West Bengal Election Result : కూలిన టీఎంసీ కంచుకోట! బీజేపీ ‘బెంగాల్’ కల నెరవేరినట్టే..
BJP West Bengal Election Result : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు ఉనికి లేని బీజేపీ, నేడు మమతా బెనర్జీ టీఎంసీని గద్దె దించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా పరుగులు తీస్తోంది. ఇదెలా సాధ్యమైంది? కమలదళానికి ఈసారి ప్రజలు ఎందుకు మద్దతిచ్చారు? పూర్తి విశ్లేషణను ఇక్కడ చూసేయండి..
West Bengal Election Results live : 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం! చిరకాల ప్రత్యర్థి, 15ఏళ్లుగా రాష్ట్రాన్ని శాసిస్తున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇస్తూ.. గెలుపు దిశగా బీజేపీ పరుగులు తీస్తోంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. 294 సీట్లున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో కమలదళం ఇప్పటికే 160+ చోట్ల ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఘన చరిత్ర కలిగిన పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 148. అంటే, ఇదే జోరు కొనసాగితే.. ఆ రాష్ట్రంలో బీజేపీ తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు లైన్ క్లియర్ అయినట్టే.

పశ్చిమ బెంగాల్‌లో అసలు ఉనికే లేని దశ నుంచి ఇప్పుడు టీఎంసీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ ఏలా చీల్చగలుగుతోంది? ప్రజలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నారు? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..
పశ్చమ బెంగాల్ రాజకీయ చరిత్ర..
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, అక్కడ దశాబ్దాల తరబడి లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, ఆపై తృణమూల్ కాంగ్రెస్‌లదే ఆధిపత్యం. భారతీయ జనతా పార్టీ ఈ గడ్డపై చాలా కాలంగా ఎన్నికల బరిలో నిలుస్తున్నప్పటికీ, అధికారాన్ని మాత్రం ఎప్పుడూ రుచి చూడలేదు.
అయితే, గత పదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఏకైక, ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు శాతాన్ని భారీగా పెంచుకోవడమే కాకుండా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 77 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసింది.
కాషాయ దళం ఎదుగుదల: కారణాలేంటి?
బెంగాల్‌లో బీజేపీ ఎదుగుదల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్రమ వలసలు, హిందుత్వ ఎజెండా, కేంద్రం అందిస్తున్న అభివృద్ధి నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఏప్రిల్ 29న ముగిసిన 2026 అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ వరకు బీజేపీ తన పట్టును నిరూపించుకుంటూనే ఉంది.
ప్రముఖ జర్నలిస్ట్ స్నిగ్దేందు భట్టాచార్య తన ‘మిషన్ బెంగాల్: ఏ సాఫ్రన్ ఎక్స్‌పెరిమెంట్’ పుస్తకంలో వివరించినట్లుగా.. 2013లో ఒక చిన్న పార్టీగా ఉన్న బీజేపీ, 2019 నాటికి రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో, అంటే దాదాపు సగానికి పైగా గెలుచుకునే స్థాయికి ఎదిగింది. దీని వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కృషి ఎంతో ఉంది. ముఖ్యంగా 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆర్ఎస్ఎస్ తన కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం బీజేపీకి బాగా కలిసివచ్చింది.
"2011 తర్వాత లెఫ్ట్ పార్టీలు తమ పట్టు కోల్పోవడంతో పశ్చిమ బెంగాల్‌లో ఒక రాజకీయ శూన్యం ఏర్పడింది. దాన్ని బీజేపీ అందిపుచ్చుకుంది. టీఎంసీ వైఫల్యాలను ఎండగట్టడం, హిందూ ఓట్ల ధ్రువీకరణ ద్వారా బలమైన ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించడంలో బీజేపీ సఫలమైంది," అని భట్టాచార్య విశ్లేషించారు.
2019: బీజేపీకి గెలుపునకు భీజం!
బెంగాల్ అసెంబ్లీలో ఇంతవరకు బీజేపీ అధికారం చేపట్టకపోయినా, 2019 లోక్‌సభ ఎన్నికలు ఆ పార్టీ చరిత్రలో ఒక మలుపుగా మిగిలిపోయాయి. 2014లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ, 2019 నాటికి ఏకంగా 18 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఓటు శాతం 17 నుంచి ఒక్కసారిగా 40 శాతానికి పెరిగింది. టీఎంసీకి, బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 3 శాతమే ఉండటం గమనార్హం.
రచయిత సాయంతన్ ఘోష్ తన ‘బ్యాటిల్‌గ్రౌండ్ బెంగాల్’ పుస్తకంలో పేర్కొన్నట్లుగా.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉనికి కోల్పోయి అట్టడుగుకు చేరగా, టీఎంసీ - బీజేపీలే కలిసి 83 శాతం ఓట్లను కొల్లగొట్టాయి. ఇది బెంగాల్ ఓటర్ల ఆలోచనా ధోరణిలో వచ్చిన అతిపెద్ద మార్పుకు సంకేతం.
ఎడమ నుంచి కుడికి.. ఓటర్ల వలస
సీఎస్‌డీఎస్-లోకనీతి సర్వే ప్రకారం.. ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలకు మద్దతు ఇచ్చిన ఓటర్లలో 40 శాతం మంది ఇప్పుడు బీజేపీ వైపు మళ్లారు. ఇది అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామం. సెక్యులర్, సోషలిస్ట్ భావజాలం ఉన్న ఓటర్లు సైతం జాతీయవాదం, రైట్ వింగ్ ఆర్థిక విధానాలు ఉన్న బీజేపీ వైపు మొగ్గు చూపడం బెంగాల్ రాజకీయాల్లో లోతైన ధ్రువీకరణకు అద్దం పడుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సాగిన హై-వోల్టేజ్ ప్రచారం హిందూ ఓటర్లను ఏకం చేసింది. 2014తో పోలిస్తే 2019 నాటికి హిందూ ఓటర్లలో బీజేపీకి మద్దతు 36 శాతం పెరిగింది. ఏప్రిల్ 25న ఠాకూర్ నగర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారీ ఓటింగ్ శాతం మార్పుకు సంకేతమని, టీఎంసీ 'నిరంకుశత్వానికి' ప్రజలు చరమగీతం పాడుతున్నారని పేర్కొన్నారు.
వీటితో పాటు ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కూడా బీజేపీకి కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. సాధారణంగా 5ఏళ్ల పాలనపైనే ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటారు. అలాంటిది మమతా బెనర్జీ టీఎంసీ ఏకంగా 15ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసింది. ఇటీవలి కాలంలో ఆ పార్టీపై, పాలనపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
నేటి స్థితిగతులు..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో మెజారిటీ సాధించలేకపోయినా, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచింది. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ మళ్లీ పుంజుకుని 29 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 12 స్థానాలకు పరిమితమైంది. అయినప్పటికీ, బెంగాల్ రాజకీయాలపై 'ఎరుపు' స్థానాన్ని 'కాషాయం' భర్తీ చేసింది. ఇప్పుడు విజయం దిశగా పరుగులు పెడుతోంది.
తాజా ట్రెండ్స్ చూస్తుంటే పశ్చిమ బెంగాల్ కోటను కూల్చేందుకు దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న కమలదళం, తన కలను నెరవేర్చుకున్నట్టే కనిపిస్తోంది. ఇక ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే, రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


