...
...
Next Story

Sonam Wangchuk : ఆసుపత్రిలో సోనమ్ వాంగ్​చుక్- పోలీసుల అదుపులో దిప్కే- నిరసనకారులపై లాఠీఛార్జ్?

Sonam Wangchuk health : దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనేక రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం ఉదయం దిల్లీ పోలీసులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత, తోపులాట చోటుచేసుకున్నాయి.

Published on: Jul 18, 2026, 09:58:52 IST
Advertisement

దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ ధర్నా చౌక్ వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉద్విగ్న భరిత, గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్షల అక్రమాలు, వరుస పేపర్ లీకేజీల వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను దిల్లీ పోలీసులు బలవంతంగా నిరసన స్థలం నుంచి తరలించారు.

జంతర్​ మంతర్​ వద్ద హైడ్రామా..
జంతర్​ మంతర్​ వద్ద హైడ్రామా..

ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్య చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెబుతుండగా.. పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేసి, వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఎత్తుకెళ్లారని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఈ నిరసనను ముందుండి నడిపిస్తున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. “దిల్లీ పోలీసులు నన్ను దారుణంగా కొట్టి, డిటెన్షన్‌లో ఉంచారు,” అని అభిజీత్ దిప్కే ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద పోలీసులు అనాగరికంగా వ్యవహరిస్తూ నిరసనకారులపై విరుచుకపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

'సివిల్ డ్రస్సులో వచ్చి దాడి చేశారు'

శనివారం తెల్లవారుజామున పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని అక్కడి నిరసనకారులు ఆరోపిస్తున్నారు. మొదట పది మంది పోలీసులు సాదా సీదా దుస్తుల్లో (ప్లెయిన్ క్లాత్స్) వచ్చి తాము మెడికల్ టీమ్ అని అబద్ధం చెప్పారని ఒక వాలంటీర్ తెలిపారు.

“తెల్లవారుజామునే పది మంది సివిల్ డ్రస్సులో వచ్చారు. తాము వైద్య బృందమని చెప్పారు. కానీ వారి ప్రవర్తన చూస్తే డాక్టర్లలా అనిపించలేదు. వెంటనే వాలంటీర్లను పక్కకు తప్పుకోవాలని ఆదేశించారు. కాసేపు ఆగమని మేము ఎంత బ్రతిమాలినా వినకుండా, హైకోర్టు ఆర్డర్ ఉందంటూ సోనమ్ సార్‌ను బలవంతంగా తీసుకెళ్లారు. అదే సమయంలో వాష్ రూమ్‌కు వెళ్లిన అభిజీత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ కూడా కలవడం లేదు,” అని ఒక నిరసనకారుడు ఆరోపించారు.

"సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం చాలా క్లిష్టమైన స్థితికి చేరుకుంది. ఆయన ప్రాణాలను కాపాడటానికి, అత్యవసర వైద్య సహాయం అందించడానికి మాత్రమే ఆసుపత్రికి తరలించాం. హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది. అయినప్పటికీ పోలీసులు అత్యంత సంయమనం పాటించి, వాంగ్‌చుక్‌ను సురక్షితంగా ఆసుపత్రికి చేర్చారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న నిరసనకారులు కూడా శాంతియుతంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలి," అని దిల్లీ పోలీస్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

కాగా ఆసుపత్రిలో వాంగ్​చుక్​కి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

వాంగ్‌చుక్‌పై దాడి జరిగిందా? క్షీణించిన ఆరోగ్యం!

మరోవైపు, శుక్రవారం అర్ధరాత్రి జంతర్ మంతర్ నిరసన వేదిక వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌పై కొందరు దుండగులు దాడికి యత్నించారని అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణ చేశారు. దీక్షా స్థలిపైకి గుర్తుతెలియని వస్తువును విసిరారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రతిపక్ష నేతల సంఘీభావం..

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం దేశంలోని ప్రముఖ ప్రతిపక్ష నాయకులు జంతర్ మంతర్ వద్దకు వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్, కాంగ్రెస్ నేత పవన్ ఖేరా, శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆధిత్య ఠాకరే వంటి ప్రముఖులు వాంగ్‌చుక్‌ను కలిసి మద్దతు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఆయన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe