...
...
Next Story

SIP ఇన్వెస్ట్‌మెంట్: 10 ఏళ్లు ఆలస్యం చేస్తే రూ.24 లక్షల నష్టం

రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఎస్‌ఐపీని (SIP) చిన్న వయసులోనే ప్రారంభించడం వల్ల చక్రవడ్డీ రూపంలో భారీ లాభాలు అందుకోవచ్చు. కేవలం 10 ఏళ్లు ఆలస్యం చేయడం వల్ల చేతికి వచ్చే డబ్బు ఎలా తగ్గుతుందో గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.

Published on: Jul 1, 2026, 15:46:06 IST
Advertisement

రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి పెట్టడం మంచి మార్గంగా మారింది. అయితే, ఎస్‌ఐపీని కొన్ని ఏళ్లు ఆలస్యంగా ప్రారంభించడం పెద్ద విషయమేమీ కాదని చాలామంది భావిస్తారు. కానీ, ఈ చిన్న ఆలస్యం మీ రిటైర్మెంట్ నిధిని ఊహించని స్థాయిలో దెబ్బతీస్తుంది. పెట్టుబడులు పెట్టడంలో ఎంత ఆలస్యం చేస్తే.. చక్రవడ్డీ (Power of Compounding) అందించే అద్భుతమైన ప్రయోజనాన్ని అంతగా కోల్పోతారు.

SIP ఇన్వెస్ట్‌మెంట్: 10 ఏళ్లు ఆలస్యం చేస్తే రూ.24 లక్షల నష్టం
SIP ఇన్వెస్ట్‌మెంట్: 10 ఏళ్లు ఆలస్యం చేస్తే రూ.24 లక్షల నష్టం

మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు 'సమయం' అనేది ఒక పెద్ద ఆయుధం. ఎంత తొందరగా పెట్టుబడి ప్రారంభిస్తే, ఆ డబ్బు అంత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగి, అదనపు రాబడులను అందిస్తుంది. దీర్ఘకాలంలో నెలకు పెట్టే చిన్న మొత్తమైనా సరే, చక్రవడ్డీ పుణ్యమా అని రిటైర్మెంట్ సమయానికి పెద్ద నిధిలా మారుతుంది. మరి చిన్న వయసులోనే పెట్టుబడి మొదలుపెడితే వచ్చే లాభం ఏంటి? 25 ఏళ్ల వయసులో ఎస్‌ఐపీ ప్రారంభించిన వ్యక్తికి, 35 ఏళ్ల వయసులో ప్రారంభించిన వ్యక్తికి 60 ఏళ్లు వచ్చేసరికి ఎంత తేడా ఉంటుందో ఈ గణాంకాలు చూస్తే స్పష్టమవుతుంది.

ఆలస్యం చేస్తే జరిగే నష్టం ఏంటి?

పెట్టుబడిని ఆలస్యం చేయడం అంటే కేవలం కొన్ని నెలల వాయిదాలను దాటవేయడం మాత్రమే కాదు, చక్రవడ్డీ ద్వారా మీ డబ్బు పెరిగే విలువైన సంవత్సరాలను శాశ్వతంగా కోల్పోవడం. ప్రతి ఏటా ఆలస్యం చేసే కొద్దీ, మీ పెట్టుబడి పెరిగేందుకు తక్కువ సమయం దొరుకుతుంది. దీనివల్ల గతంలో రావాల్సిన లాభాలపై వచ్చే అదనపు రాబడులను కూడా కోల్పోవాల్సి వస్తుంది. సులభంగా చెప్పాలంటే, ఎస్‌ఐపీ ఆలస్యం చేయడం వల్ల చక్రవడ్డీ మీ వైపు పని చేసే సువర్ణావకాశాన్ని చేజేతులా వదులుకున్నట్లే.

25 ఏళ్లు వర్సెస్ 35 ఏళ్లు: ఒక విశ్లేషణ

మొదటి ఇన్వెస్టర్ (25 ఏళ్ల వయసు): ఈ వ్యక్తి 25 ఏళ్ల వయసులోనే ఎస్‌ఐపీ ప్రారంభించి, 60 ఏళ్ల వయసు వరకు అంటే మొత్తం 35 ఏళ్ల పాటు పెట్టుబడిని కొనసాగించారు. ఈ కాలంలో ఆయన పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.4.20 లక్షలు. 10 శాతం వార్షిక రాబడి ప్రకారం, 60 ఏళ్లకు ఆయన చేతికి వచ్చే మొత్తం విలువ అక్షరాలా రూ.37.97 లక్షలు అవుతుంది. అంటే ఆయనకు వచ్చిన నికర లాభం రూ.33.77 లక్షలు.

రెండవ ఇన్వెస్టర్ (35 ఏళ్ల వయసు): ఈ వ్యక్తి 35 ఏళ్ల వయసులో అదే రూ.1,000 ఎస్‌ఐపీని ప్రారంభించి, 60 ఏళ్ల వరకు అంటే 25 ఏళ్ల పాటు కొనసాగించారు. ఈయన పెట్టిన మొత్తం పెట్టుబడి రూ.3 లక్షలు. 10 శాతం రాబడి లెక్కన 60 ఏళ్లకు ఈ పెట్టుబడి విలువ రూ.13.27 లక్షలకు చేరుకుంటుంది. ఈయనకు వచ్చిన నికర లాభం రూ.10.27 లక్షలు మాత్రమే.

కేవలం 1.20 లక్షల తేడాతో రూ.24.70 లక్షల నష్టం

ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఒకటుంది. మొదటి వ్యక్తి రెండో వ్యక్తి కంటే కేవలం రూ.1.20 లక్షలు మాత్రమే అదనంగా ఇన్వెస్ట్ చేశారు. కానీ, 60 ఏళ్ల వయసు వచ్చేసరికి వీరిద్దరి రిటైర్మెంట్ ఫండ్స్ మధ్య తేడా దాదాపు రూ.24.70 లక్షలుగా ఉంది. అంటే 10 ఏళ్లు ఆలస్యం చేయడం వల్ల రెండో ఇన్వెస్టర్ భారీ సంపదను కోల్పోయారు. ఈ వ్యత్యాసం పెట్టుబడి పెట్టిన మొత్తం వల్ల రాలేదు, కేవలం 'సమయం' ఇచ్చిన అదనపు ప్రయోజనం వల్లే సాధ్యపడింది.

ఇక్కడ చూపించిన లెక్కలు 10 శాతం వార్షిక రాబడిని అంచనా వేసి చేసినవి అయినప్పటికీ, రిటైర్మెంట్ ప్లానింగ్‌లో ఇదొక గొప్ప పాఠం. మ్యూచువల్ ఫండ్ రాబడులు ఎప్పుడూ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, చిన్న మొత్తమైనా సరే ఎంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే, లాభాలు అంత అద్భుతంగా ఉంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక భద్రత కోసం ఎస్‌ఐపీని ఎంత వీలైతే అంత త్వరగా ప్రారంభించడమే సరైన నిర్ణయం.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి సలహాగా భావించకూడదు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందైనా సెబీ (SEBI) రిజిస్టర్డ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe