...
...
Next Story

Personal Finance : మీ పెళ్లి ఖర్చులకు పర్సనల్​ లోన్ తీసుకోవాలా? లేక సేవింగ్స్ వాడుకోవాలా?

వివాహం ఒక జీవితకాల మధుర జ్ఞాపకం. అయితే పెళ్లి సందడి ముగిసాక పర్సనల్ లోన్ ఈఎంఐల భారం మిగలకుండా ఉండాలంటే ముందస్తు ఆర్థిక ప్రణాళిక తప్పనిసరి. పెళ్లి ఖర్చులకు పొదుపు వాడాలా లేక రుణం తీసుకోవాలా అనే దానిపై ఆర్థిక నిపుణుల ప్రత్యేక విశ్లేషణను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 19, 2026, 08:15:14 IST
Advertisement

తెలుగు ఇళ్లల్లో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. హోదాకు, బంధుత్వాలకు ముడిపడి ఉన్న ఒక పెద్ద పండుగ! వివాహ వేడుకను ఘనంగా నిర్వహించడం అనాదిగా మన సాంప్రదాయంలో భాగమైపోయింది. అయితే, పెళ్లి నాటి ముచ్చట తీరిపోయాక, ఏళ్ల తరబడి పర్సనల్ లోన్ ఈఎంఐలు కడుతూ ఆర్థిక ఇబ్బందులు పడటం నేడు అనేక కుటుంబాల్లో చూస్తున్నాము. వేడుకల హడావుడి ఎంత ముఖ్యమో, దాని వెనుక ఉన్న ఆర్థిక ప్రణాళిక అంతకంటే ముఖ్యం.

దాచుకున్న డబ్బా? బ్యాంక్ రుణమా?

పెళ్లి ఖర్చులకు పర్సనల్​ లోన్ తీసుకోవాలా? లేక సేవింగ్స్ వాడుకోవాలా?
పెళ్లి ఖర్చులకు పర్సనల్​ లోన్ తీసుకోవాలా? లేక సేవింగ్స్ వాడుకోవాలా?

పెళ్లి ఖర్చుల కోసం దాచుకున్న పొదుపు మొత్తాన్ని వాడాలా లేక బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. పొదుపు చేసిన సొమ్మును ఉపయోగిస్తే ఎలాంటి వడ్డీ భారం, నెలానెలా ఈఎంఐల వేధింపులు ఉండవు. కానీ, ఆపత్కాలం కోసం దాచుకున్న అత్యవసర నిధి ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది.

మరొకవైపు, పర్సనల్ లోన్ తీసుకుంటే ఖర్చులను కొన్ని ఏళ్ల పాటు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. కానీ, అసలు కంటే వడ్డీ రూపంలో భారీగా అదనపు డబ్బు చెల్లించాల్సి వస్తుంది.

ఎస్​ఐపీలతో ముందస్తు ప్రణాళికే శ్రీరామరక్ష!

చివరి నిమిషంలో అధిక వడ్డీలకు రుణాలు తీసుకునే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. పెళ్లికి నాలుగైదేళ్ల ముందే ప్రణాళిక ప్రారంభించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

"మన జీవితంలో వచ్చే పెద్ద పెద్ద వేడుకలకు మానసికంగానే కాదు, ఆర్థికంగానూ సిద్ధంగా ఉండాలి. సరైన ప్లానింగ్ లేకపోతే కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. పెళ్లి లాంటి లక్ష్యాల కోసం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఎస్‌ఐపీ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం శ్రేయస్కరం. ప్రతినెలా రూ.10,000 చొప్పున 12.62 శాతం అంచనా రాబడితో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే, 10 ఏళ్లలో ఆ మొత్తం దాదాపు రూ.8.23 లక్షలకు చేరుకుంటుంది," అని యుధాజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు యుధాజిత్ బౌల్ వివరించారు.

ముందస్తు పెట్టుబడులు లేకపోతే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి 10 శాతం నుంచి 17 శాతం వరకు అధిక వడ్డీలకు రుణాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మీ నెలవారీ ఆదాయంలో 30 శాతానికి పైగా కేవలం ఈఎంఐలకే పోతుంటే, భవిష్యత్తులో అత్యవసర నిధి, సొంతింటి కల లేదా రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం అసాధ్యంగా మారుతుంది.

పర్సనల్ లోన్ ఎప్పుడు పరిగణించవచ్చు?

అసలు రుణం తీసుకోవడమే తప్పా అంటే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

"మీ దగ్గర తగినంత పొదుపు ఉంటే దాన్నే వాడటం ఉత్తమం. పెళ్లి అనేది ఒక్క రోజు వేడుక, కానీ దాని కోసం తీసే పర్సనల్ లోన్ 3 నుంచి 5 ఏళ్ల పాటు వెంటాడుతుంది. ఈఎంఐలు కడుతూ భవిష్యత్తులో అత్యవసరమైన హోమ్ లోన్ పొందే అర్హతను కోల్పోవడం మేం తరచూ చూస్తుంటాము. ఒకవేళ రుణం తీసుకోక తప్పని పరిస్థితి వస్తే, మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ 10 నుంచి 15 శాతానికి మించకుండా చూసుకోండి. 11 నుంచి 16 శాతం వడ్డీ ఇచ్చే నమ్మకమైన బ్యాంకులు లేదా ఎన్‌బీఎఫ్‌సీలను ఎంచుకోండి. 20 శాతానికి పైగా వడ్డీ వసూలు చేసే ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లకు దూరంగా ఉండండి," అని మిన్ఈఎంఐ సీఓఓ కపిల్ మఖిజా సూచించారు.

అత్యవసర నిధిని (ఎమర్జెన్సీ ఫండ్) ఏమాత్రం కదల్చకుండా పెళ్లి ఖర్చులు పూర్తి చేయగలిగితే దాచుకున్న పొదుపు సొమ్మునే ఉపయోగించడం మంచిది. ఒకవేళ రుణం తీసుకోక తప్పకపోతే, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. ఒక్క రోజు జరిపే సంబరం, జీవితకాలపు ఆర్థిక భారంగా మారకుండా చూసుకోవడమే నిజమైన తెలివైన పని.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. పర్సనల్ లోన్ తీసుకోవడం, అప్పులు చేయడం రిస్కీ అని గుర్తుపెట్టుకోవాలి.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks