Swiss flight : షాకింగ్​.. టేకాఫ్​ సమయంలో ఇంజిన్​లో మంటలు! సర్వత్రా టెన్షన్, టెన్షన్..

Delhi Airport Emergency : దిల్లీ విమాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. ఓ విమానం టేకాఫ్​ అవుతుండగా, ఇంజిన్​లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్లు తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రయాణికులను రక్షించారు. ఈ క్రమంలో ఆరుగురు గాయపడ్డారు.

Published on: Apr 26, 2026, 11:18:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశ రాజధాని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌కు బయలుదేరాల్సిన 'స్విస్ ఎయిర్' విమానం రన్‌వేపై వేగంగా వెళుతుండగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. పైలట్లు అప్రమత్తమై టేకాఫ్‌ను నిలిపివేయడంతో 232 మంది ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

దిల్లీ విమాశ్రయంలో నిలిచిపోయిన విమానం.. (Ishan Jain/X)
దిల్లీ విమాశ్రయంలో నిలిచిపోయిన విమానం.. (Ishan Jain/X)

కాగా.. విమానం నుంచి అత్యవసరంగా కిందకు దిగుతుండగా ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు.

దిల్లీ విమానాశ్రయంలో ఆదివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎల్​ఎక్స్147 విమానం 228 మంది ప్రయాణికులు, నలుగురు పసిబిడ్డలతో జ్యూరిచ్‌కు బయలుదేరేందుకు రన్‌వేపై పరుగులు తీస్తోంది. సరిగ్గా టేకాఫ్ అయ్యే కొద్ది సెకన్ల ముందు విమానం ఎడమ వైపు ఉన్న ఇంజిన్ నుంచి భారీగా పొగలు, మంటలు రావడం సిబ్బంది గమనించారు.

ఎమర్జెన్సీ స్లైడ్ల ద్వారా తరలింపు.. ఆరుగురికి గాయాలు

మంటలను గుర్తించిన వెంటనే పైలట్లు విమానాన్ని నిలిపివేసి, ఎమర్జెన్సీ ప్రోటోకాల్‌ను యాక్టివేట్ చేశారు. రన్‌వేపైనే ప్రయాణికులను విమానం నుంచి కిందకు దించే ప్రక్రియ ప్రారంభమైంది.

"అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ స్లైడ్ల (గాలి నింపిన జారే మెట్లు) ద్వారా ప్రయాణికులను కిందకు పంపారు. ఈ క్రమంలో జారేటప్పుడు ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారికి ప్రస్తుతం వైద్య చికిత్స అందిస్తున్నాము," అని స్విస్ ఎయిర్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

స్లైడ్ల ద్వారా దిగలేని వారి కోసం ప్రత్యేకంగా నిచ్చెనలను ఏర్పాటు చేశారు.

స్విస్​ విమాన ఇంజిన్​లో మంటలు- "అందరూ సురక్షితం"

విమానంలో ఉన్న ఇషాన్ జైన్ అనే ప్రయాణికుడు ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

"విమానంలో ఉన్న వారంతా సురక్షితంగా ఉన్నారు. కొందరికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాకు హోటల్ వసతి, ప్రత్యామ్నాయ విమానాలను ఏర్పాటు చేశారు," అని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు విమానంలోని సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకు జ్యూరిచ్ నుంచి నిపుణుల బృందం దిల్లీకి రానుంది.

విమానాశ్రయ కార్యకలాపాలు యథాతథం..

ఈ ఘటన జరిగిన వెంటనే దిల్లీ విమానాశ్రయ అధికారులు 'ఫుల్ ఎమర్జెన్సీ' ప్రకటించారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదం కారణంగా విమానాశ్రయంలోని ఇతర విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పష్టం చేశారు.

వరుస ఘటనలతో ఆందోళన!

దిల్లీ విమానాశ్రయంలో గత కొద్ది రోజులుగా వరుసగా విమాన ప్రమాదాలు జరగడం ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏప్రిల్ 16న టెర్మినల్ 1 వద్ద ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్ విమానాలు ఒకదానికొకటి ఢీకొన్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు రన్‌వేపై ఇంజిన్ మంటల ఘటన చోటుచేసుకోవడం విమానయాన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More