రంగులో మెరిసే యానివర్సరీ క్రెస్ట్ క్రేజీ లుక్‌ను ఇస్తుంది.
డ్యూయల్ టోన్ ఇంటీరియర్‌లో క్విల్టెడ్ స్టిచింగ్‌తో కూడిన వింటేజ్ బ్రౌన్ కలర్ లెదర్ సీటును అందించారు.
ఇక ఫీచర్ల పరంగా ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్, క్రోమ్ ఫినిషింగ్‌తో రౌండ్ మిర్రర్స్, వైర్-స్పోక్ వీల్స్ ఇచ్చారు. ఇండికేటర్లు మాత్రం సంప్రదాయ బల్బులతోనే వస్తున్నాయి.
శక్తివంతమైన 650 సీసీ ట్విన్ ఇంజిన్..
సాంకేతికపరంగా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ యానివర్సరీ ఎడిషన్ ఎలాంటి మార్పులు చేయలేదు. ఇప్పటికే ఆదరణ పొందిన 647.95 సీసీ ఫ్యూయల్ ఇంపెక్టెడ్, ఎస్ఓహెచ్సీ ప్యారలల్ ట్విన్-సిలిండర్ ఇంజిన్నే ఇందులో కొనసాగించారు. ఇది 7,250 ఆర్పీఎం వద్ద 47 పీఎస్ పవర్, 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్, వెట్ మల్టీ-ప్లేట్ క్లచ్ అనుసంధానించారు.
సురక్షితమైన రైడింగ్ కోసం ముందు చక్రానికి 320 ఎంఎం, వెనుక చక్రానికి 300 ఎంఎం డిస్క్ బ్రేకులను డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ సాంకేతికతతో అందించారు. ముందు భాగంలో 19 ఇంచుల చక్రం (100/90 టైర్), వెనుక భాగంలో 18 ఇంచుల చక్రం (140/70 టైర్) అమర్చారు. ఈ బైక్ సీటు ఎత్తు 800 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 154 ఎంఎం, వీల్‌బేస్ 1,475 ఎంఎంగా ఉంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.7 లీటర్లు కాగా, వాహనం మొత్తం బరువు 243 కేజీలుగా నమోదైంది.
క్లాసిక్ 650 హైపర్‌షిఫ్ట్ 125వ యానివర్సరీ ఎడిషన్- బుకింగ్స్, డెలివరీ..
ఈ అరుదైన మోటార్‌సైకిల్ సొంతం చేసుకోవాలనుకునే వారు అక్టోబర్ 16 మధ్యాహ్నం 2 గంటల నుంచి కంపెనీ అధికారిక పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని రాయల్ ఎన్ఫీల్డ్ తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అక్టోబర్ 28న అమ్మకాలు జరిగే రోజు వరకు అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన విజేతలకు నవంబర్ 2026 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. బేస్ మోడల్‌తో పోలిస్తే రూ. 58,000 వరకు అదనపు ధరకు లభిస్తున్న ఈ స్పెషల్ ఎడిషన్ బైక్.. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులకు గొప్ప బహుమతి అని చెప్పవచ్చు!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


