Strait of Hormuz : ‘హర్ముజ్ జలసంధి ఓపెన్లోనే ఉంది’- ప్రపంచానికి ఇరాన్ గుడ్ న్యూస్! కానీ..
Strait of Hormuz open for India : ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల నౌకలకు ఈ మార్గాన్ని మూసివేస్తున్నట్లు, ఇతర దేశాలకు అనుమతి ఇస్తున్నట్టు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తితలు మొదలైనప్పటి నుంచి హర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ నౌకాయనానికి ఈ మార్గం తెరిచే ఉంటుందని వెల్లడించింది. కానీ ఇది అన్ని దేశాలకు వర్తించదను, అమెరికా- ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాలకు ఈ హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ప్రకటించింది.

శనివారం (మార్చి 14) 'ఎంఎస్ నౌ'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"నిజానికి హర్ముజ్ జలసంధి అందరికీ తెరిచే ఉంది. కానీ మాపై, మా మిత్రదేశాలపై దాడులు చేస్తున్న శత్రువులకు చెందిన ట్యాంకర్లు, ఓడలను మాత్రం మేము అనుమతించం. మిగిలిన దేశాల నౌకలు యధేచ్ఛగా ఈ మార్గం ద్వారా ప్రయాణించవచ్చు," అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచానికి హర్ముజ్ జలసంధి ఎందుకంత ముఖ్యం?
హర్ముజ్ జలసంధి అనేది కేవలం ఒక సముద్ర మార్గం మాత్రమే కాదు, అది ప్రపంచ ఇంధన భద్రతకు అత్యంత కీలకమైన, వ్యూహాత్మక ప్రాంతం.
దీని ప్రాముఖ్యతను ఈ కింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు:
ప్రధాన చమురు రవాణా మార్గం: పర్షియన్ గల్ఫ్‌ను ఒమన్ గల్ఫ్- అరేబియా సముద్రంతో కలిపే ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచంలోని ముడి చమురు, ఎల్ఎన్జీ రవాణాలో సింహభాగం జరుగుతుంది. ఇది ప్రపంచ ఇంధన మార్కెట్లకు ఒక జీవనాడి వంటిది.
గల్ఫ్ దేశాల ఆధారిత మార్గం: సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతార్, యూఏఈ వంటి అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి దేశాలు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయడానికి పూర్తిగా ఈ మార్గంపైనే ఆధారపడతాయి.
వ్యూహాత్మక స్థానం: ఈ జలసంధికి ఉత్తరాన ఇరాన్, దక్షిణాన ఒమన్, యూఏఈ దేశాలు ఉన్నాయి. దీని వెడల్పు అత్యంత తక్కువగా ఉన్న చోట కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇందులోని షిప్పింగ్ లేన్లు ఇంకా తక్కువ వెడల్పు కలిగి ఉండటంతో, చిన్నపాటి అంతరాయం కలిగినా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
ట్రంప్ ఘాటు స్పందన: యుద్ధ నౌకల మోహరింపుకు పిలుపు..
మరోవైపు హర్ముజ్ జలసంధిపై నెలకొన్న అనిశ్చితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తీరప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తామని ఆయన హెచ్చరించారు.
ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పోస్ట్ చేస్తూ.. "హర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నం వల్ల ప్రభావితమయ్యే అనేక దేశాలు, అమెరికాతో కలిసి తమ యుద్ధ నౌకలను ఆ ప్రాంతానికి పంపించాలి. తద్వారా ఈ మార్గాన్ని సురక్షితంగా, అందరికీ అందుబాటులో ఉంచుతాము," అని పేర్కొన్నారు.
కాగా అమెరికా ఇప్పటికే ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని 100 శాతం ధ్వంసం చేసిందని ట్రంప్ క్లెయిమ్ చేశారు. అయినప్పటికీ, ఆ దేశం ఓటమిని తట్టుకోలేక డ్రోన్లు పంపడం లేదా మైన్స్ వేయడం ద్వారా రవాణాకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, బ్రిటన్ వంటి దేశాలు వెంటనే తమ నౌకలను పంపి ఇరాన్ ముప్పును అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మరోవైపు, అమెరికా విజ్ఞప్తికి ఏవైనా దేశాలు సానుకూలంగా స్పందించాయా లేదా అన్న అంశంపై వైట్ హౌస్ ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ పరిణామాలు ఆసియా, యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఎటువంటి ప్రభావం చూపుతాయోనని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. హర్ముజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసివేసిందా?
లేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేసిన దాని ప్రకారం.. ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయానానికి తెరిచే ఉంటుంది. అయితే, ఇరాన్‌పై దాడులు చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్, వారి మిత్రదేశాలకు చెందిన నౌకలు, ట్యాంకర్లకు మాత్రమే ప్రవేశం ఉండదు. ఇతర దేశాల వాణిజ్య నౌకలు యధేచ్ఛగా ఈ మార్గం ద్వారా ప్రయాణించవచ్చు.
2. ఈ జలసంధి మూసివేత వల్ల చమురు ధరలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
హర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గం. గల్ఫ్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే చమురులో సింహభాగం ఇక్కడి నుంచే వెళుతుంది. ఇరాన్ విధించిన ఈ ఆంక్షల వల్ల లేదా అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంటే, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper












