Stock market : స్టాక్ మార్కెట్ క్రాష్- రెండు రోజుల్లో సూచీలు భారీగా డౌన్- కారణం ఏంటి?
సోమవారం నష్టాలను చూసిన భారత్ స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా పనతమవుతోంది! ఉదయం ట్రేడింగ్ సెషన్‌లో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 1శాతం డౌన్ అయ్యింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి?
మదుపర్లను భయపెట్టే విధంగా దేశీయ స్టాక్ మార్కెట్‌లో పతనం కొనసాగుతోంది! సోమవారం డౌన్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు.. మంగళవారం కూడా నష్టాలనే చూస్తున్నాయి. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,300 పాయింట్లకు పైగా (1.5% కన్నా ఎక్కువ) నష్టపోయింది. నిఫ్టీ50 దాదాపు 2% నష్టపోయింది. మరి ఈ పతనానికి కారణాలేంటి? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

స్టాక్ మార్కెట్ టుడే..
మార్కెట్ ఓపెన్ అయిన అనంతరం సెన్సెక్స్ 700 పాయింట్లకుపైగా పడి ఇంట్రాడే కనిష్ట స్థాయి 84,382.96 ని తాకింది. నిఫ్టీ 50 కూడా 1% పడిపోయి, ఇంట్రాడే కనిష్ట స్థాయి 25,729.35 ను హిట్ చేసింది.
బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు రెండూ ఈ సెషన్‌లో 1.5% చొప్పున పతనమై, తీవ్ర అమ్మకాల ఒత్తిడిని కొనసాగించాయి.
మంగళవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయానికి సెన్సెక్స్ 447 పాయింట్లు పడి 84.656 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ50 144 పాయింట్లు పడి 25,818 వద్ద ట్రేడ్ అవుతోంది.
సెన్సెక్స్ 30లో టైటాన్, ఎటర్నల్, బీఈఎల్, ఎస్బీఐ, ఎయిర్టెల్, ఐటీసీ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి.
భారత స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోతోంది?
1. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి!
భారత్- అమెరికా మధ్య వాణిజ్య చర్చలు చాలా నెలలుగా కొనసాగుతున్నాయి. కానీ తుది ఫలితం మాత్రం ఇంకా వెలువడలేదు. వాణిజ్య చర్చలను కొనసాగించడానికి అమెరికన్ ప్రతినిధి బృందం ఈ వారం భారత్‌కు రానుంది. అయితే క్రిస్మస్ సెలవుల కారణంగా డిసెంబర్‌లో ఒప్పందం ఖరారు కాకపోవచ్చనే ఆందోళనలు మార్కెట్‌లో నెలకొన్నాయి.
ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ పంకజ్ పాండే మింట్‌తో మాట్లాడుతూ, "ఈ వారం వాణిజ్య చర్చలు జరుగుతాయి, కానీ అమెరికాలో సెలవులు ఉన్నందున డిసెంబర్‌లో లేదా జనవరి మొదటి వారంలో డీల్ కుదిరే అవకాశం కనిపించడం లేదు. కాబట్టి, రాబోయే 20-25 రోజుల్లో మార్కెట్‌కు దిశానిర్దేశం చేసే ముఖ్యమైన సంఘటన ఏదీ లేదు," అని తెలిపారు.
2. రూపాయి బలహీనత..
అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ బలహీనపడటం పెట్టుబడిదారులకు ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది. మంగళవారం ప్రారంభ ట్రేడ్‌లో కార్పొరేట్లు, దిగుమతిదారులు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడం వల్ల దేశీయ కరెన్సీ 10 పైసలు తగ్గి 90.15 వద్దకు చేరుకుంది. సోమవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 90.05 వద్ద స్థిరపడింది.
"రూపాయి కదలిక ఎక్కువగా ఆర్బీఐ ప్రభావంతో ఉంది. సుంకాల ప్రభావాన్ని తగ్గించడానికి ఆర్బీఐ కొంత డిప్రీసియేషన్కి అనుమతిస్తున్నట్లయితే, కరెన్సీ వెంటనే స్థిరపడుతుందని ఆశించడానికి పెద్దగా కారణం లేదు! ఈ పరిస్థితుల్లో మరింత బలహీనతను తోసిపుచ్చలేము," అని పంకజ్ పాండే అభిప్రాయపడ్డారు.
3. కొత్త దిశానిర్దేశిత ట్రిగ్గర్ల కొరత..
మార్కెట్‌లో కొత్త దిశానిర్దేశిత ట్రిగ్గర్లు (సానుకూల అంశాలు) లేకపోవడం వల్ల రిటైల్ పెట్టుబడిదారుల్లో ఒక రకమైన నెగిటివిటీ కనిపిస్తోందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. మధ్యకాలంలో ఆరోగ్యకరమైన వృద్ధి-ద్రవ్యోల్బణ డైనమిక్స్ ప్రధాన సానుకూలతగా ఉన్నప్పటికీ, మార్కెట్ లాభాలను కొనసాగించడానికి కొత్త ట్రిగ్గర్ల కోసం చూస్తోంది. డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన విధంగా రావడం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు అయ్యే వరకు దేశీయ మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు నమ్ముతున్నారు.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ ఈ విషయంపై మాట్లాడుతూ.. "ఇటీవలి గరిష్ట స్థాయిని మార్కెట్ నిలబెట్టుకోలేకపోవడం, ర్యాలీకి కొత్త ట్రిగ్గర్లు లేకపోవడం వల్ల పెట్టుబడిదారులలో కొంత నిరాశ ఏర్పడింది. కొద్దిపాటి లార్జ్-క్యాప్‌ల ఆధిపత్యంతో నడిచిన ఈ ర్యాలీలో మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లు పాల్గొనకపోవడం, రిటైల్ విభాగంలో అసంతృప్తిని పెంచింది" అని పేర్కొన్నారు.
"నిఫ్టీ కొత్త రికార్డును నెలకొల్పినప్పటికీ, ఎన్‌ఎస్‌ఈ 500లోని 320 స్టాక్‌లు తమ గరిష్ట స్థాయి కంటే తక్కువ ధరలోనే ట్రేడవుతున్నాయి. దీని కారణంగా మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్‌లు ప్రధానంగా ఉన్న రిటైల్ పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలు నష్టాలను చూశాయి. తత్ఫలితంగా, మిడ్, స్మాల్-క్యాప్‌లలో మరింత అమ్మకాలు జరిగి, వాటి ధరలు పడిపోతున్నాయి. అయితే, ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన బలమైన లార్జ్-క్యాప్‌లు మాత్రం స్థిరంగా ఉన్నాయి," అని విజయకుమార్ వివరించారు.
4. యూఎస్ ఫెడ్ పాలసీ ముందు జాగ్రత్త..
బుధవారం రాబోయే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయానికి ముందు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నప్పటికీ, ఫెడ్ ‘హాకిష్’గా వ్యవహరిస్తే అది మార్కెట్ సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు భావిస్తున్నారు.
5. అమెరికా, జపాన్ బాండ్ ఈల్డ్స్‌లో పెరుగుదల..
అమెరికా, జపాన్‌లో బాండ్ ఈల్డ్స్ పెరుగుదల కూడా ప్రపంచ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తోంది.
అమెరికన్ 10-సంవత్సరాల ట్రెజరీ ఈల్డ్ నేడు 4.18% వద్ద రెండు వారాల గరిష్ట స్థాయికి పెరిగింది. జపాన్ ప్రభుత్వ బాండ్లు మంగళవారం దాదాపు 17 సంవత్సరాల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉన్నాయి.
జపాన్‌లో పెరుగుతున్న ఈల్డ్స్ కారణంగా, యెన్ క్యారీ ట్రేడ్ సాధ్యాసాధ్యాలు దెబ్బతినవచ్చు. ఇది భారత్ వంటి ఎమర్జింగ్ మార్కెట్లకు తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే, దీనివల్ల ఈ మార్కెట్ల నుంచి విదేశీ మూలధనం మరింత వేగంగా తరలిపోయే అవకాశం ఉంది.
(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు, సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


