...
...
Next Story

Royal Enfield Himalayan 750 : రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750.. ది బెస్ట్ అడ్వెంచర్ టూరర్ బైక్?

రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ తన అత్యంత శక్తివంతమైన 'హిమాలయన్ 750' బైక్ మొదటి అఫీషియల్ టీజర్‌ను ఇటీవలే విడుదల చేసింది. నవంబర్‌లో ఇటలీలోని మిలాన్‌లో జరగనున్న ఈఐసీఎంఏ మోటార్ షోలో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించబోతున్న ఈ భారీ అడ్వెంచర్ టూరర్ విశేషాలు ఇవే..

Published on: Oct 30, 2026, 06:00:05 IST
Advertisement

భారతీయ మోటార్ సైకిల్ రంగంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లాంగ్ రైడ్లు, కొండ మార్గాలు, లద్ధాఖ్ ట్రిప్పులు వేసే రైడర్లకు మొదటి ప్రాధాన్యతగా నిలిచేది రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్. కాగా, ఈ ప్రసిద్ధ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన, భారీ మోడల్ ‘హిమాలయన్ 750’ను తీసుకురావడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ సన్నాహాలు పూర్తి చేసింది. తాజాగా ఈ బైక్‌కు సంబంధించిన మొదటి అధికారిక టీజర్‌ను కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఇటీవలే విడుదల చేసి బైక్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపింది.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750
రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750

ఈ టీజర్‌లో సిల్హౌట్ కనిపిస్తున్న అడ్వెంచర్ బైక్‌తో పాటు కొన్ని భౌగోళిక కార్డినేషన్స్ ఇచ్చారు. అవి ఇటలీలోని మిలాన్ నగరాన్ని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి ఈ నవంబర్ మొదటి వారంలో జరిగే ప్రతిష్టాత్మక 'మిలాన్ ఈఐసీఎంఏ 2026' ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్ గ్లోబల్ ప్రీమియర్ కాబోతోందని స్పష్టమవుతోంది. ఆ వెంటనే గోవాలో జరిగే 'మోటోవర్స్' ఈవెంట్‌లో లేదా 2027 ప్రారంభంలో భారత మార్కెట్లో దీని విక్రయాలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- డిజైన్, కలర్ ఆప్షన్లు..

గత కొన్ని నెలలుగా రహస్యంగా రోడ్లపై రోడ్డు టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెచర్ బైక్ చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఐకానిక్ హిమాలయన్ శైలిలోనే రౌండ్ ఆకారంలో ఉండే హెడ్‌లాంప్‌లు, ఎత్తైన విండ్‌స్క్రీన్, భారీ ఇంధన ట్యాంక్ బకెట్ డిజైన్‌ను ఇది కలిగి ఉంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో యాడ్ షూటింగ్ సందర్భంగా కనిపించిన ఈ బైక్.. మెరూన్-ఎల్లో, వైట్ విత్ రెడ్-ఎల్లో గ్రాఫిక్స్, సాలిడ్ మెటాలిక్ గ్రే రంగుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. లాంగ్ డిస్టెన్స్ రైడింగ్ కోసం ప్రత్యేక ఆక్ససరీస్‌ను కూడా అమర్చుకోవచ్చు.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- సెగ్మెంట్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ ఫీచర్లు..

క్రూయిజ్ కంట్రోల్ : రైట్-సైడ్ స్విచ్ గేర్‌పై ప్రత్యేక 'CRUISE' బటన్, 'RES/+' టాగుల్ కనిపించడం వల్ల ఇందులో 'రైడ్-బై-వైర్' థ్రాటిల్, క్రూయిజ్ కంట్రోల్ రావడం ఖాయమైంది.

రైడింగ్ మోడ్‌లు : హిమాలయన్ 450 తరహాలోనే 'M' బటన్ ద్వారా వివిధ రైడింగ్ మోడ్‌లు మార్చుకోవడమే కాకుండా, ఏబీఎస్ స్థాయిని, ట్రాక్షన్ కంట్రోల్‌ను నిరోధించే వెసులుబాటు లభించనుంది.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- సస్పెన్షన్, బ్రేకింగ్..

లాంగ్ రన్ రైడింగ్ అనుభవాన్ని అత్యంత సుఖవంతంగా మార్చడానికి ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750 అడ్వెంచర్ బైక్‌లో షోవా అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక భాగంలో మల్టీ-అడ్జెస్టెబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అందించారు.

వీల్స్ అండ్ టైర్లు: ఇప్పటివరకు వచ్చిన హిమాలయన్ మోడళ్లలో 21-అంగుళాల ఫ్రంట్ వీల్ ఉండేది. కానీ ఈ 750సీసీ వెర్షన్‌లో ముందు భాగంలో 19-అంగుళాలు, వెనుక 17-అంగుళాల అల్లాయ్ లేదా క్రాస్-స్పోక్ వీల్స్ రానున్నాయి. వీటిలో వ్రెడెస్టెన్ సెంటౌరో ఎక్సార్ ట్యూబ్‌లెస్ రోడ్ రేడియల్ టైర్లతో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్) ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

బ్రేకింగ్: బైబ్రే కాలిపర్లతో కూడిన డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లు, వెనుక సింగిల్ డిస్క్ బ్రేక్ బ్రేకింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తాయి.

రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750- ఇంజిన్..

ఈ రాయల్ ఎన్​ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్ ముందు భాగంలో రేడియేటర్ వెనుక మెష్ గార్డ్ ఉండటం వల్ల ఇది లిక్విడ్-కూల్డ్ టెక్నాలజీతో వస్తుందని స్పష్టమవుతోంది. హిమాలయన్ 450లోని సింగిల్ సిలిండర్ ఇంజిన్ కంటే భిన్నంగా, ఇందులో పారలెల్ ట్విన్ సిలిండర్ల భారీ ఇంజిన్‌ను అమర్చనున్నారు! ఇది సుమారు 50-55 బీహెచ్​పీ పవర్, 60-65 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. 6-స్పీడ్ గేర్‌బాక్స్ సహకారంతో ఎంతటి గనులనైనా, మంచు కొండలనైనా, అనంతమైన నేషనల్ హైవేలలనైనా సులువుగా దాటగలిగే సామర్థ్యం ఈ బైక్‌కు దక్కనుంది.

ఈ మోడల్​ ధర, ఫీచర్లు సహా ఇతర వివరాలు రానున్న రోజుల్లో అందుబాటులోకి వస్తాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks