India vs Pakistan : ముగిసిన బాయ్‌కాట్ డ్రామా.. భారత్‌తో టీ20 పోరుకు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్!
ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్థాన్ హై-వోల్టేజ్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. పాకిస్థాన్ ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి, ఈ మ్యాచ్ ఆడే విధంగా తమ క్రికెట్ జట్టుకు అనుమతి ఇచ్చింది.
ఊహాగానాలను నిజం చేస్తూ పాకిస్థాన్ యూ-టర్న్ కొట్టింది! టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడమంటూ ఇంతకాలం చూపించిన మొండి వైఖరిని వీడింది. ఫలితంగా ఈ ఆదివారం, ఫిబ్రవరి 15 2026న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మహా సమరం యథాతథంగా కొనసాగనుంది.

ఇండియా వర్సెస్ పాకిస్థాన్- ప్రభుత్వం అధికారిక ప్రకటన..
సుమారు రూ. 4,000 కోట్ల విలువైన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ మ్యాచ్‌పై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ముగింపు లభించింది. ఈ మేరకు సోమవారం అర్థరాత్రి పాక్ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తన నోటిఫికేషన్‌లో ఇలా పేర్కొంది:
"బహుపాక్షిక చర్చల్లో సాధించిన ఫలితాలు, మిత్రదేశాల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని.. ఫిబ్రవరి 15, 2026న జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో భారత్‌తో తలపడాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రభుత్వం ఆదేశిస్తోంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటానికి, ప్రపంచ క్రికెట్ వ్యవస్థను దెబ్బతీయకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నాము."
ఇండియా వర్సెస్ పాకిస్థాన్: నాటకీయ పరిణామాలు..
పాక్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి:
బంగ్లాదేశ్ విన్నపం: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఒక లేఖ రాశారు. అందులో, తమకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా భారత్‌తో మ్యాచ్ ఆడాలని కోరారు. ఇది పాక్ ప్రభుత్వం తన ప్రజల ముందు పరువు పోకుండా వెనక్కి తగ్గడానికి ఒక సాకుగా ఉపయోగపడింది.
శ్రీలంక జోక్యం: శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయక కూడా వ్యక్తిగతంగా పాక్ ప్రధానికి ఫోన్ చేసి, ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు.
ఐసీసీ గట్టి వైఖరి: టీ20 వరల్డ్ కప్ 2026లో ఇండియాతో మ్యాచ్ ఆడకపోతే ఎదురయ్యే ఆర్థిక నష్టాలు, ఐసీసీ సభ్యత్వంపై వచ్చే ముప్పును ఐసీసీ స్పష్టం చేసింది. 'ఫోర్స్ మేజ్యూర్' క్లాజును అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్- బంగ్లాదేశ్‌కు ఐసీసీ ఇచ్చిన హామీలు
భారత్‌లో ఆడటానికి నిరాకరించినందుకు బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించి, స్కాట్లాండ్‌ను చేర్చినప్పటికీ, ఐసీసీ వారికి కొన్ని వెసులుబాట్లు కల్పించింది:
శిక్షలు లేవు: బీసీబీపై ఎటువంటి ఆర్థిక లేదా క్రీడా పరమైన శిక్షలు ఉండవు.
హోస్టింగ్ రైట్స్: 2028, 2031 మధ్య కాలంలో ఒక ఐసీసీ గ్లోబల్ ఈవెంట్‌ను హోస్ట్ చేసే అవకాశం బంగ్లాదేశ్‌కు కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.
డీఆర్సీ అప్పీల్: ఐసీసీ డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీని ఆశ్రయించే హక్కు బంగ్లాదేశ్‌కు ఉంటుంది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్: పీసీబీ డిమాండ్లు - ఐసీసీ తిరస్కరణ
ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఐసీసీ ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు:
భారత్-పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభించాలి.
భారత్, పాక్, బంగ్లాదేశ్‌లతో కూడిన త్రైపాక్షిక సిరీస్ నిర్వహించాలి.
ఐసీసీ స్పందన: ద్వైపాక్షిక సిరీస్‌లు బోర్డుల మధ్య విషయమని, అందులో తాము జోక్యం చేసుకోలేమని ఐసీసీ స్పష్టం చేసింది. త్రైపాక్షిక సిరీస్ ప్రతిపాదనను కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్- ఆటగాళ్ల సన్నద్ధత
ప్రస్తుతం కొలంబోలోనే ఉన్న పాకిస్థాన్ జట్టు, ఫిబ్రవరి 10న అమెరికాతో జరిగే తన తదుపరి మ్యాచ్‌పై దృష్టి పెట్టింది. పాక్ ఆటగాడు సల్మాన్ మీర్జా మాట్లాడుతూ, "ప్రభుత్వం ఏది చెబితే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము," అని తెలిపారు.
ఏదేమైనా ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతోందని అధికారికంగా ప్రకటన వెలువడటం క్రికెట్ లవర్స్‌కి మంచి కిక్ ఇచ్చే వార్త!
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


