West Bengal : 97ఏళ్ల వృద్ధుడి కాళ్లను నమస్కరించిన మోదీ- ఆయన ఎవరు?
PM Modi : కోల్‌కతాలో సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఒక భావోద్వేగపూరిత ఘట్టానికి వేదికైంది. బీజేపీ సీనియర్ నేత, 97 ఏళ్ల మఖన్‌లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించి ప్రధాని మోదీ గౌరవించారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ సహచరుడైన సర్కార్‌ను ప్రధాని సన్మానించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
Suvendu Adhikari oath taking ceremony : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈరోజు జరిగిన సువేందు అధికారి ప్రమాణ స్వీకార వేడుకలో ఒక అరుదైన, అత్యంత గౌరవప్రదమైన దృశ్యం ఆవిష్కృతమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వేదికపై ఉన్న 97 ఏళ్ల వృద్ధుడికి పాదాభివందనం చేసి, సాదరంగా ఆలింగనం చేసుకున్నారు. ప్రధాని అంతటి గౌరవాన్ని అందించిన ఆ వ్యక్తి పేరు మఖన్‌లాల్ సర్కార్. ఈయన సిలిగురి నివాసి, బెంగాల్‌లోని భారతీయ జనతా పార్టీ అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు.

శ్యామా ప్రసాద్ ముఖర్జీ అంతిమయాత్రలో సహచరుడు
మఖన్‌లాల్ సర్కార్ గురించి బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీకి సర్కార్ అత్యంత సన్నిహిత అనుచరుడు.
"కశ్మీర్ జైలులో ముఖర్జీ అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు, ఆయన అంతిమయాత్రలో భాగస్వామి అయిన అతికొద్ది మందిలో సర్కార్ ఒకరు. అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్య ఉండటం మన అదృష్టం," అని భట్టాచార్య పేర్కొన్నారు.
కోర్టులో జడ్జిని మెప్పించిన ధీశాలి!
మఖన్‌లాల్ సర్కార్ జాతీయవాదానికి నిలువెత్తు రూపం. గతంలో కాంగ్రెస్ హయాంలో దిల్లీ పోలీసులు ఆయనను దేశభక్తి గీతం పాడినందుకు అరెస్టు చేశారు. కోర్టులో క్షమాపణలు చెప్పాలని జడ్జి కోరగా, ఆయన నిరాకరించారు. పైగా, అదే దేశభక్తి గీతాన్ని కోర్టు గదిలో గంభీరంగా పాడి వినిపించారు. ఆయన ధైర్యానికి ముగ్ధుడైన న్యాయమూర్తి.. ఆయనను గౌరవంగా ఇంటికి పంపడమే కాకుండా, ప్రయాణ ఖర్చుల కోసం 100 రూపాయలు ఇచ్చి ఫస్ట్ క్లాస్ టికెట్ కొనివ్వమని ఆదేశించారట.
ఎవరీ మఖన్‌లాల్ సర్కార్?
తొలి అడుగులు: సిలిగురి సాంగీతిక జిల్లాకు ఆయన తొలి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు.
చారిత్రక కశ్మీర్ పర్యటన: 1952లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ కశ్మీర్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి చేపట్టిన చారిత్రక పర్యటనలో సర్కార్ ఆయన వెంటే ఉన్నారు. ఆ సమయంలో ముఖర్జీతో పాటు సర్కార్ కూడా అరెస్ట్ అయ్యారు.
పార్టీ నిర్మాణం: 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత పశ్చిమ దినాజ్‌పూర్, జల్పాయ్‌గురి, డార్జిలింగ్ జిల్లాల ఆర్గనైజేషనల్ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టారు. కేవలం ఏడాది కాలంలోనే పదివేల మందిని పార్టీలో చేర్పించిన ఘనత ఆయనది.
సుదీర్ఘ సేవ: సాధారణంగా బీజేపీలో ఒక నాయకుడు రెండేళ్ల కంటే ఎక్కువ కాలం ఒకే పదవిలో ఉండటం కష్టం. కానీ, సర్కార్ వరుసగా ఏడేళ్ల పాటు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి రికార్డు సృష్టించారు.
స్వాతంత్య్రం అనంతర భారతదేశంలో జాతీయవాద ఉద్యమానికి అట్టడుగు స్థాయి నుంచి ప్రాణం పోసిన యోధులలో మఖన్‌లాల్ సర్కార్ ఒకరు. అటువంటి నిస్వార్థ నాయకుడికి ప్రధాని మోదీ అందించిన గౌరవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగాల్‌లో తొలి బీజేపీ సీఎంగా సువేందు..
మరోవైపు బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ వేడుకలో గవర్నర్ ఆర్ఎన్ రవి.. సువేందు, ఆయన మంత్రిమండలితో ప్రమాణ స్వీకారం చేయించారు.
బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
ఈ చారిత్రక సందర్భానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటు పలు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
శుక్రవారం జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో అమిత్ షా సమక్షంలో 207 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సువేందును తమ నాయకుడిగా ఎన్నుకున్నారు.
మమతా బెనర్జీపై ఘనవిజయం..
ఈ ఎన్నికల్లో సువేందు అధికారి తన రాజకీయ చతురతను చాటుకున్నారు. సొంత నియోజకవర్గం నందిగ్రామ్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా, తన ప్రత్యర్థి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపూర్ నియోజకవర్గంలో కూడా ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు. 294 సీట్లున్న బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ 207 సీట్లతో ఘనవిజయం సాధించగా, టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది.
సువేందు రాజకీయ ప్రస్థానం..
ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న సువేందు అధికారి, 2020 డిసెంబర్‌లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించినప్పటి నుంచి ఆయన బెంగాల్‌లో ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగారు. ప్రస్తుత ఎన్నికల్లో మమతా బెనర్జీకి ఆమె కంచుకోటలోనే పరాజయాన్ని రుచి చూపించి, బెంగాల్‌లో టీఎంసీ 62 ఏళ్ల రాజకీయ ఆధిపత్యానికి చరమగీతం పాడారు.
ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల జాబితా..
సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ముఖ్యులు:
సువేందు అధికారి - ముఖ్యమంత్రి
దిలీప్ ఘోష్ - మంత్రి
అగ్నిమిత్ర పాల్ - మంత్రి
అశోక్ కీర్తన్యా - మంత్రి
క్షుదీరాం తుడు - మంత్రి
నిశిత్ ప్రమాణిక్ - మంత్రి
బెంగాల్‌లో సుస్థిర పాలన అందిస్తామని, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సువేందు అధికారి స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


