...
...
Next Story

అమెరికాలో భారత విద్యార్థి మృతి- అదృశ్యమైన 6 రోజులకు కనిపించిన మృతదేహం!

అమెరికాలో విషాద ఘటన! బర్కిలీ యూనివర్సిటీలో పీజీ చదువుతున్న భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య (22) గత కొన్ని రోజులుగా అదృశ్యమయ్యారు. కాగా, ఆయన మృతదేహాన్ని స్థానిక పోలీసులు గుర్తించినట్లు శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది.

Published on: Feb 15, 2026, 06:49:38 IST
Advertisement

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన మరో భారతీయ విద్యార్థి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది! కాలిఫోర్నియాలోని ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, బర్కిలీలో పీజీ చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య (22) మరణించినట్లు భారత రాయబార కార్యాలయం ఆదివారం ఉదయం ధృవీకరించింది. గత కొద్దిరోజులుగా సాకేత్ ఆచూకీ కోసం గాలిస్తున్న స్థానిక పోలీసులు, చివరకు ఆయన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సాకేత్ శ్రీనివాసయ్య ఫొటో (LinkedIn)
సాకేత్ శ్రీనివాసయ్య ఫొటో (LinkedIn)

ఈ విషాద వార్తను శాన్​ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది.

"అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతదేహం లభ్యమైనట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ అత్యంత కఠినమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము," అని కాన్సులేట్ పేర్కొంది. సాకేత్ భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా భారతదేశానికి పంపేందుకు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని, బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు.

అసలేం జరిగింది?

కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి. బర్కిలీకి వెళ్లకముందు ఆయన చెన్నైలోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. "సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ వంటి డీప్-టెక్ ఆవిష్కరణలపై నాకు ఎంతో ఆసక్తి ఉంది," అని ఆయన తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో రాసుకున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు అతి చిన్న వయస్సులోనే మృతిచెందడం ఆయన కుటుంబ సభ్యులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

సాకేత్ ఎలా మరణించారు? ఆయన అదృశ్యానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks