...
...
Next Story

Tata Aeris review : సబ్​-కాంపాక్ట్ సెడాన్ సంచలనం ‘టాటా ఏరిస్’​ కొనాలా? వద్దా? ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ ఇదిగో..

Tata Aeris : సబ్​-కాంపాక్ట్ సెడాన్ టాటా ఏరిస్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! హెచ్​టీ ఆటో టీమ్ నిర్వహించిన టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి. ఇది మీకు ఉపయోగపడుతుంది.

Published on: Oct 8, 2026, 12:23:40 IST
Advertisement

భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, సబ్‌-కాంపాక్ట్ సెడాన్ విభాగానికి పునాది వేసింది టాటా ఇండగో సీఎస్. ఆ తర్వాత మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాల రాకతో ఈ సెగ్మెంట్ మార్కెట్లో విపరీతమైన పోటీని సంతరించుకుంది. ఇక 2017లో వచ్చిన టాటా టిగోర్ వ్యక్తిగత, వ్యాపార వర్గాల్లో మంచి ఆదరణ పొందింది. అయితే, మారిన వినియోగదారుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని టాటా మోటార్స్ ఈ టాటా టిగోర్​ని ఇప్పుడు పూర్తి సరికొత్త అవతారంలో 'టాటా ఏరిస్'గా మార్కెట్లోకి తెచ్చింది. టిగోర్ వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ, ప్రీమియం లుక్స్, ఆధునిక సాంకేతికతతో ఈ కారును రూపొందించారు. మరి మీరు ఈ సెడాన్​ని కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే హెచ్​టీ ఆటో నిర్వహించిన ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూని డీటైల్డ్​గా తెలుసుకోండి..

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్..

టాటా ఏరిస్​ ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ..
టాటా ఏరిస్​ ఫస్ట్​ డ్రైవ్ రివ్యూ..

టాటా ఏరిస్ మొదటి చూపులోనే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కంపెనీకి చెందిన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ టాటా టియాగో డిజైన్ పోలికలు ముందు భాగంలో కనిపిస్తాయి. సొగసైన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, శక్తివంతమైన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, ఫ్రంట్ గ్రిల్ స్థానంలో పియానో బ్లాక్ ప్యానెల్ కారుకు అధునాతన రూపాన్ని ఇచ్చాయి. డ్యూయల్-టోన్ ఓఆర్‌వీఎంలు, సైడ్ క్లాడింగ్స్ కారు స్పోర్టీ స్వభావాన్ని పెంచుతాయి.

అయితే ఏరిస్ కోసం టాటా ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్లు, కొత్త అలాయ్ వీల్స్, కనెక్టెడ్ స్టైల్‌లో ఉండే ఎల్‌ఈడీ టైల్‌లాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ దీనిని టియాగో నుంచి స్పష్టంగా వేరు చేస్తాయి. లగేజీ సామర్థ్యం విషయంలో పెట్రోల్ వేరియంట్‌లో ఈ సెగ్మెంట్‌లోనే అత్యధికంగా 419 లీటర్ల బూట్ స్పేస్‌ను అందించడం ప్రయాణీకులకు పెద్ద ఊరట.

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- ఇంటీరియర్, ప్రాక్టికాలిటీ..

క్యాబిన్ లోపలికి అడుగుపెట్టగానే ప్రీమియం అనుభూతి కలుగుతుంది. పాత మోడల్ డ్యాష్‌బోర్డ్ స్థానంలో సరికొత్త లేయర్డ్ డ్యాష్‌బోర్డ్‌ను టాటా ప్రవేశపెట్టింది. బీజ్, డార్క్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న లెథరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ మెటీరియల్స్ క్యాబిన్ విశాలత్వాన్ని పెంచాయి. టియాగో ఈవీ తరహాలోనే ప్రవేశపెట్టిన 'i-Toggle' పవర్ విండో స్విచ్‌లు వాడటానికి ఎంతో సౌకర్యంగా ఉన్నాయి. పెద్ద డోర్ పాకెట్స్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 65డబ్ల్యూ యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్ట్, ఫ్రంట్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్ ప్రయాణాన్ని మరింత సుఖవంతం చేస్తాయి.

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- ఆధునిక సాంకేతికత, సేఫ్టీ ఫీచర్లు..

సబ్​-కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లను టాటా అందించడం గమనార్హం. మన వేసవి వాతావరణానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. వెనుక ప్రయాణికుల కోసం రేర్ ఏసీ వెంట్స్, కప్ హోల్డర్లతో కూడిన ఆర్మ్‌రెస్ట్ ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా, 360-డిగ్రీ కెమెరాను ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్‌గా కూడా ఉపయోగించవచ్చు. హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో చివరి 5 నిమిషాల డ్రైవింగ్ ఫుటేజ్‌ను ఇది ఆటోమేటిక్‌గా రికార్డ్ చేస్తుంది. ఎక్స్​టర్నల్ మెమరీ డ్రైవ్ అనుసంధానిస్తే 30 నిమిషాల వరకు రికార్డింగ్ సాధ్యమవుతుంది.

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- పెట్రోల్ వేరియంట్ పర్ఫార్మెన్స్..

టాటా ఏరిస్‌లో 1.2 లీటర్, 3-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది 86 బీహెచ్‌పీ పవర్, 113 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పన్నం చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఏఎంటీ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. సిటీ ట్రాఫిక్‌లో కారు హ్యాండ్లింగ్ చాలా తేలికగా, ప్రశాంతంగా ఉంటుంది. క్లచ్ ప్యాడల్ తేలికగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు గేర్ షిఫ్టింగ్‌లో కాస్త నిరోధం అనిపిస్తుంది. పోటీ కార్లయిన జపనీస్, కొరియన్ మోడళ్లతో పోలిస్తే గేర్‌బాక్స్ రిఫైన్‌మెంట్ మరింత మెరుగ్గా ఉంటే బాగుండేది.

వేగం విషయానికి వస్తే, 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకోవడానికి దాదాపు 20 సెకన్ల సమయం పడుతుంది. 120 కిమీ వేగం దాటిన తర్వాత చిన్నపాటి వైబ్రేషన్లు వినిపిస్తాయి. కానీ, టాటా వారి సిగ్నేచర్ సస్పెన్షన్ సెటప్ ఇక్కడ హైలైట్‌గా నిలుస్తుంది. రోడ్డుపై ఉన్న గుంతలు, గతుకులను లోపలి ప్రయాణికులకు తెలియకుండా సస్పెన్షన్ వ్యవస్థ సునాయాసంగా భరిస్తుంది.

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- ఐసీఎన్జీ ఏఎంటీ ఎడిషన్..

టాటా ఏరిస్ ఐసీఎన్జీ వేరియంట్ సీఎన్జీ మోడ్‌లో 75 బిహెచ్‌పీ పవర్, 96.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. సీఎన్జీ మోడ్‌లో ఉన్నప్పుడు పవర్ అవుట్‌పుట్ స్వల్పంగా తగ్గినప్పటికీ, ఏఎంటీ గేర్‌బాక్స్ ట్యూనింగ్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. రోజూ నగరంలో ప్రయాణించే వారికి ఇంధన వ్యయం తగ్గించుకోవడానికి ఇది అత్యుత్తమ ఎంపిక. సీఎన్జీ వేరియంట్‌లో కూడా 217 లీటర్ల ఉపయోగకరమైన బూట్ స్పేస్‌ను టాటా కేటాయించడం విశేషం.

టాటా ఏరిస్ ఫస్ట్​ డ్రైవ్​ రివ్యూ- కొనాలా? వద్దా?

రూ. 5.29 లక్షల (ఎక్స్-షోరూమ్) బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రారంభ ధరలో అధునాతన ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, అగ్రశ్రేణి భద్రతను అందిస్తున్న టాటా ఏరిస్ ఒక ఉత్తమ కాంపాక్ట్ సెడాన్. కాంపాక్ట్ ఎస్‌యూవీ లేదా హ్యాచ్‌బ్యాక్ కొనాలనుకునే కుటుంబాలకు ఇది బలమైన, నమ్మకమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని హెచ్​టీ ఆటో టీమ్ చెబుతోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks