సింగిల్ ఛార్జ్‌తో 400 కి.మీ రేంజ్- ఇది ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా..
సింపుల్ ఎనర్జీ తన నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సింపుల్ వన్ జెన్ 2’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనితో పాటు సింపుల్ అల్ట్రా పేరుతో కొత్త, లాంగ్ రేంజ్ స్కూటర్ని సైతం ఆవిష్కరించింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ టూ-వీలర్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న బెంగళూరుకు చెందిన స్టార్టప్ ‘సింపుల్ ఎనర్జీ’.. తన పాపులర్ స్కూటర్ సింపుల్ వన్‌లో సరికొత్త వెర్షన్ జెన్ 2ను లాంచ్ చేసింది. అద్భుతమైన రేంజ్, స్టైలిష్ లుక్, అత్యాధునిక సాఫ్ట్‌వేర్‌తో ఈ స్కూటర్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. అంతేకాదు, సింపుల్ అల్ట్రా పేరుతో ఓ కొత్త, లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని సైతం సంస్థ ఆవిష్కరించింది.

సింపుల్ అల్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్..
జెన్ 2 లాంచ్‌తో పాటు కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ‘సింపుల్ అల్ట్రా’ను కూడా పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా 6.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 400 కి.మీ (ఐడీసీ సర్టిఫైడ్) రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. కేవలం 2.77 సెకన్లలోనే 0-40 కి.మీ. వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఫలితంగా దేశంలోనే ఇది రెండోవ ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది.
వేరియంట్ల వారీగా ఈ సింపుల్ అల్ట్రా టాప్‌లో ఉంటుంది. ఈ మోడల్ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
సింపుల్ వన్ జెన్ 2: డిజైన్, బాడీ..
కొత్త సింపుల్ వన్ జెన్ 2 మునుపటి కంటే మరింత షార్ప్‌గా, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్‌తో కనిపిస్తుంది. సోనిక్ రెడ్, ఏరో ఎక్స్, ఆస్ఫాల్ట్ ఎక్స్ వంటి మూడు కొత్త రంగులలో ఇది లభిస్తుంది.
మరింత దృఢంగా: దీని ఈ-స్కూటర్ ఛాసిస్‌ను రీ-డిజైన్ చేశారు. దీనివల్ల బాడీకి 22 శాతం అదనపు దృఢత్వం లభించింది, ఫలితంగా హై-స్పీడ్ వద్ద ప్రయాణం చాలా నిలకడగా ఉంటుంది.
లైఫ్ టైమ్ వారంటీ: కస్టమర్లలో భరోసా నింపేందుకు బ్యాటరీ, మోటార్‌పై కంపెనీ జీవితకాల వారంటీని అందిస్తోంది.
సింపుల్ వన్ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్- బ్యాటరీ సామర్థ్యం, రేంజ్..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం మూడు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులో ఉంది:
టాప్ వేరియంట్ (5 కేడబ్ల్యూహెచ్): 265 కి.మీ. రేంజ్, 0-40 కి.మీ వేగం కేవలం 2.55 సెకన్లలో అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 115 కి.మీ.
మిడ్ వేరియంట్ (4.5 కేడబ్ల్యూహెచ్): 236 కి.మీ. రేంజ్, గరిష్ట వేగం 90 కి.మీ.
బేస్ వేరియంట్ (వన్ఎస్ - 3.7 కేడబ్ల్యూహెచ్): 190 కి.మీ. రేంజ్, గరిష్ట వేగం 90 కి.మీ.
బ్యాటరీ బరువును కూడా 4 కిలోలు తగ్గించినట్లు సంస్థ తెలిపింది. వర్షం, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి ఐపీ67 రేటింగ్ ఇచ్చారు.
స్మార్ట్ ఫీచర్లు..
కొత్త 'సింపుల్ ఓఎస్'తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెక్నాలజీ పరంగా మరో మెట్టు ఎక్కింది.
సేఫ్టీ ఫీచర్లు: స్కూటర్ కింద పడితే దానంతట అదే ఆగిపోయే 'డ్రాప్ సేఫ్', కొండ ప్రాంతాల్లో వెనక్కి జారకుండా ఆపే 'సూపర్ హోల్డ్' వంటి ఫీచర్లు ఉన్నాయి.
డిస్‌ప్లే: 7-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, రియల్ టైమ్ వెహికల్ మానిటరింగ్ సదుపాయం ఉంది.
స్టోరేజ్: సీటు కింద 35 లీటర్ల భారీ స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.
సింపుల్ వన్ జెన్ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు)
- సింపుల్ వన్ఎస్ (3.7 కేడబ్ల్యూహెచ్): రూ. 1,49,999
- సింపుల్ వన్ (4.5 కేడబ్ల్యూహెచ్): రూ. 1,69,999
- సింపుల్ వన్ (5 కేడబ్ల్యూహెచ్): రూ. 1,77,999
అయితే, ఇనీషియల్ ఆఫర్ కింద ఇప్పుడు కేవలం రూ. 1,39,999 కే ప్రారంభ మోడల్ లభిస్తుంది.














