...
...
Next Story

Tata Avinya X : టాటా నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ కారు- 'అవిన్య ఎక్స్​' ఎలా ఉంటుందంటే..

టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'అవిన్య ఎక్స్' రోడ్డు టెస్టింగ్‌లో మొదటిసారి కనిపించింది. సరికొత్త ఫ్లాట్‌ఫారమ్, అదిరిపోయే ఫీచర్లతో 2027లో ఈ లగ్జరీ ఈవీ మార్కెట్లోకి రానుంది.

Published on: Jul 20, 2026 05:19 PM IST
Advertisement

భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) మార్కెట్లో తిరుగులేని రారాజుగా దూసుకుపోతున్న టాటా మోటార్స్, ఇప్పుడు ప్రీమియం లగ్జరీ ఈవీ సెగ్మెంట్‌పై కన్నేసింది. ఇందులో భాగంగా కంపెనీ డెవలప్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ లగ్జరీ ఈవీ ‘టాటా అవిన్య ఎక్స్’కు సంబంధించిన కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ప్లేట్‌తో, పూర్తిగా కవర్ చేసిన (క్యామఫ్లేజ్డ్) ఒక సరికొత్త ఎస్‌యూవీ పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఇది టాటాకు చెందిన ప్రీమియం బ్రాండ్ 'అవిన్య ఎక్స్' మోడలేనంటూ ఆటోమొబైల్ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు డిజైన్, కూపే తరహా లుక్ ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

రోడ్లపై కనిపించిన సరికొత్త టెస్ట్ మ్యూల్..

టాటా అవిన్య ఎక్స్.. ( torq_uenation/Instagram)
టాటా అవిన్య ఎక్స్.. ( torq_uenation/Instagram)

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో ఆధారంగా ఈ కొత్త ప్రోటోటైప్ కారు వివరాలు బయటకు వచ్చాయి. ఎలక్ట్రిక్ కారు బాడీని పూర్తిగా కప్పి ఉంచడం వల్ల అన్ని వివరాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, దాని ఓవరాల్ షేప్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. దీనికి ఉన్న స్లోపింగ్ రూఫ్‌లైన్ (వెనుకకు వంగి ఉండే పైకప్పు) కారుకు ఒక విలాసవంతమైన కూపే ఎస్‌యూవీ లుక్‌ను ఇస్తోంది. ముందు భాగంలో సరికొత్త ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. అంతేకాకుండా, ప్రస్తుతం టాటా లేటెస్ట్ కార్లలో కనిపిస్తున్న కనెక్టెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ సెటప్‌ను ఈ కారుకు అటు ముందు వైపు, ఇటు వెనుక వైపు కూడా అందించినట్లు స్పష్టమవుతోంది.

ఇవే కాకుండా డ్యూయల్-టోన్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, స్మూత్ బాడీ సర్ఫేసింగ్ వంటి ప్రీమియం ఎలిమెంట్స్ కూడా ఈ టెస్టింగ్ కారులో కనిపించాయి. బాడీ ప్యానెల్స్ చాలా వరకు దాచి ఉంచడం వల్ల పూర్తి డిజైన్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అయినప్పటికీ, దీని కొలతలు, లైటింగ్ స్టైల్ చూస్తుంటే ఇది ఖచ్చితంగా టాటా ప్రీమియం ప్రొడక్ట్ అని అర్ధమవుతోంది.

ప్లాట్‌ఫారమ్ ప్లాన్ మారింది!

అయితే, కేవలం అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న కారును తెచ్చి ఇక్కడ రీబ్యాడ్జ్ చేసి అమ్మడం లేదని టాటా స్పష్టం చేసింది. భారతీయ కస్టమర్ల అభిరుచులకు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కారులోని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, సాఫ్ట్‌వేర్ లేయర్స్, వెహికల్ ఫంక్షన్‌లను టాటా ఇంజనీర్లు పూర్తిగా రీవర్క్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం భారత్, చైనా, యూకే దేశాలకు చెందిన నిపుణుల బృందాలు కలిసి పనిచేస్తున్నాయి.

టాటా అవిన్యా- బ్యాటరీ ప్యాక్, లాంచ్ టైమ్‌లైన్

నమ్మదగిన పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం.. మార్కెట్లోకి రానున్న మొదటి అవిన్య మోడళ్లలో 65 kWh నుంచి 80 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించనున్నారు. ప్రీమియం మార్కెట్‌తో పాటు ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవాలంటే రేంజ్, పర్ఫార్మెన్స్, ధర మధ్య సరైన సమతుల్యత ఉండాలి. అందుకే టాటా ఈ బ్యాటరీ సైజ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

టాటా మోటార్స్ తన మొదటి అవిన్య ఈవీ కారును 2027 నాటికి భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ఇదివరకే ధృవీకరించింది. తమిళనాడులోని పనపాకంలో కొత్తగా ప్రారంభించిన ప్రసిద్ధ టీఎంపీవీ-జేఎల్ఆర్​ ప్లాంట్‌లో ఈ సరికొత్త ప్రీమియం కార్ల ఉత్పత్తి జరగనుంది. భవిష్యత్తులో జేఎల్ఆర్ భాగస్వామ్యంతో మరిన్ని లగ్జరీ కార్లను తయారు చేయడానికి టాటా ఈ ప్లాంట్‌ను ఒక ప్రధాన వేదికగా ఉపయోగించుకోనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe