...
...
Next Story

Live in relationship : ‘బిడ్డని కన్నారు, ఇప్పుడు రేప్​ అంటే ఎలా?' లివ్​-ఇన్​ రిలేషన్​పై సుప్రీంకోర్టు..

Supreme court on Live in relationship : లివ్​-ఇన్​ రిలేషన్స్​లో బ్రేకప్​ అనేది నేరం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బిడ్డకు జన్మనచ్చిన ఓ మహిళ, తాను సహజీవనం చేసిన ఓ వ్యక్తిపై దాఖలు చేసిన రేప్ కేసులో భాగంగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

Published on: Apr 27, 2026, 13:17:20 IST
Advertisement

Supreme court : లివ్-ఇన్ రిలేషన్​షిప్ నుంచి విడిపోవడం లేదా ఆ బంధం నుంచి బయటకు రావడం అనేది నేరపూరితమైన చర్య కాదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. వివాహం అనే చట్టబద్ధమైన బంధం లేని ఇటువంటి సంబంధాల్లో అంతర్గతంగా అనేక రిస్కులు ఉంటాయని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది.

కేసు నేపథ్యం ఏంటి?

లివ్​-ఇన్​ రిలేషన్​షిప్స్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
లివ్​-ఇన్​ రిలేషన్​షిప్స్​పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక వ్యక్తి తనపై అత్యాచారానికి, దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఒక మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ బీవీ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. సదరు మహిళ ఆ వ్యక్తితో చాలా కాలం పాటు లివ్-ఇన్ రిలేషన్‌లో ఉండి, ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అయితే వీరి బంధం ముగిసిన తర్వాత ఆమె సదరు వ్యక్తిపై లైంగిక దాడి కేసు పెట్టింది.

కోర్టు సంధించిన ప్రశ్నలు..

విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు.

"వీరిద్దరూ లివ్-ఇన్ రిలేషన్‌లో ఉన్నారు. పెళ్లి లేకుండానే ఆమె అతనితో కలిసి ఉండి బిడ్డను కూడా కనింది. ఇప్పుడు అత్యాచారం, దాడి అని ఆరోపిస్తోంది. ఏంటిది?" అని ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో సాగిన సంబంధం లైంగిక దాడి కిందకు ఎలా వస్తుందని నిలదీశారు.

విక్టిమ్ షేమింగ్ కాదు: ఇటువంటి ప్రశ్నలను కొందరు 'విక్టిమ్ షేమింగ్' (బాధితురాలిని నిందించడం)గా విమర్శిస్తారని, కానీ ఇక్కడ అంగీకారం (కన్సెంట్) అనేది చాలా ముఖ్యమని జడ్జి అభిప్రాయపడ్డారు.

పెళ్లి లేని బంధాల తత్వం: "లివ్-ఇన్ రిలేషన్లలో ఇదే జరుగుతోంది. ఏళ్ల తరబడి కలిసి ఉంటారు. విడిపోయినప్పుడు మహిళ సదరు వ్యక్తిపై లైంగిక దాడి ఫిర్యాదు చేస్తుంది. వివాహేతర సంబంధాల్లో ఉండే అనిశ్చితికి ఇవే నిదర్శనం," అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మహిళ హక్కులు, బిడ్డ భవిష్యత్తు..

బిడ్డకు భరణం: సంబంధం ఏదైనా కావచ్చు, కానీ పుట్టిన బిడ్డ అక్రమం కాదు. ఆ బిడ్డ కోసం మహిళ భరణం కోరవచ్చని కోర్టు తెలిపింది.

చట్టబద్ధమైన రక్షణ: ఒకవేళ పెళ్లి జరిగి ఉంటే ఆమెకు చట్టపరంగా మెరుగైన హక్కులు ఉండేవని, లివ్-ఇన్ రిలేషన్ వల్ల ఆ రక్షణ తగ్గిందని కోర్టు పేర్కొంది.

నేరపూరిత చర్య కాదు: బంధం విచ్ఛిన్నం కావడం అనేది క్రిమినల్ నేరం కిందకు రాదు.

పరిష్కారం దిశగా..

ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ఇరుపక్షాలకు సుప్రీంకోర్టు సూచించింది.

మరోవైపు చట్టబద్ధమైన వివాహం లేకుండా కలిసి ఉండటంలో ఉండే సామాజిక, చట్టపరమైన ఇబ్బందులను ఈ కేసు మరోసారి చర్చకు తెచ్చింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe