...
...
Next Story

Tata Motors : టాటా మోటార్స్ సరికొత్త ప్లాన్! త్వరలోనే మార్కెట్​లోకి తొలి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ కారు..

Tata Punch Flex Fuel Launch : భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ దేశీయ మార్కెట్​లో తమ మొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరికల్లా లేదా 2027 ప్రారంభంలో ఈ సరికొత్త ఇంధన సాంకేతికతతో కూడిన కారు అందుబాటులోకి రానుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: May 16, 2026, 06:43:26 IST
Advertisement

Tata Motors Flex Fuel Car : భారతదేశంలో సరికొత్త క్లీన్ ఎనర్జీ వాహనాలను పరిచయం చేయడంలో ముందంజలో ఉండే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్.. ఇప్పుడు మరో విప్లవాత్మక అడుగు వేయబోతోంది! దేశీయ మార్కె్​లోకి తమ మొట్టమొదటి ‘ఫ్లెక్స్-ఫ్యూయల్’ కారును తీసుకురావడానికి కంపెనీ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ క్యాలెండర్ ఇయర్ (2026) చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలోనే ఈ మోడల్‌ను లాంచ్ చేయాలని టాటా భావిస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్‌ను (మిశ్రమాన్ని) పెంచుకుంటూ, భవిష్యత్తులో పూర్తిగా ‘ఈ100’ (100% ఇథనాల్) స్థాయికి చేరుకోవాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా టాటా మోటార్స్ ఈ నిర్ణయం తీసుకుంది.

టాటా పంచ్​ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!
టాటా పంచ్​ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ శైలేష్ చంద్ర ఈ కొత్త అప్‌డేట్‌ను అధికారికంగా వెల్లడించారు. వేర్వేరు శాతాల్లో ఇథనాల్ మిశ్రమంతో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల కోసం ఒక స్పష్టమైన కేటగిరీని నిబంధనల్లో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని ఆయన తెలిపారు. అధిక శాతం ఇథనాల్ బ్లెండింగ్‌ను అమల్లోకి తీసుకురావడంపై సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్​ఐఏఎం) ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

టాటా మోటార్స్ ఇప్పటికే 2023 నుంచే తమ పెట్రోల్ వాహనాలన్నింటినీ ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) ఇంధనానికి అనుకూలంగా మార్చేసింది. పర్యావరణహిత ఇంధనాల వైపు సాగుతున్న ప్రయాణంలో భాగంగా ఎలక్ట్రిక్, సీఎన్జీ, హైడ్రోజన్ టెక్నాలజీలతో పాటు ఫ్లెక్స్-ఫ్యూయల్ సాంకేతికతను కూడా కంపెనీ వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగానే, భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టాటా మోటార్స్ తమ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల సాంకేతికతను ప్రదర్శించింది.

టాటా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్..

ముఖ్యంగా ఆటో ఎక్స్‌పో 2025లో టాటా సంస్థ ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్’ కాన్సెప్ట్ మోడల్‌ను ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణ పంచ్ కారులో ఉండే 1.2-లీటర్, త్రీ-సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌నే దీనికి కూడా ఉపయోగించారు. అయితే, వేర్వేరు మోతాదుల్లో ఉండే ఇథనాల్ మిశ్రమాలను తట్టుకునేలా దీని ఈసీయూ, ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, ఎగ్జాస్ట్ ట్రీట్‌మెంట్ సిస్టమ్‌లలో కీలకమైన మార్పులు చేశారు.

ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలను కేవలం పెట్రోల్‌తో కానీ, కేవలం ఇథనాల్‌తో కానీ లేదా ఈ రెండింటి మిశ్రమంతోనైనా నడిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఇథనాల్ అనేది చెరకు, జొన్నలు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే ఒక పర్యావరణహిత బయో ఫ్యూయల్ (జీవ ఇంధనం). ఇది పెట్రోల్ కంటే తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తుంది. అయితే, ఇథనాల్‌కు తుప్పు పట్టించే గుణం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల సాధారణ పెట్రోల్ కార్లలా కాకుండా, ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లలోని ఇంజన్, ఫ్యూయల్ పంప్, ఇంజెక్టర్లను ప్రత్యేకమైన మెటీరియల్స్‌తో తయారు చేస్తారు.

ప్రస్తుతం ఇండియాలో వస్తున్న ఆధునిక కార్లన్నీ ఈ20 (20% ఇథనాల్ బ్లెండ్) ఇంధనానికి మాత్రమే సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఈ85, ఈ100 వంటి గరిష్ట ఇథనాల్ మిశ్రమాల వైపు మొగ్గు చూపుతుండటంతో, కంపెనీలు ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీని వేగంగా అందుబాటులోకి తెస్తున్నాయి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe