Vijay : తమిళనాడు సీఎంగా విజయ్.. ఈరోజు కూడా ప్రమాణ స్వీకారం లేనట్టేనా? కొనసాగుతున్న సస్పెన్స్
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని అందుకున్నప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118) సాధించడంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గవర్నర్ అపాయింట్‌మెంట్ లభించినా, సంఖ్యాబలం నిరూపించుకోలేక విజయ్ ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది.
Tamil Nadu CM oath : తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని భావిస్తున్న తరుణంలో.. దళపతి విజయ్ 'పట్టాభిషేకం' ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. ద్రవిడ కోటలో ఎన్నికల బ్లాక్ బస్టర్ హిట్ సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని నిరూపించుకోవడంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శుక్రవారం నాటికి అంతా సెట్ అయినట్టే కనిపించినా, విజయ్ శనివారం కూడా ప్రమాణ స్వీకారం చేయలేకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

చివరి నిమిషంలో చేజారిన సమీకరణాలు!
శుక్రవారం సాయంత్రం వరకు విజయ్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అని భావించినప్పటికీ, చివరి నిమిషంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో సీన్ రివర్స్ అయింది. విజయ్ స్వయంగా చర్చలు జరిపినప్పటికీ, ఆ పార్టీల నుంచి సానుకూల స్పందన రాకపోవడం టీవీకే వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
వీసీకే వైపే అందరి చూపు..
ప్రస్తుత రాజకీయ సస్పెన్స్‌కు కేంద్ర బిందువుగా 'విడుతలై చిరుతైగల్ కట్చి' (వీసీకే) నిలిచింది. ఈ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఇద్దరి మద్దతు లభిస్తేనే విజయ్ మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోగలరు. అయితే వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని ప్రకటించకుండా, డీఎంకే నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు.
కాగా వీసీకే శనివారం రోజు తన స్టాండ్‌ను క్లియర్ చేసే అవకాశం ఉందని సమాచారం.
రాజ్‌భవన్ వద్ద నిలిచిన ఫైల్!
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ విజయ్ బుధ, గురువారాల్లో రెండుసార్లు గవర్నర్ ఆర్వీ అర్లేకర్‌ను కలిశారు. నిన్న సాయంత్రం మూడోసారి భేటీ అయినప్పటికీ, గవర్నర్ మాత్రం ససేమిరా అన్నారు. తమకు 118 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు ఉందని నిరూపించే మద్దతు లేఖలను సమర్పించాలని, అప్పుడే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. కేవలం మాటల మీద కాకుండా, సంతకాలతో కూడిన ఆధారాలు కావాలని ఆయన పట్టుబట్టడం విజయ్‌కు సవాలుగా మారింది.
కూటమి లెక్కలు: 118 వర్సెస్ 116..
తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుత లెక్కలు ఇలా ఉన్నాయి:
విజయ్ టీవీకే: 108 సీట్లలో గెలిచినప్పటికీ, విజయ్ రెండు స్థానాల నుంచి గెలుపొందడంతో ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 107.
లెఫ్ట్ పార్టీలు: సీపీఐ, సీపీఎంలు 4 ఎమ్మెల్యేల బలంతో విజయ్‌కు బేషరతు మద్దతు ప్రకటించాయి. అయితే వీరు మంత్రివర్గంలో చేరకూడదని నిర్ణయించుకున్నారు.
కాంగ్రెస్: కాంగ్రెస్‌కు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు మద్దతు ప్రకటించినప్పటికీ, అందుకు బదులుగా రెండు మంత్రి పదవులు కావాలని పట్టుబడుతున్నారు.
మొత్తం బలం: 107 (టీవీకే) + 5 (కాంగ్రెస్) + 4 (లెఫ్ట్) = 116 మంది ఎమ్మెల్యేలు.
మ్యాజిక్ ఫిగర్ 118కి విజయ్ కేవలం ఇద్దరు ఎమ్మెల్యేల దూరంలో ఆగిపోయారు. తమిళనాడులోని 62 ఏళ్ల ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని బద్దలు కొట్టిన విజయ్, ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును సంపాదించి తన రాజ్యాభిషేకాన్ని ఎప్పుడు పూర్తి చేసుకుంటారో చూడాలి.
అంతవరకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


